ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిచినా లెక్క చెప్పకపోతే ఇంటికే.. ఎందుకు?

బిబిసి

శుక్రవారం, 29 మార్చి 2024 (16:41 IST)
కృష్ణా జిల్లా గుడివాడలో గత ఎన్నికల్లో పోటీ చేసిన కొడాలి వెంకటేశ్వరరావు అనే అభ్యర్థిపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. కొడాలి వెంకటేశ్వరరావు అనగానే ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అనుకోకండి. ఈ మాజీ మంత్రి పూర్తి పేరు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు. ఇంచుమించుగా ఇదే పేరుతో ఉన్న కొడాలి వెంకటేశ్వరరావు అనే అభ్యర్థి గత ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేశారు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చు వివరాలు సమర్పించకపోవడంతో మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈసీ అనర్హత వేటు పడింది. ఇలా కొడాలి వెంకటేశ్వరరావు ఒక్కరే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 1069 మంది అర్హత కోల్పోయారు. ఇలాంటి అభ్యర్థులంతా ఎందుకు అనర్హులయ్యారో ఒకసారి చూద్దాం.
 
ఎందుకు అనర్హులవుతారు?
ఎన్నికలలో పోటీ చేసిన ఎవరైనా అభ్యర్థి తను పెట్టిన ఖర్చు వివరాలను, ఎన్నికల అనంతరం ఎలక్షన్ కమిషన్‌కు ఇవ్వాలి. నేరుగా ఎన్నికల సంఘానికి ఇవ్వడానికి వీలుండదు కాబట్టి అసెంబ్లీ లేదా లోక్‌సభ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి వివరాలు అందజేయాలి. లేకపోతే అనర్హులుగా ప్రకటించేందుకు ఎన్నికల సంఘానికి అధికారం ఉంటుంది. ఈసీ నోటిఫై చేసిన తేదీ నుంచి ఈ అనర్హత అమల్లోకి వస్తుంది.
 
72 మంది నిజామాబాద్ నుంచి పోటీచేసిన వారే
అనర్హతకు గురైన అభ్యర్థి నిర్దేశిత కాలంపాటు పోటీ చేసేందుకు వీలుండదు. వీరు నామినేషన్ వేసినప్పటికీ ఎలాంటి కారణాలూ చెప్పకుండా రిటర్నింగ్ అధికారి తిరస్కరించేందుకు వీలుంటుంది. ఈసీ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈసారి అనర్హతకు గురైన 1,069 మంది గత లోక్‌సభ ఎన్నికలు లేదా ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, ఖర్చు వివరాలను ఈసీకి చెప్పనివారే. ఎన్నికల్లో ప్రచారం లేదా ఇతరత్రా అవసరాలకు ఎంత ఖర్చు పెట్టామనేది చెప్పకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారు. వీరిలో చాలా మంది 2021 మొదలుకుని 2024 ఆగస్టు, సెప్టెంబరు వరకు అనర్హతకు గురైన వారున్నారు.
 
అనర్హతకు గురైన వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ నియోజకవర్గాలకు చెందిన 51 మంది ఉన్నారు. తెలంగాణ నుంచి 107 మంది ఉన్నారు. ఇందులో 72 మంది నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గత ఎన్నికలలో పోటీ చేసిన వారే. వీరంతా 2019 లోక్‌స‌‍భ, ఏపీ అసెంబ్లీతోపాటు 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సహా వివిధ ఎన్నికల్లో పోటీ చేసినవారున్నారు. గత లోక్‌సభ ఎన్నికలలో పసుపు బోర్డు కోసం పసుపు రైతులు ఎన్నికల్లో పోటీ చేశారు. పసుపు బోర్డు రానందుకు తమ నిరసన తెలియజేసేందుకు నామినేషన్లు వేసినట్లు అప్పట్లో వారు ప్రకటించారు. తర్వాత ఎన్నికల సం‌‍ఘానికి ఖర్చు వివరాలు ఇవ్వకపోవడంతో అనర్హతకు గురయ్యారు.
 
‘‘అప్పట్లో మా నిరసన తెలియజేయడం కోసం ఎన్నికలలో నామినేషన్లు వేశాం. పోటీ చేశాం. కానీ, తర్వాత ఖర్చులు చెప్పాలనే విషయం మాకు తెలియదు. పైగా ఆ ఎన్నికల్లో మేం పెట్టిన ఖర్చు కూడా ఏమీ లేదు. నామినేషన్ల ఖర్చు తప్ప ప్రచారానికి మేం పెద్దగా చేసిందీ లేదు. అందుకే ఆ వివరాలు ఇవ్వాలనే విషయం గుర్తులేదు. అందుకే ఇవ్వలేకపోయాం’’ అని నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసిన బాలకిషన్ అనే అభ్యర్థి చెప్పారు.
 
ప్రజాప్రాతినిధ్యం చట్టం ఏం చెబుతోంది?
1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 10ఏ ప్రకారం ఎన్నికలు ముగిసిన మూడు నెలల్లోగా ఖర్చు వివరాలు ఇవ్వాలి. ఈ చట్టం ప్రకారం నిర్దేశిత సమయంలోగా ఖర్చు వివరాలు చెప్పకపోతే మూడేళ్లపాటు అనర్షత వేటు వేసే అధికారం ఎన్నికల సం‌‍ఘానికి ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ఖర్చుల వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో గెలుపోటములకు, ఖర్చుల వివరాలు అందజేతకు సంబంధం లేదు. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిఒక్కరూ వివరాలు తెలియజేయాల్సిందే.
 
ఎవరైనా అభ్యర్థి ఎన్నికల్లో గెలిచి, మూడు నెలల్లోగా ఖర్చు వివరాలు అందజేయకపోతే అనర్హత వేటు పడుతుందని ప్రజాప్రాతినిధ్య చట్టం చెబుతోంది.
ప్రస్తుతం ఎన్నికల సం‌‍ఘం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అయ్యే ఖర్చుపై పరిమితులు విధించింది. లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థి ఖర్చు రూ.95 లక్షలు దాటకూడదు. అలాగే, అసెంబ్లీ సీటుకు పోటీ చేసే అభ్యర్థి ఖర్చు రూ.40 లక్షలకు మించకూడదు. ఖర్చులో బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రకటనలు, హోర్డింగులు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, ప్రచార సామగ్రి సహా ఎన్నికలకు సంబంధించి అన్ని ఖర్చులు ఉండాలి. ఆ తర్వాత ఖర్చు వివరాలను మూడు నెలల్లోగా సమర్పించాలనేది నిబంధన.
 
‘‘సాధారణంగా ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులెవరూ ఖర్చు వివరాలు చెప్పకుండా ఉండరు. కేవలం స్వతంత్ర అభ్యర్థులో లేదా చిన్నపార్టీల అభ్యర్థులో ఈ తరహా ఖర్చులు చెప్పకుండా వదిలేస్తుంటారు. వారు ఎన్నికలను అంత సీరియస్‌గా తీసుకోరు. ఏదో అవకాశం ఉంది కదా.. పోటీ చేద్దాంలే అన్న ధోరణిలో పోటీలో ఉంటారు. అందుకే తర్వాత ఖర్చు వివరాల విషయంలోనూ అదే ధోరణితో ఉంటారు’’ అని బీబీసీతో చెప్పారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి.
 
చూపించేవి తప్పుడు లెక్కలే: పద్మనాభ రెడ్డి
సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థుల వ్యయం ఈసీ నిర్దేశించిన పరిమితికి మించే అవుతుంది. కోటానుకోట్లు ఖర్చు పెడతారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖర్చు వివరాలు సమర్పించినప్పుడు మాత్రం ఎన్నికల సంఘం నిర్దేశించిన పరిమితిలోపే ఖర్చు చేసినట్లుగా చూపిస్తారు. ఈ విషయంపై పద్మనాభ రెడ్డి బీబీసీతో మాట్లాడుతూ- ‘‘మేం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టిన ఖర్చు వివరాలపై పరిశీలన చేశాం. ఈసీ రూ.40 లక్షల సీలింగ్ పెట్టింది. కానీ, అభ్యర్థులు మాత్రం రూ.20 లక్షల నుంచి రూ.35 లక్షల మధ్యే ఖర్చు పెట్టినట్లు చూపించారు. ఇవన్నీ తప్పుడు లెక్కలు. అందరికీ తెలుసు.. తెలంగాణలో సీరియస్‌గా ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకు రూ.10 కోట్లకు తక్కువ ఖర్చు చేయడం లేదు’’ అని చెప్పారు.
 
‘‘కేసు బుక్ చేస్తే డబ్బు పంచేవాళ్లపైనే చేస్తున్నారు. కానీ, ఎవరి తరపున పంచుతున్నారో.. ఆ అభ్యర్థిపై కేసు పెట్టాలని ఎన్నికల సం‌‍ఘానికి చెప్పాం. ఐపీసీ సెక్షన్ 171 ప్రకారం డబ్బులు పంచితే ఏడాది వరకు జైలు శిక్ష విధించే వీలుంటుంది. ఆ కేసులు పెట్టాలని చెప్పాం. కొన్నిసార్లు ఓటర్లే ముందుకు వచ్చి డబ్బులు అడుగుతున్నారు. అలా అడిగిన వారిపైనా కేసులు పెట్టాలని ఎన్నికల సంఘానికి చెబుతున్నాం’’ అన్నారు పద్మనాభరెడ్డి.
 
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా అనర్హత వేటు పడినవారి సంఖ్య:
అస్సాం - 11
ఆంధ్రప్రదేశ్ – 51
అండమాన్, నికోబార్ దీవులు – 5
బిహార్ – 237
ఛత్తీస్‌గఢ్ – 73
దిల్లీ – 21
గుజరాత్ – 9
హరియాణా - 55
హిమాచల్ ప్రదేశ్ – 9
ఝార్ఖండ్ – 26
కేరళ – 43
కర్ణాటక - 75
లక్షదీప్ – 1
మహారాష్ట్ర – 18
మధ్యప్రదేశ్ – 79
ఒడిశా – 35
పంజాబ్ – 7
రాజస్థాన్ – 18
తమిళనాడు – 27
తెలంగాణ – 107
ఉత్తర్‌ప్రదేశ్ – 121
ఉత్తరాఖండ్ – 24
పశ్చిమ బెంగాల్ - 17
 
ఆధారం: భారత ఎన్నికల కమిషన్

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు