ఆమెను ఒక ఆసుపత్రి నుంచి మరొక ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. ఆమె కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేం కేసును దర్యాప్తు చేపడుతున్నాంఅని బెంగళూరు పోలీస్ (ఉత్తర విభాగం) డిప్యూటీ కమిషనర్ అవినాశ్ పాటిల్ బీబీసీతో చెప్పారు. ఫిర్యాదులో వైద్యులు నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు వారు ఆరోపించారు. దీంతో సీఆర్పీసీలోని సెక్షన్ 174 కింద కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపడుతున్నాంఅని ఆయన వివరించారు.
అసలేం జరిగింది?
గీత, దొరస్వామిలాంటి సీరియల్స్‌లో నటించి చేతన గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట చేతనా రాజ్ పరిస్థితి గురించి ఒక వైద్యుడు పోలీసులకు సమాచారం అందించారు. ఒక అనష్తీషియా నిపుణుడు అపస్మారక స్థితిలోనున్న చేతనను మా ఆసుపత్రికి తీసుకొచ్చారుఅని ఆ వైద్యుడు పోలీసులతో చెప్పారు.
ఆమెకు గుండెపోటు వచ్చిందని మాత్రమే ఆ అనష్తీషియా నిపుణుడు చెప్పారు. వెంటనే మేం ఆమెకు వైద్యం అందించేందుకు ప్రయత్నించాం. అప్పటికే ఆమె మరణించారుఅని ఒక డాక్టర్ చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, చేతనా గత సోమవారం బరువును తగ్గించుకునేందుకు లైపోసక్షన్ శస్త్రచికిత్స చేయించుకున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి.
ఈ శస్త్రచికిత్సలో భాగంగా శరీరంలోని భిన్న భాగాల్లో పేరుకున్న కొవ్వును వైద్యులు తొలగించేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా కొవ్వు వేరే ప్రాంతానికి వెళ్లే అవకాశంలేని తొడలు, కడుపు, పిరుదులు లాంటి శరీర భాగాల్లోని కొవ్వును శస్త్రచికిత్సతో తొలగిస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఈ చికిత్సలు విఫలమై రోగి ప్రాణాలకే ముప్పు ఉంటుంది.