ఫ్యాక్ట్‌చెక్: టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి క్రైస్తవుడనే ప్రచారంలో నిజమెంత? అఫిడవిట్‌లో ఏముంది?

శనివారం, 19 ఆగస్టు 2023 (13:55 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రెండోసారి బాధ్యతలు చేపట్టారు. కరుణాకర్ రెడ్డిని ఈ పదవికి ఎంపిక చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించగానే, ‘అన్యమతస్తులకు’ అవకాశం కల్పించారంటూ విమర్శలు రేగాయి. సోషల్ మీడియాలో భూమన కుటుంబానికి చెందిన వారి వివాహ దృశ్యాలు వైరల్ అయ్యాయి. బీజేపీ నాయకుడు లంక దినకర్ వంటి వారు ఓ వెబ్‌సైట్‌ను కోట్ చేస్తూ భూమన కరుణాకర్ రెడ్డి క్రైస్తవుడని విమర్శించారు. మరికొందరు దాన్నే భూమన ఎన్నికల అఫిడవిట్ అంటూ ప్రచారం చేశారు.
 
హిందూ ధర్మంపై నమ్మకమున్న వారిని, హిందూ ధర్మం అనుసరించే వాళ్లని మాత్రమే టీటీడీ చైర్మన్‌గా నియమించాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. బీజేపీలో ఉన్న టీటీడీ మాజీ కార్యనిర్వహణాధికారి(ఈవో), ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఐ.వై.ఆర్. కృష్ణారావు మరో అడుగు ముందుకేశారు. ప్రచ్ఛన్న మత అజెండాతో ఈ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. ఈ వివాదం నేపథ్యంలో, భూమన కరుణాకర్‌రెడ్డి క్రైస్తవుడని ఎన్నికల అఫిడివిట్‌లో ఉందా, లేదా అనే అంశాన్ని బీబీసీ పరిశీలించింది. టీటీడీ చైర్మన్‌గా ఫలానా మతస్తులే ఉండాలనే నిబంధన ఉందా అనే విషయాన్ని కూడా ఆరా తీసింది.
 
భూమన అఫిడవిట్‌లో మత ప్రస్తావన ఉందా?
భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటివరకూ నాలుగు దఫాలు ఎన్నికల్లో పోటీ చేశారు. 2009లో తిరుపతి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ తరపున పోటీచేసిన భూమన, నాటి ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి చేతిలో ఓడిపోయారు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత 2012లో చిరంజీవి రాజ్యసభకు ఎన్నికవడంతో అసెంబ్లీకి రాజీనామా చేశారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున భూమన గెలిచారు. 2014 ఎన్నికల్లో భూమన ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో గెలిచి రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014, 2019లలో ఆయన వైసీపీ తరపున బరిలో దిగారు.
 
పోటీ చేసిన నాలుగుసార్లూ భూమన ఎన్నికల అఫిడవిట్లలో ఎక్కడా ఆయన మత విషయాన్ని ప్రస్తావించిన దాఖలాలు లేవు. వాస్తవానికి రిజర్వుడు సీట్లలో పోటీ చేసే అభ్యర్థులు కులధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పోటీకి మతపరమైన నిబంధనలు లేవు. కాబట్టి తాము అనుసరించే మత విశ్వాసాలకు సంబంధించిన అంశాన్ని సాధారణంగా అభ్యర్థులు ప్రస్తావించరు. ఎన్నికల కమిషన్ వాటిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. భూమన ఎన్నికల అఫిడవిట్‌లోనే ‘క్రిస్టియన్’ అని ఉందంటూ సోషల్ మీడియాలో చేసిన ప్రచారం వాస్తవం కాదని అఫిడవిట్లను బీబీసీ పరిశీలించినప్పుడు తేలింది.
 
భూమన ఇంట్లో సంప్రదాయాల విషయానికి వస్తే, ఆయన కుమార్తె వివాహం క్రైస్తవ మత ఆచారం ప్రకారం జరిగినట్టు ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన కుమారుడు భూమన అభినయ్ రెడ్డి మాత్రం హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నట్టు చెప్పే వీడియో ఒకటి కనిపిస్తోంది. భూమన కరుణాకర్‌రెడ్డి క్రైస్తవుడనే ఆరోపణలను ఆయన కుమారుడు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తోసిపుచ్చారు. తాము హిందువులమని తామే నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కమ్యూనిస్టు భావజాలం ఉండే విద్యార్థి సంఘం రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్.ఎస్.యు)లో పనిచేసిన భూమనకు, మత విశ్వాసాల మీద నమ్మకం లేదనే వాదన కూడా ఉంది. అయితే, ఆయన గతంలో బోర్డు చైర్మన్‌గా పని చేయడమే కాకుండా, ఇటీవలి వరకు ఎమ్మెల్యేగా కూడా టీటీడీకి సంబంధించిన అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
 
వైవీ సుబ్బారెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్‌లపైనా విమర్శలు
టీటీడీ చైర్మన్ పదవికి ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాధాన్యం ఉంది. పోటీ కూడా ఉంటుంది. నామినేటెడ్ పోస్టుల్లో ఎక్కువ మంది ఆశించే పదవి టీటీడీ చైర్మన్ గిరీనే. అందుకే అది కీలకమైన నేతలకు దక్కుతుంది. ఇటీవలి వరకూ జగన్ బాబాయ్, వైసీపీలో కీలక నేత అయిన వైవీ సుబ్బారెడ్డి ఈ పదవిని రెండుసార్లు వరుసగా నిర్వహించారు. సుబ్బారెడ్డి చైర్మన్ పదవిలోకి వచ్చినప్పుడు కూడా ఆయన క్రైస్తవుడని కొందరు విమర్శలు చేశారు. ఆయన భార్య హిందూమతాచారాలను అనుసరించి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఆమె క్రైస్తవురాలు అనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని సుబ్బారెడ్డి ఖండించారు.
 
తర్వాత తిరుమల కొండల్లో ఎలక్ట్రిక్ స్తంభాన్ని దూరం నుంచి చూపించి శిలువ అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం దుమారం రేపింది. దాని మీద కేసు కూడా నమోదై, అలాంటి ప్రచారానికి దిగిన వారి అరెస్టు కూడా జరిగింది. తిరుమల బస్సు టికెట్ల వెనక క్రైస్తవ మత ప్రచారానికి సంబంధించిన అంశాలు ముద్రించడం వంటి వివిధ వివాదాలు సుబ్బారెడ్డి పదవీ కాలంలోనే వచ్చాయి. అంతకుముందు టీడీపీ హయంలో ఆ పదవి స్వీకరించిన పుట్టా సుధాకర్ యాదవ్ మీద కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయి. సుధాకర్ యాదవ్ స్వయంగా క్రైస్తవ మత ప్రచార సభలో పాల్గొన్నారంటూ వీడియాలు వైరల్ అయ్యాయి. రాజకీయంగా వివిధ మత సంబంధిత కార్యక్రమాలకు హాజరవుతున్న నాయకుల వీడియోలు, ఫోటోలు ఆ తర్వాత టీటీడీ బోర్డులో పదవులు స్వీకరించగానే వెలుగులోకి రావడం చర్చకు దారి తీస్తోంది.
 
టీటీడీలో ఇతర మతస్తులకు అవకాశం లేదా?
టీటీడీ కోసం ప్రత్యేక బోర్డు‌ను స్వాతంత్ర్యానికి పూర్వమే, 1932లోనే ప్రారంభించారు. అప్పటి వరకూ మహంతుల ఆధ్వర్యంలో టీటీడీ వ్యవహారాలు నడిచేవి. 1936 నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో టీటీడీ వ్యవహారాలు సాగుతున్నాయి. టీటీడీ మొదటి చైర్మన్‌గా పి.వెంకట రంగరాయన్ నియమితుడయ్యారు. టీటీడీకి కె.సీతారామిరెడ్డి మొదటి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. టీటీడీ పాలకమండలికి భూమన 51వ చైర్మన్. 28 మంది ఈవోలుగా విధులు నిర్వహించారు. 1956 నుంచి ఐఏఎస్ అధికారిని టీటీడీ ఈవోగా నియమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక సంస్థల నియామక చట్టం-1987 ప్రకారం పాలకమండళ్ల నియామకం జరుగుతుంది.
 
ఏపీలో టీటీడీతో పాటు వివిధ ఆలయాలకు ఈ చట్టాన్ని అనుసరించి పాలకవర్గాలను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. 2019లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ చట్టంలో కొన్ని మార్పులు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ధార్మిక, హిందూ మతసంస్థలు, దేవాదాయ సంస్థల నిర్వహణతోపాటు పాలనకు సంబంధించిన చట్టాన్ని ఏకీకృతం చేయడానికి, సవరించడానికి సంబంధించిన అంశాలను ఈ చట్టంలో పొందుపరిచారు. చట్టాన్ని అనుసరించి పాలకమండళ్ల నియామకంలో ఫలానా మతం వారిని నియమించాలనే నిబంధన లేదు. కానీ, హిందూ ఆలయాల్లో హిందూమత ఉద్ధరణే లక్ష్యమనే భావనతో దాన్ని అనుసరించే వారికే అవకాశాలు కల్పించడం ఆనవాయితీగా వస్తోంది.
 
టీటీడీ విషయంలో ఉద్యోగుల నియామకంలోనే నిబంధనలు సవరించి కేవలం హిందువులకే మాత్రమే అవకాశం అనే నిబంధన తెచ్చారు. గతంలో డ్రైవర్లు సహా కొన్ని ఉద్యోగాల్లో ఇతర మతస్తులకు అవకాశం కల్పించారంటూ వివాదం చెలరేగింది. ఆందోళనలు కూడా జరిగాయి. చివరకు ప్రభుత్వం నిబంధనలు మార్చింది. టీటీడీ సిబ్బంది అంతా హిందూ మతాచారాలను ఆచరించేవారై ఉండాలని, వారికే అవకాశం కల్పించాలని షరతు పెట్టింది. ఉద్యోగ నియామకాల్లో అలాంటి నిబంధనలు పాటిస్తున్నప్పుడు పాలకవర్గాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందనే అభిప్రాయం ఉంది.
 
ఆలయ పాలకమండలి సభ్యుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం 2019లో చట్టం తీసుకొచ్చింది. కానీ, ప్రస్తుత పాలక మండలిలో 36 మంది సభ్యులు ఉంటే, అందులో ఎస్సీలు ఇద్దరే. చట్టాన్ని అనుసరించి ఆరుగురు ఎస్సీలకు, నలుగురు ఎస్టీలకు చోటు దక్కాల్సి ఉండగా, ప్రస్తుతం అందుకు భిన్నంగా పరిస్థితి ఉందని తిరుపతికి చెందిన ఎస్సీ ఉద్యోగుల సంఘం నాయకుడు ప్రశాంత్ కుమార్ బీబీసీతో అన్నారు.
టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకం సరికాదనే విమర్శ అర్థరహితమన్న వాదన కూడా వినిపిస్తోంది.
 
"హిందూమతాచారాలను పాటిస్తూ గతంలోనూ భూమన వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. దళిత గోవిందం వంటివి విజయవంతంగా నిర్వహించారు. అయినప్పటికీ ఆయన మీద విమర్శలు రావడం ఆశ్చర్యంగా ఉంది. టీటీడీ ప్రతిష్టను దిగజార్చే రీతిలో అన్ని విషయాలు రాజకీయం చేయడం శ్రేయస్కరం కాదు’’ అని తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్టు ఆదిమూలం శేఖర్ బీబీసీతో అన్నారు.
 
మాకు మేమే నిరూపించుకోవాల్సిన పరిస్థితి: అభినయ్ రెడ్డి
రాజకీయాల కోసం తమ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇది సరికాదని కరుణాకర్‌రెడ్డి కుమారుడు అభినయ్ బీబీసీతో చెప్పారు. ‘‘మాకు మేమే ‘హిందువులం’ అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది’’ అన్నారు. "అఫిడవిట్ ఎడిట్ చేసి ఫేక్‌వి తిప్పుతున్నారు. అఫిడవిట్‌లో ఎక్కడా మతం గురించి లేదు. నేను హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాను. మా సోదరికి తిరుపతిలో పెళ్లి అయ్యింది. రిసెప్షన్ ఫోటో పట్టుకుని క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేశారు అనడం ఏంటి? ఆ పెళ్లికి కూడా పురందేశ్వరి తమ్ముడైన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వచ్చారు. నా పెళ్లికి ‘ఈనాడు’ అధినేత రామోజీరావు, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, సినీ నటుడు చిరంజీవి కూడా వచ్చారు. హిందూ సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నాం. వాళ్లకు తెలుసు కదా. పురందేశ్వరి లాంటి వ్యక్తి నిజానిజాలు తెలుసుకోకుండా అలా మాట్లాడడం సమంజసం కాదు. కామెంట్ చేసినవాళ్లకు సంబంధించిన వ్యక్తి మా ఇద్దరి పెళ్లిళ్లకు సాక్ష్యం" అని అభినయ్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు