1900 నాటి ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోంది: ప్రపంచ బ్యాంకు మాజీ అధిపతి హెచ్చరిక

సోమవారం, 7 సెప్టెంబరు 2020 (14:52 IST)
ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయకపోతే 1900నాటి పరిస్థితులు పునరావృతమయ్యే ముప్పుందని ప్రపంచ బ్యాంకు మాజీ అధిపతి హెచ్చరించారు. అమెరికా, చైనాల మధ్య విభేదాలను రాబర్ట్ జోలిక్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఆర్థిక పరిస్థితి గాడిన పడేందుకు ఇదొక పెద్ద అడ్డుగోడని ఆయన అభివర్ణించారు.

 
అమెరికాలోని అత్యంత సీనియర్ అధికారులో రాబర్ట్ కూడా ఒకరు. తన కెరియర్‌లో ఆరుగురు అమెరికా అధ్యక్షులకు ఆయన సలహాదారుడిగా వ్యవహరించారు. ''విభేదాలకు ముగింపు పలకడమే మనముందున్న ఏకైక మార్గం''అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. అమెరికా, చైనా మధ్య విభేదాలు అత్యంత పెద్ద ముప్పుగా ఆయన అభివర్ణించారు. అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీగానూ ఆయన పనిచేశారు.

 
''నేడు సంబంధాలు బాగా దిగజారిపోయాయి. ఇవి ఇంకెంత పడిపోతాయో తెలియదు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి''అని బీబీసీ ఆసియా బిజినెస్‌ రిపోర్ట్‌లో ఆయన చెప్పారు. ''1900 ముందునాటి పరిస్థితులే ఇప్పుడు కనిపిస్తున్నాయి. అప్పుడు అగ్రదేశాలు ఒకదానితో మరొకటి పోటీపడి పరిస్థితులను దిగజార్చాయి. ప్రపంచీకరణ నుంచి వెనకడుగు వేస్తూ.. జాతీయ ప్రయోజనాలే లక్ష్యంగా దేశాలు ముందుకు వెళ్తూపోతే.. అప్పటి సంక్షోభం మళ్లీ వస్తుంది''

 
ఆర్థిక సంక్షోభం
2007 నుంచి 2012 మధ్య ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా రాబర్ట్ పనిచేశారు. ఆ సమయంలో ఆర్థిక మాంద్యం ప్రపంచ దేశాలను వెంటాడింది. ప్రపంచ బ్యాంకు అధిపతిగా ఆర్థిక మందగమనం నుంచి దేశాలను గట్టెక్కించేందుకు ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లతో ఆయన కలిసి పనిచేశారు.
 
''2008-09నాటి ఆర్థిక సంక్షోభం తీవ్రమైనది. అయితే జీ-20 దేశాలు, కేంద్ర బ్యాంకులు కలిసి పనిచేశాయి. అప్పటి బ్రిటన్ ప్రధాని గోర్డెన్ బ్రౌన్‌, అమెరికా అధ్యక్షులు బుష్, ఒబామా కలిసి మాతో పనిచేశారు''. ''నిజం చెప్పాలంటే.. చైనా కూడా చర్యలు తీసుకుంది. చాలా విధాలుగా సహకరించింది. ఆ సహకారం నేడు కనిపించడం లేదు''. ''కరోనావైరస్‌కు చైనానే కారణమని అమెరికా నిందించే బదులు.. ఒక పరిష్కారం కనుగొనేందుకు రెండు దేశాలు కలిసి పనిచేయాలి'' 

 
ట్రంప్ వల్ల విధ్వంసం
ప్రస్తుత విధ్వంసంలో చాలా వరకు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ వల్లే జరుగుతోందని రాబర్ట్ ఆరోపించారు. రిపబ్లికన్ అధ్యక్షులు జార్జ్ డబ్ల్యూ బుష్, జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్‌ల హయాంలోనూ రాబర్ట్ పనిచేశారు. కానీ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ విషయంలో తన అయిష్టాన్ని బహిరంగంగానే ఆయన బయటపెట్టారు.

 
''నేను మొదట్నుంచీ ట్రంప్‌తో విభేదిస్తున్నాను. ఆయన విధానపరమైన నిర్ణయాలు మాత్రమే కాదు.. ఆయన ఆలోచనలు, ఆయన వ్యక్తిత్వంలోనే లోపాలున్నాయి''. ''సంస్థలు, రాజ్యాంగంతో ఆయన ఏం చేయగలరో మనం చూస్తున్నాం. కరోనావైరస్‌తో మరో కొత్త కోణం బయటపడింది. దీంతో ఆయన సామర్థ్యంపైనే సందేహాలు వస్తున్నాయి. మొదట్నుంచీ అందుకే నేను ఆందోళన వ్యక్తం చేస్తున్నా''

 
''అమెరికా మిత్రదేశాలపై ట్రంప్ వ్యక్తంచేస్తున్న సంశయాలు.. ఆసియా దేశాల్లో గందరగోళాన్ని మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా చైనా సూపర్ పవర్‌గా ఎదుగుతున్న తరుణంలో ఈ ఆందోళనలు మరింత ఎక్కువవుతున్నాయి.'' ఈ విషయాన్ని రాబర్ట్ ఇటీవల రాసిన పుస్తకం ఎ హిస్టరీ ఆఫ్ యూఎస్ డిప్లొమసీ అండ్ ఫారెన్ పాలసీలోనూ ప్రస్తావించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు