చంద్రయాన్ -3: ఇస్రోకు ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటి వరకు ఏం సమాచారం ఇచ్చింది?

గురువారం, 31 ఆగస్టు 2023 (13:36 IST)
చంద్రయాన్ -3 ల్యాండర్ అయిన విక్రమ్, రోవర్‌ను మోస్తూ ఉత్కంఠ క్షణాల మధ్య ఆగస్టు 23న చంద్రుని గడ్డను తాకింది. ప్రపంచవ్యాప్తంగా ఈ దృశ్యాలను కోట్లాది మంది వీక్షించారు. కొన్ని గంటల తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ ల్యాండర్ నుంచి నిష్క్రమించి చంద్రునిపై మొదటి అడుగులు వేసింది. రోవర్ అన్వేషణలో భాగంగా అది తీస్తున్న ఫొటోలు, కవర్ చేస్తున్న దూరం, దాని మార్గంలో ఉన్న అడ్డంకులను ఎలా ఎదుర్కోవాలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కమాండ్స్ ఇస్తూ నిరంతరం పర్యవేక్షిస్తోంది.
 
రోవర్ మూన్‌వాక్ మొదటి వారాన్ని పరిశీలిస్తే..
ఇప్పటి వరకు మనం ల్యాండర్ తీసిన రోవర్ వీడియోలు, చిత్రాలను మాత్రమే చూశాం. కానీ బుధవారం ఉదయం ప్రజ్ఞాన్ తన కెమెరాను విక్రమ్ ల్యాండర్‌ వైపు తిప్పి దాని ఫొటో తీసింది. దీనిని "స్మైల్, ప్లీజ్!" అనే క్యాప్షన్’తో ఇస్రో సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇస్రో విడుదల చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో విక్రమ్ చంద్రుని నేలపై తన ఆరు కాళ్లను గట్టిగా మోపి నిలబడినట్లు చూపిస్తోంది. ఈ ఫొటోను రోవర్‌ నావిగేషన్ కెమెరా తీసిందని ఇస్రో తెలిపింది.
 
సల్ఫర్ వివరాలు కీలకం
గత కొన్ని రోజులుగా రోవర్ కష్టపడి పని చేస్తోంది. మంగళవారం సాయంత్రం రోవర్‌కు ఉన్న ‘లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్ప్రెక్ట్రోస్కోప్’(ఎల్ఐబీఎస్) పరికరం చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో సల్ఫర్ ఉన్నట్లు కనుగొందని ఇస్రో వెల్లడించింది. దీంతోపాటు అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, సిలికాన్, ఆక్సిజన్‌ల ఉనికిని ప్రజ్ఞాన్ రోవర్ కనుగొందని ఇస్రో ప్రకటించింది. ఇక, హైడ్రోజన్ కోసం రోవర్ అన్వేషణ కొనసాగుతోందని తెలిపింది. 1970లలోనే అపోలో, లూనా ప్రాజెక్టులు సేకరించిన నమూనాల ద్వారా చంద్రుని నేలలో సల్ఫర్ ఉందని తెలిసిందని బీబీసీ ప్రతినిధి సౌతిక్ బిస్వాస్‌తో నాసా శాస్త్రవేత్త నోహ్ పెట్రో తెలిపారు. ఈ సందర్భంగా ప్రజ్ఞాన్ పరిశోధనలను అద్భుతమని ఆయన అభివర్ణించారు. "చంద్రుని ఉపరితలంపై సల్ఫర్‌ వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఖనిజం లోపల లేకుంటే సల్ఫర్ అస్థిర మూలకమే. అంటే అది క్రిస్టల్‌లో భాగం కాకపోతే ఉపరితలంపై చాలా చల్లగా ఉంటుంది" అన్నారు నోహ్.
 
రోవర్ ఎంత దూరం నడిచిందంటే?
రోవర్ చంద్రుడిపై ల్యాండింగ్ అయిన పాయింట్‌‌ను శివశక్తిగా నామకరణం చేసింది భారత్. ఇస్రో చంద్ర రహస్యాల అన్వేషణలో రోవర్ చాలా దూరం ప్రయాణించింది. అయితే, చంద్రునిపై అక్కడక్కడ ఉన్న గుంటలు, గోతుల కారణంగా రోవర్ మార్గం మార్చుకోవల్సి వస్తోంది. ల్యాండింగ్ అయిన రెండు రోజుల తర్వాత సెకనుకు 1 సెంటీమీటర్ వేగంతో ప్రయాణించే ప్రజ్ఞాన్ ఇప్పటి వరకు 8 మీటర్ల (26 అడుగులు) దూరానికి పైగా వెళ్లిందని ఇస్రో తెలిపింది.
 
ఆదివారం రోవర్ ప్రయాణిస్తుండగా చంద్రునిపై నాలుగు మీటర్ల వ్యాసం కలిగిన ఒక గొయ్యి ఎదురైంది. మూడు మీటర్ల దూరంలో ఉన్నప్పుడే దాన్ని గుర్తించారు. దీంతో "మార్గాన్ని మార్చుకోవాలని శాస్త్రవేత్తలు దానికి కమాండ్స్ ఇచ్చారు. ఇపుడది సురక్షితంగా మరో మార్గంలో వెళుతోంది" అని ఇస్రో తెలిపింది. ఇస్రో విడుదల చేసిన ఫొటోల్లో ఆ గొయ్యి, చంద్రునిపై రోవర్ మిషన్ పాదముద్రలు కనిపించాయి. రోవర్ ముందుకు వెళ్లి తిరిగి వచ్చినట్లు కూడా ఫొటోల్లో కనిపించింది.
 
చంద్రుడిపై ఉష్ణోగ్రత ఎలా ఉంది?
విక్రమ్ ల్యాండర్‌‌లోని ChaSTE పరికరం నుంచి చంద్రుని ఉపరితలం, అంతేకాకుండా 10 సెంటీమీటర్ల లోతు వరకు గల ఉష్ణోగ్రతపై మొదటి డేటాను అందుకున్నామని ఇస్రో ఆదివారం తెలిపింది. ChaSTE అంటే చంద్రుని ఉపరితలంపై థర్మోఫిజికల్ ప్రయోగం. దీనిని 10 టెంపరేచర్ సెన్సర్‌లను అమర్చారు. ఇది కొంత డేటాను పంపించింది. చంద్రుని ఉపరితలం, దిగువ ఉష్ణోగ్రతలలో తీవ్ర వ్యత్యాసం ఉన్నట్లు ఇస్రో ట్విటర్‌లో విడుదల చేసిన గ్రాఫ్ ఫొటో ద్వారా తెలిసింది. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత దాదాపు 60C ఉంది. అదేసమయంలో ఉపరితలం కింద తీవ్రంగా పడిపోయింది. చంద్రుడి ఉపరితలం కింద 3 అంగుళాల లోతులో -10Cకి ఉష్ణోగ్రత పడిపోయింది.
 
చంద్రుడిపై ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు ఆశ్చర్యపరిచాయని ఇస్రో శాస్త్రవేత్త బీహెచ్ దారుకేషా పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు. "ఉపరితలంపై 20C నుంచి 30C ఉష్ణోగ్రత ఉంటుందని మేం అనుకున్నాం, అయితే ఇది మేం ఊహించిన దాని కంటే ఎక్కువ" అని దారుకేషా చెప్పారు. చంద్ర గ్రహంపై తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉంటాయని నాసా అంటోంది. చంద్రుని మధ్యరేఖ సమీపంలో పగటి ఉష్ణోగ్రతలు 250F (120C)కి స్థాయికి చేరుకుంటాయని, రాత్రి ఉష్ణోగ్రతలు -208F (-130C)కి పడిపోతాయని నాసా అంచనా.
 
అంతేకాదు చంద్రుని ధ్రువాలు మరింత చల్లగా ఉంటాయి. ఉత్తర ధ్రువానికి సమీపంలో ఉన్న ఒక బిలంలో -410F (-250C) ఉష్ణోగ్రత నమోదైంది. ఇది మొత్తం సౌర వ్యవస్థలో అత్యంత శీతల ఉష్ణోగ్రతగా భావిస్తారు. చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతాలలో ఉన్న గుంటలలో అలాంటి చల్లని ఉష్ణోగ్రతలను గుర్తించారు శాస్త్రవేత్తలు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు