ఫిమేల్ వయాగ్రా: వాంఛలు పెంచటానికి ఉద్దేశించిన ‘విలీజి’పై వివాదమెందుకు?

శనివారం, 20 జులై 2019 (19:58 IST)
అమెరికా మహిళల్లో 10 శాతం మందిలో లైంగిక వాంఛ లోపం తీవ్రంగా ఉందని అంచనా.. దీనిని హెచ్ఎస్‌డీడీ వ్యాధిగా చెప్తున్నారు. అమెరికా మహిళలకు లైంగిక వాంఛను పెంచే కొత్త ఔషధం ఒకటి అందుబాటులోకి వచ్చింది. దీనిని నూతన ''ఫిమేల్ వయాగ్రా'' అని పిలుస్తున్నారు.


ప్రజలు ఉపయోగించే ఔషధాలు సురక్షితంగా ఉండేలా పర్యవేక్షించే అమెరికా ప్రభుత్వ సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ).. విలీజికి ఆమోద ముద్ర వేసినట్లు వచ్చిన వార్తను తొలుత మహిళల లైంగిక ఆరోగ్యానికి ఓ గెలుపుగా స్వీకరించారు.

 
కానీ.. అనంతరం కొద్ది వారాల్లోనే లైంగిక వాంఛ వంటి సంక్లిష్టమైన విషయాల్లో ఔషధాల పాత్ర ఎలా ఉండాలన్న అంశం మీద చర్చ మళ్లీ రాజుకుంది. ఈ ఔషధాన్ని బ్రెమెలానోటైడ్ అని పిలుస్తారు. విలీజి అనేది దాని బ్రాండ్ పేరు. మెనోపాజ్ ముందు దశలో ఉన్నట్లు కానీ మెనోపాజ్ దశలో ఉన్నట్లు కానీ చెప్పే లక్షణాలేవీ లేకపోయినా.. హైపోయాక్టివ్ సెక్సువల్ డిజైర్ డిజార్డర్ (హెచ్ఎస్‌డీడీ) అనే పరిస్థితితో బాధపడుతున్న యువతులు, వయసు పైబడ్డ మహిళలు.. ఇద్దరి కోసమూ దీనిని తయారుచేశారు.

 
లైంగిక కార్యకలాపాల మీద తరచుగా ఆసక్తి లేకపోవటం ఈ వ్యాధి లక్షణంగా వైద్యులు అభివర్ణిస్తారు. అమెరికాలో పిల్లలు కనే వయసులోని మహిళల్లో ఆరు శాతం నుంచి 10 శాతం మందిపై దీని ప్రభావం ఉన్నట్లు అంచనా. నిజానికి ''ఫిమేల్ వయాగ్రా''ను మార్కెట్‌లో ప్రవేశపెట్టటానికి ఫార్మాస్యూటికల్ పరిశ్రమ ప్రయత్నించటం ఇది రెండోసారి. అయితే.. ఈ కొత్త ఔషధం పనితీరుపైనా, ప్రయోజనాల పైనా వైద్యులు సందేహాలు వ్యక్తం చేయటంతో పాటు.. ఈ డ్రగ్‌ను ఉపయోగించటం ద్వారా మహిళలు ప్రమాదంలో పడతారని చెప్పటంతో వివాదం తలెత్తింది. అసలు బ్రెమెలానోటైడ్ నిజంగా పనిచేస్తుందా? దీనికి అనుబంధంగా ఉన్న ఆరోగ్యపరమైన సమస్యలు ఏమిటి?
 
ఇంజక్షన్లు వర్సెస్ మాత్రలు
పాలాటిన్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసిన ఈ విలీజి డ్రగ్‌ను విక్రయించేందుకు అమాగ్ ఫార్మాస్యూటికల్స్ లైసెన్స్ పొందింది. ఈ ఔషధాన్ని స్వయంగా చేసుకోగల ఇంజక్షన్ ద్వారా తీసుకుంటారు. రెండు న్యూరోట్రాన్సిమిటర్ల స్థాయిని నియంత్రించటం ద్వారా - డోపమైన్ విడుదలను పెంచటం, సెరొటోనిన్ విడుదలను తగ్గించటం ద్వారా - ఆందోళనను తగ్గించి.. లైంగిక వాంఛను పెంచటం ఈ డ్రగ్ ఉద్దేశం. స్ప్రౌట్ ఫార్మాస్యూటికల్స్ విక్రయించే 'యాడియి' అనే డ్రగ్‌తో ఈ 'విలీజి' డ్రగ్ పోటీపడుతుంది. రోజూ వేసుకునే మాత్ర 'యాడియి'ని ఎఫ్‌డీఏ 2015లో ఆమోదించింది.

 
అప్పుడు ఆ నిర్ణయం కూడా వివాదాస్పదంగా మారింది. యాడియి ప్రభావం అత్యల్పమని.. అసురక్షితం కూడా కావచ్చునని కొందరు నిపుణులు పేర్కొనటం దానికి కారణం. అయితే.. యాడియి ఉపయోగించేటపుడు మద్యపానం మానివేయాలని దాని తయారీ సంస్థ తొలుత సూచించింది. కానీ.. విలీజి డ్రగ్‌ను తీసుకునేటపుడు మద్యపానం మానేయాల్సిన అవసరం లేదని.. ఈ ఔషధ తయారీదారులు చెప్తున్నారు.

 
దీనిని రోజువారీగా ఉపయోగించకుండానే వేగంగా ప్రభావం చూపుతుందని.. దీనివల్ల దుష్ప్రభావాలు అతి తక్కువగా ఉంటాయని భరోసా ఇస్తున్నారు. ఈ రెండు డ్రగ్‌ల తయారీ సంస్థల వ్యవహారాలను పరిశీలించిన జర్నలిస్ట్ మాడలీన్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఆయా సంస్థలు చెప్తున్న మాటలను ప్రశ్నిస్తున్నారు. ''సెక్స్‌కి కనీసం 45 నిమిషాల ముందు విలీజిని ఇంజెక్ట్ చేసుకోవాలని పేషెంట్లకు నిర్దేశిస్తున్నారు. కానీ.. ఈ డ్రగ్ తీసుకున్న గంటలోపు వికారానికి లోనవుతున్నామని పరీక్షలో పాల్గొన్న 40 శాతం మంది వినియోగదారులు చెప్పారు. దీనివల్ల వారి ప్రణాళిక రద్దయిపోవచ్చు'' అని ఆమె పేర్కొన్నారు.
మౌనంగా బాధపడుతున్నారు
అమెరికాలో ప్రతి 10 మంది మహిళల్లో ఒకరికి హెచ్ఎస్‌డీడీ సమస్య ఉందని.. వారిలో చాలా మంది అసలు చికిత్స కోసమే వెళ్లరని 2016లో నిర్వహించిన ఒక అధ్యయనం చెప్తోంది. ''ఈ మహిళలు మౌనంగా బాధపడుతుంటారు. అంటే.. ఈ ఉత్పత్తికి నిజంగా మార్కెట్ లేదని అర్థం'' అంటారు అమాగ్ ఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విలియం హేడెన్.

 
''అయినా.. అసలు స్త్రీలలో హెచ్‌ఎస్‌డీడీ అనేది ఒక వ్యాధేనా అన్నది ప్రధాన ప్రశ్న. మెనోపాజ్ ముందు దశలో ఉన్న మహిళల్లో దాదాపు 60 లక్షల మందికి ఈ లక్షణం ఉందని లీరింక్ విశ్లేషకులు అంచనావేశారు. కానీ.. వారిలో 95 శాతం మందికి వారికి ఒక జబ్బు ఉందని తెలియదని సదరు విశ్లేషకులే ఒప్పుకున్నారు'' అని ఆర్మ్‌స్ట్రాంగ్ పేర్కొన్నారు. కానీ.. విలీజి వార్షిక విక్రయాలు 100 కోట్ల డాలర్లకు చేరతాయని పరిశ్రమ విశ్లేషకుల అంచనా.

 
కన్సల్టెన్సీ గ్రూప్ అయిన బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్.. అమెరికాలో యాడియి ప్రిస్క్రిప్షన్లు గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో 400 శాతం పెరిగాయని.. మొత్తం 3,000 సంఖ్యకు చేరాయని చెప్తోంది. ఈ పెరుగుదల ఉన్నా కూడా.. నెలకు 10 లక్షల ప్రిస్క్రిప్షన్లు ఉండే వయాగ్రాతో దీనిని సరితూచలేం.

 
వివాదం
విలీజి డ్రగ్ పరీక్షా సమయంలో 40 శాతం మంది వినియోగదారులు తమకు ఒక మోస్తరు స్థాయి నుంచి తీవ్ర స్థాయి వరకూ వికారం కలుగుతోందని చెప్పారని అమాగ్ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది. అలాగే.. శరీరంలో వేడి సెగలు, తలనొప్పులు వంటి ఇతర అనుబంధ ప్రభావాలు కూడా నమోదయ్యాయని వివరించింది. మెదడులో లైంగిక వాంఛ లేదా ఆందోళనల మీద ప్రభావం చూపటానికి ఈ డ్రగ్ ఎలా పనిచేస్తుందో స్పష్టత లేదని ఎఫ్‌డీఐ కూడా పేర్కొంది.
హెచ్‌ఎస్‌డీడీ సమస్యకు ఉత్తమ పరిష్కారంగా ఔషధాలను ఉపయోగించటం మీద కూడా చాలా చర్చ జరుగుతోంది. లైంగిక వాంఛ తక్కువగా ఉండటానికి శరీరానికి వెలుపలి అంశాలు, మానసిక అంశాలు కూడా కారణం కావచ్చునని నిపుణులు అంటున్నారు. ''శుభవార్త ఏమిటంటే.. యాడియిని తీసుకున్నట్లుగా విలీజిని ప్రతి రోజూ తీసుకోవలసిన అవసరం లేదు. దుర్వార్త ఏమిటంటే.. ఈ డ్రగ్ ఎంత సురక్షితమనే దాని మీద ప్రజలకు నమ్మకం కుదరదు. ఎందుకంటే.. దీనికి సంబంధించి దీర్ఘకాలిక సురక్షిత సమాచారం మాకు అందలేదు'' అని వాషింగ్టన్ పోస్ట్ పత్రికతో నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ రీసెర్చ్ అధ్యక్షురాలు డయానా జుకర్‌మన్ పేర్కొన్నారు.

 
విలీజి ఔషధం మీద వైద్య ప్రయోగాలు 24 నెలల పాటు జరిగాయి. మెనోపాజ్ ముందు దశలో హెచ్‌ఎస్‌డీడీ సమస్య ఉన్న 1,200 మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు. ఈ పేషెంట్లలో చాలా మంది నెలకు రెండు నుంచి మూడు సార్లు ఈ డ్రగ్‌ను ఉపయోగించారు. కానీ వారానికి ఒకసారికి మించి ఎప్పుడూ వాడలేదు. వీరిలో సుమారు 25 శాతం మంది తమకు లైంగిక వాంఛ పెరిగినట్లు అనిపించిందని చెప్పారు. అదే ప్లాసెబో తీసుకున్న మహిళల్లో 17 శాతం మంది మాత్రమే ఆ మాట చెప్పారు.

 
ఈ పరీక్షల్లో పాల్గొన్న మహిళల్లో 8 శాతం మంది వికారం వల్ల డ్రగ్ వాడకం మధ్యలోనే మానేశారని.. వారితో కలిపి సుమారు 20 శాతం మంది మధ్యలో మానేశారని ఈ పరీక్షల్లో పాలుపంచుకున్న ప్రైవేటు సంస్థ కొలంబస్ సెంటర్ ఫర్ విమెన్స్ హెల్త్ రీసెర్చ్ వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు