కోవిడ్: కలవరపెడుతున్న రంజాన్ షాపింగ్, ఇసుకేస్తే రాలనట్లుగా పాతబస్తీ రోడ్లు

మంగళవారం, 11 మే 2021 (12:36 IST)
హైదరాబాద్ పాత నగరంలో రంజాన్ షాపింగ్ కలవరపెడుతోంది. పెద్ద సంఖ్యలో కొనుగోలుదార్లు షాపుల ఎదుట, ముఖ్యంగా ఫుట్ పాత్ వ్యాపారుల వద్ద గుమిగూడడంతో సోషల్ డిస్టెన్సింగ్ అవకాశం లేకుండా పోతోంది. ఏటా రంజాన్ సందర్భంగా హైదరాబాద్‌లో వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. ముస్లింలకు ప్రధానమైన పండుగ కావడంతో, అన్ని ఆదాయ వర్గాల వారూ ఈ నెలలో ఎక్కువగా కొనుగోళ్లు జరుపుతారు. ముఖ్యంగా రంజాన్ నెల చివరి రెండు వారాలూ దుకాణాలు కిక్కిరిసిపోతాయి.

 
సాధారణంగా ప్రతి ముస్లిం కుటుంబమూ కొత్త దుస్తులు, చెప్పులు కొనే సందర్భం ఇది. దానికితోడు పేణీలు (షీర్ కుర్మా/సేమియా పాయసం), అత్తరులు, బంగారం కొనే సందర్భం కూడా ఇది. కానీ గతేడాదీ, ఈ ఏడాది రంజాన్ సమయంలో కోవిడ్ తీవ్రంగానే ఉంది. గతేడాది ఇంకా కాస్త కోవిడ్ లాక్‌డౌన్ సడలిస్తున్న సమయంలో ఉంది. కానీ, ఈసారి రంజాన్ మాసం కోవిడ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో వచ్చింది.

 
ప్రస్తుతం భారతదేశంలోని చాలా రాష్ట్రాల కంటే తెలంగాణలో నిబంధనలు సరళంగా ఉన్నాయి. ఇక్కడ రాత్రి కర్ఫ్యూ మాత్రమే ఉంది. దీంతో రోజంతా దుకాణాలు తెరుచుకుని వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉంది. పాతబస్తీలో చార్మినార్, దాని పరిసరాలైన మదీనా, పథేర్ గట్టి, లాడ్ బజార్, శాలిబండ పరిసర ప్రాంతలతో పాటూ ఇటు మెహదీపట్నం, టోలిచౌకి వంటి ముస్లిం జనాభా ఎక్కువుండే చోట షాపింగ్ రద్దీ కనిపిస్తోంది. బోరబండ, మౌలాలి వంటి ఇతర చోట్లా సందడి ఉన్నప్పటికీ, అంత ఎక్కువ కాదు. చార్మినార్ చుట్టూ వాహనాలు రాకుండా రోడ్లపై శాశ్వత అడ్డంకులు పెట్టారు. ఆ ఖాళీ స్థలంలో పలు తాత్కాలిక షాపులు వెలిశాయి.

 
మాస్కులు పెట్టుకుంటున్నారు కానీ
చాలా వరకూ కష్టమర్లు మాస్కులు పెట్టుకుంటున్నా, సోషల్ డిస్టెన్సింగ్ మాత్రం పాటించడం లేదు. కేవలం షాపుల్లోపలే కాకుండా, ఈ సీజన్ లో ఫుట్‌పాత్ బిజినెస్ బాగా జరుగుతుంది. ముఖ్యంగా మహిళల అలంకరణ వస్తువులు, తక్కువ ధరకు దొరికే బట్టలు అమ్ముతారు. పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు ఈ షాపుల దగ్గర కనిపిస్తారు. ఇలాంటి చోట్ల సోషల్ డిస్టెన్సింగ్ అనేదే లేదు. అటు హలీం దుకాణాల దగ్గర కూడా రద్దీ, ట్రాఫిక్ జాం ఉంటోంది.

 
కేవలం పెద్ద షాపులు మాత్రమే ఈ నిబంధనలను కాస్త పక్కాగా అమలు చేస్తున్నాయి. మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల వారు మాత్రమే ఈ షాపుల దగ్గరకు వెళతారు. కానీ మెజార్టీ షాపింగ్ చేసేది చిన్న షాపులు, ఫుట్ పాత్ వ్యాపారుల దగ్గరే. వీరి దగ్గర సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోవడం, హైదరాబాద్లో వైరస్ వ్యాప్తికి కారణం అవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ''మేం రూల్స్ పాటిస్తాం. ఈ సీజన్ అలాంటిది. లాస్ట్ ఇయర్ అందరూ చాలా దెబ్బతిన్నారు. ఈసారి కాస్త ఫరవాలేదు. వచ్చిన వాళ్లను దూరం దూరంగా ఉండమనే మేం చెబుతున్నాం. మాస్కు మాత్రం అందరూ పెట్టుకుంటున్నారు.'' అని బీబీసీతో చెప్పారు రహమాన్ అనే వ్యాపారి. ఈయన మదీన దగ్గర దుస్తుల వ్యాపారం నిర్వహిస్తున్నారు.

 
‘ఏడాదంతా ఎదురుచూసేది ఈ సీజన్ కోసమే’
వ్యాపారులు చెబుతున్నది ఎలా ఉన్నప్పటికీ అక్కడ జనం గుమిగూడడం మాత్రం పెద్దగా తగ్గలేదు. ''మేం ఏడాదంతా ఎదురు చూసేది ఈ సీజన్ కోసమే. ఇప్పుడే మాకు స్వేచ్ఛ దొరికేది. ఈ టైంలోనే బయటకు వచ్చి మాకు నచ్చినవి కొనుక్కుంటాం. ఇందుకోసం ఏడాదంతా డబ్బు జాగ్రత్తగా దాచుకుంటాం. అందుకే రంజాన్ వస్తే షాపింగుకు వస్తాం.'' అని బీబీసీతో చెప్పింది ఉన్నీసా అనే మహిళ.

 
మరి కోవిడ్ భయం గురించి ఆమెను ప్రశ్నించినప్పుడు ''మాస్కు పెట్టుకుంటున్నాంగా'' అని సమాధానం ఇచ్చిందామె. అయితే సోషల్ డిస్టెన్సింగ్ గురించి మాత్రం ఆమె మాట్లాడలేదు. ''కేసులు కూడా మరీ అంత ఏమీ పెరగడం లేదని గవర్నమెంటు వాళ్ల చెప్తున్నారు కదా..'' అంటూ వ్యాఖ్యానించింది ఆమె పక్కన ఉన్న మరో మహిళ.

 
‘నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెడుతున్నాం’
అయితే ఓల్డ్ సిటీలో నిబంధనల ఉల్లంఘనలపై సౌత్ జోన్ డీసీపీ గజరావు భూపాల్‌తో మాట్లాడింది బీబీసీ. ''అక్కడ నిబంధనలు పాటించేలా చూస్తున్నాం. ఎవరైనా ఉల్లంఘిస్తే కేసులు కూడా పెడుతున్నాం. ఇప్పటికే చాలా కేసులు పెట్టాం. రాత్రి 8 తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ షాపులు తెరవనీయడం లేదు. కావాలంటే ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు. అయితే పగలు లాక్ డౌన్ లేదు కాబట్టి, 8 వరకూ షాపులు తెరుచుకునేందుకు వారికి అనుమతి ఉంది. ఇక సోషల్ డిస్టెన్సింగు విషయంలో కూడా ఎప్పటికప్పుడు వారికి సూచనలు చేస్తున్నాం'' అన్నారాయన.

 
మరోవైపు రాత్రి కర్ఫ్యూ 9 గంటల నుంచి కాకుండా పది గంటల నుంచి పెట్టాలంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. అయితే ప్రభుత్వం ఆయన విజ్ఞప్తికి స్పందించలేదు. ప్రస్తుతం రాత్రి కర్ఫ్యూ తెలంగాణలో 9 గంటలకు ప్రారంభం అవుతుంది. 8 గంటలకే షాపులు మూసేయాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు