ఆనందం ఏ వయసులో తగ్గిపోతుంది... సైన్స్ ఏం చెబుతోంది?
శనివారం, 18 జనవరి 2020 (16:15 IST)
మనుషుల్లో ఏ వయసులో ఆనందం తగ్గిపోతుంది? 'నడివయసు నైరాశ్యం' (మిడ్ లైఫ్ క్రైసిస్) నిజమేనా? ఈ ప్రశ్నలకు డేవిడ్ బ్లాంచ్‌ఫ్లవర్ అనే ఆర్థికవేత్త సమాధానాలు చెబుతున్నారు. జీవితంలో ఆనందపు రేఖ U ఆకారంలో ఉంటుందని ఆయన అంటున్నారు. 134 దేశాల్లో ఈ అంశంపై సమగ్ర అధ్యయనం చేసిన బాంచ్‌ఫ్లవర్, 'నడి వయసు నైరాశ్యం' గురించి కూడా వివరించారు.
భిన్న సంస్కృతులకూ ఈ సంతోషపు రేఖ ఒకేలా ఉండటం ఒకింత ఆశ్చర్యకరమే. దాని ప్రకారం యవ్వనంలో మనం ఆనందంగా ఉంటాం. 40ల్లోకి వస్తున్న కొద్దీ సంతోషం తగ్గుతూ ఉంటుంది. వృద్ధాప్యంలో మళ్లీ ఆనందం చిగురిస్తుంది. అంటే జీవితం మొదట్లో, 50ల తర్వాత ఎక్కువ ఆనందంగా ఉంటాం. మధ్యలో మాత్రం అలా ఉండదు.
వివిధ రకాలుగా ఆనందాన్ని కొలుస్తూ జరిగిన చాలా అధ్యయనాలు.. జనాలు అత్యంత తక్కువ ఆనందంగా ఉండే వయసు అభివృద్ధి చెందిన దేశాల్లో 47.2 ఏళ్లని, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 48.2 అని లెక్కగట్టాయి. ''ఇది మనుషుల జన్యువుల్లోనే ఉంది. U ఆకారంలో ఉండే జీవితంలో ఆనందపు రేఖ.. కోతులకూ వర్తిస్తుంది. 47 ఏళ్లప్పుడు మనుషులు ఎక్కువ వాస్తవికంగా ఆలోచిస్తుంటారు'' అని బ్లాంచ్‌ఫ్లవర్ బీబీసీతో అన్నారు.
50 ఏళ్ల తర్వాత మళ్లీ ఉన్నదానితో సంతృప్తి చెంది, ఆనందంగా ఉండటం మొదలవుతుందని ఆయన చెప్పారు. ''యాభైలలో ఉన్నవారికి శుభవార్తే. ఇక నుంచి మీ జీవితాలు మెరుగుపడతాయి. మీరు జీవించే పరిస్థితులు మెరుగుపడతాయని దీని అర్థం కాదు. ఏది ఆనందం అన్నదానిపై మీ దృక్పథం మారుతుంది'' అని బ్లాంచ్‌ఫ్లవర్ వివరించారు. ''డెబ్భయిలలో ఆరోగ్యంగా ఉంటూ, పని చేస్తున్నందుకు సంతోషించేవాళ్లు ఉన్నారు. నడి వయసులో మాత్రం బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి'' అని అన్నారు.
తక్కువ అంచనాలు
మనస్తత్వ శాస్త్రం ప్రకారం చూస్తే, బ్లాంచ్‌ఫ్లవర్ వాదనకు వివరణ దొరుకుతుంది. దాని ప్రకారం వయసుపైబడిన కొద్దీ తమ బలాబలాలను మనుషులు తెలుసుకుంటారు. సాధించలేని లక్ష్యాలను తగ్గించుకుంటారు. ఆశావహ దృక్పథంతో ఉండే మనుషులు ఎక్కువ కాలం బతుకుతారు. ఆనందపు రేఖ Uలా మారడానికి ఇదీ ఓ కారణం. సాధారణంగా ఆనందాన్ని ఆర్థికపరమైన విషయాలతో ముడిపెట్టి చూస్తుంటాం.
ఆర్థికంగా సఫలమవ్వలేకపోతున్న పరిస్థితులు.. 40ల చివర్లో ఎక్కువగా బాధిస్తాయని బ్లాంచ్‌ఫ్లవర్ అంటున్నారు. పెద్దగా చదువుకోనివారిపై, నిరుద్యోగులపై, కుటుంబ బంధాలు సరిగ్గా లేనివారిపై, సన్నిహితులు ఎక్కువగా లేనివారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ''నడి వయసులో చాలా సున్నితమైన పరిస్థితుల్లో ఉంటాం. అందుకే సవాళ్లను ఎదుర్కోవడం ఇంకా కష్టమవుతుంది'' అని బ్లాంచ్‌ఫ్లవర్ అన్నారు.
మెదడులో మార్పులు
50ల తర్వాత జీవితం ఎందుకు మెరుగవుతోందో అన్న అంశంపై బ్రూకింగ్ ఇన్‌స్టిట్యూషన్‌కు చెందిన పరిశోధకుడు జొనాథన్ రౌచ్ ఓ పుస్తకంలో విశ్లేషించారు. భిన్నరంగాల్లో ఉన్నవారిని ఇంటర్యూ చేసిన ఆయన.. వయసు పెరుగుతున్నకొద్దీ లక్ష్యాల కన్నా, వ్యక్తులతో బంధాలకు ప్రాధాన్యత ఇచ్చేలా మన మెదడులో మార్పులు వస్తున్నాయని గుర్తించారు.
''ఇది ఆరోగ్యకరమైన మార్పే. మన అంచనాలు మరీ అందనంత దూరంలో ఉన్నాయని తెలుసుకోవడం వల్ల 40ల్లో నడివయసు నైరాశ్యం వస్తుంటుంది'' అని రాచ్ అభిప్రాయపడ్డారు. లక్ష్యాలను సాధించినప్పుడు వచ్చే ఆనందం గురించి ఎక్కువగా ఊహించుకుంటూ యువతీయువకులు జీవితాల్లో తప్పుడు అంచనాలు వేసుకుంటుంటారు. వృద్ధులు మాత్రం అంచనాల భారాన్ని దింపేసుకుని, భావోద్వేగాలను ఎలా నియంత్రించుకునే నైపుణ్యాలను సంపాదించుకుంటారు.