అమ్మతనం కోసం వివాహమైన ప్రతి స్త్రీ ఎదురుచూస్తుంటుంది. ఆ క్షణం తనకు ఎప్పుడు వస్తుందా అని. ఆ కల సాకారం అయినట్లే అయి కొందరికి గర్భస్రావం అయిపోతుంటుంది. దీనికి కారణాలు ఎన్నో వుంటాయి. ఐతే గర్భధారణ జరిగినట్లు తెలియగానే కొన్ని పదార్థాలను పక్కన పెట్టేయాలి. అవేమిటో తెలుసుకుందాము.
అధిక పాదరసంతో కూడిన చేపలైన షార్క్, స్వోర్డ్ ఫిష్, ట్యూనా వంటి సముద్రపు చేపలను తినకూడదు.
పీతలు, పచ్చిచేపలు గర్భధారణ జరిగిన సమయంలో తినకపోవడం మంచిది.
సరిగా ఉడికించని మాంసం కూడా అప్పుడే గర్భధారణ చేసిన స్త్రీకి, కడుపులో పెరిగే బిడ్డకి హాని కలిగిస్తాయి.
సరిగా ఉడికించని కోడిగుడ్లలో సాల్మొనెల్లాతో కలుషితమై ఉండవచ్చు, అది గర్భంలోని బిడ్డను ప్రమాదంలో పడేయవచ్చు.
గర్భధారణ సమయంలో అధిక కెఫిన్ తీసుకోవడం వల్ల శిశువు పెరుగుదల పరిమితం కావచ్చు, తక్కువ బరువుతో జననం జరుగుతుంది.
పచ్చి మొలకలు బ్యాక్టీరియాతో కలుషితమై ఉండవచ్చు కనుక వాటిని పూర్తిగా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి.
పండ్లు, కూరగాయలు టాక్సోప్లాస్మాతో సహా హానికరమైన బ్యాక్టీరియాతో కలుషితమై ఉండవచ్చు కనుక శుభ్రమైన నీటితో బాగా కడగడం ముఖ్యం.
పాశ్చరైజ్ చేయని పాలు, జున్ను లేదా కడగకుండే పండ్ల నుంచి తీసే రసాలను తాగవద్దు, ఎందుకంటే ఈ ఆహారాలు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయి.
మద్యం సేవించడం వల్ల గర్భస్రావం, మృత శిశువు జననం, పిండం ఆల్కహాల్ సిండ్రోమ్ ప్రమాదం పెరుగుతుంది.
గర్భధారణ సమయంలో ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం వల్ల అధిక బరువు పెరగడం, గర్భధారణ మధుమేహం ఇతర సమస్యలు రావచ్చు.