ఏరియా 51: ఇక్కడ గ్రహాంతర జీవులున్నాయా.. ఎవరూ రావొద్దని అమెరికా ఎయిర్‌ఫోర్స్ వార్నింగ్ ఎందుకు?

గురువారం, 18 జులై 2019 (15:36 IST)
అమెరికా రహస్య రక్షణ స్థావరం 'ఏరియా 51'పై దండెత్తాలంటూ ఫేస్‌బుక్‌లో క్రియేట్ చేసిన ఓ ఈవెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఏరియా 51పై దండెత్తడానికి తాము సిద్ధమేనంటూ 10 లక్షల మందికిపైగా స్పందించారు. వేలాది మంది దీనిపై రకరకాల కామెంట్లు కూడా పెట్టారు. నెవడాలో ఉన్న ఈ రహస్య రక్షణ స్థావరంలో గ్రహాంతర జీవులు కూడా ఉన్నాయని చాలామంది నమ్ముతుంటారు.
 
ఫేస్‌బుక్‌ యూజర్ల స్పందన నేపథ్యంలో ఎయిర్‌ఫోర్స్ కూడా స్పందించింది. ఎవరూ ఏరియా 51 వైపు వెళ్లొద్దని హెచ్చరించింది. ''అమెరికా, దాని ఆస్తులను రక్షించడానికి మేం సిద్ధంగా ఉన్నాం'' అని ఎయిర్‌ఫోర్స్ అధికార ప్రతినిధి ఒకరు 'ది వాషింగ్టన్ పోస్ట్'తో అన్నారు. అయితే.. ఫేస్‌బుక్ యూజర్లు కొందరు ఇదంతా సరదాగా చేస్తున్నదేనని చెబుతున్నారు. ఈ ఈవెంట్ పేజీలోనే జాక్సన్ బార్నెస్ అనే యూజర్ 'హలో యూఎస్ గవర్నమెంట్.. ఇది జోక్ మాత్రమే. అక్కడకు వెళ్లాలని నేనేమీ అనుకోవడం లేదు'' అంటూ కామెంట్ పోస్ట్ చేశారు.
 
కానీ, ఎయిర్‌ఫోర్స్ మాత్రం దాన్ని సరదాగా తీసుకోవడం లేదు. ''అమెరికా వైమానిక దళానికి శిక్షణ ఇచ్చే ప్రదేశం ఇది. ఇక్కడకు ఇతరులు ఎవరూ రావడానికి వీల్లేదు. రావొద్దనే చెబుతున్నాం'' అని ఎయిర్‌ఫోర్స్ అధికార ప్రతినిధి అన్నారు. 
 
అక్కడ గ్రహాంతర జీవులున్నాయా?
గుర్తు తెలియని ఎగిరే పళ్లాలు (యూఎఫ్‌వో)లు, గ్రహాంతర జీవులకు సంబంధించిన సమాచారం అమెరికా ప్రభుత్వం వద్ద ఉందని.. దానికి సంబంధించిన రహస్యాలను సాధారణ ప్రజలకు అమెరికా ప్రభుత్వం తెలియనివ్వదని.. గతంలో పట్టుకున్న గ్రహాంతర జీవులు, వారి సాంకేతికత, యూఎఫ్‌వోలు వంటివన్నీ ఇక్కడ ఉంటాయని చాలామంది అమెరికన్లు అనుమానిస్తుంటారు, విశ్వసిస్తుంటారు.
 
ఈ ప్రాంతం గురించి మొట్టమొదటిసారి 1989లో చర్చ మొదలైంది. బాబ్ లాజర్ అనే వ్యక్తి ఓ టీవీ చానల్‌లో మాట్లాడుతూ తాను ఏరియా 51లో పనిచేస్తున్నట్లు క్లెయిం చేసుకోవడంతో పాటు.. అక్కడ యూఎఫ్‌వోలు, గ్రహాంతర జీవులకు సంబంధించిన సమాచారం ఉందని.. తాను చూశానని చెప్పారు.
 
ఇంతకీ ఏమిటీ ఏరియా 51, కచ్చితంగా ఎక్కడుందీ ప్రాంతం?
నెవడా రాష్ట్రంలోని లాస్ వెగాస్‌ నగరానికి వాయవ్యంగా 120 కిలోమీటర్ల దూరంలో ఎడారిలో ఉన్న మిలటరీ బేస్ ఇది. అమెరికా ప్రభుత్వం దీనని నెవడా టెస్ట్ అండ్ ట్రైనింగ్ రేంజ్ అని పిలుస్తుంది. అమెరికా దీన్ని రహస్య స్థావరంగానే ఉంచింది. ఫేస్‌బుక్ యూజర్లు చెబుతున్నట్లు దీనిపై దండెత్తడం అంత సులభమేమీ కాదు. అక్కడికి సాధారణ ప్రజలెవరూ వెళ్లడానికి వీల్లేదు. పైగా... అత్యాధునిక ఆయుధాలు ధరించిన గార్డులు నిత్యం చుట్టూ కాపలా కాస్తుంటారు.
 
ఈ స్థావరానికి గగనతలం నుంచి కూడా చేరుకోవడం అసాధ్యం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి లేకుండా ఆ ప్రాంతం మీదుగా ఎలాంటి విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు ఎగరలేవు.
 
ఏరియా 51 దగ్గర ఎలా ఉంటుంది?
"లోపలకి వెళ్లేందుకు మాకు సాధ్యం కాదని తెలుసు, కానీ ఓసారి ప్రయత్నిద్దామని అనుకున్నాం. ఎంత వరకూ వెళ్లగలిగితే అంతవరకూ వెళ్లాలని నిర్ణయించాం. మమ్మల్ని చూస్తే అక్కడున్న భద్రతా సిబ్బంది ఎలా స్పందిస్తారో చూడాలనిపించింది" అని సినీద్ గార్వాన్ అన్నారు. గార్వాన్ గతంలో రేడియో 1 న్యూస్ బీట్‌ కార్యక్రమంలో ఎంటర్‌టైన్‌మెంట్ రిపోర్టర్‌గ పనిచేశారు. 2014లో తన పర్యటనల్లో భాగంగా ఓసారి ఆమె ఏరియా 51 దగ్గరకు వెళ్లారు.
 
"ఇక్కడున్న ప్రాంతాలన్నీ గ్రహాంతరవాసుల వాతావరణాన్ని పోలినట్లుగా ఉన్నాయి. మార్గమధ్యంలో 'భూగ్రహ నివాసులకు స్వాగతం' అనే బోర్డులుంటాయి. పెట్రోల్ బంకుల దగ్గర కూడా గ్రహాంతరవాసుల థీమ్ డిజైన్లే కనిపిస్తాయి. వారికి సంబంధించిన వస్తువులను అక్కడి దుకాణాల్లో అమ్ముతుంటారు. ఇక్కడున్న కొన్ని భవనాల గోడలపై గ్రహాంతరవాసులను పోలిన బొమ్మలు, కార్టూన్లు కనిపిస్తాయి. మేం కొన్ని ఫొటోలు తీసుకుందామని అనుకున్నాం కానీ భద్రతా సిబ్బంది చూస్తూ ఉంటారనే భయంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాం" అని గార్వాన్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు