శ్రీవశిష్ఠ పున్నమి రాయల్ టూరిస్ట్ బోటులో 64 మంది పెద్దవారు, ముగ్గురు చిన్న పిల్లలు, 8 మంది సిబ్బందితో కలిపి మొత్తం 75 మందిని ఎక్కించుకుని నిర్లక్ష్యంగా నడిపినందుకు బోటు యజమానులపై దేవీపట్నం పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో వెంకటరమణతో పాటు యళ్ళ ప్రభావతి, యర్రంశెట్టి అచ్యుతామణిలను అరెస్ట్ చేసి రంపచోడవరం మేజిస్ట్రేట్ కోర్టుకు రిమాండ్ నిమిత్తం తరలించినట్లు అసిస్టెంట్ ఎస్పీ వకుల్ జిందాల్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని కూడా ఈ ప్రకటనలో ఏఎస్పీ వెల్లడించారు.
మొత్తం 75 మందిని పడవలో ఎక్కించుకుని గోదావరిలో సాధారణంగా వెల్ళవలసిన ఎడమ వైపు ఒడ్డు నుండి కాకుండా నిర్లక్ష్యంగా నది మధ్యలో నుంచి నడిపి 34 మంది యాత్రికుల మరణానికి, ముగ్గురు సిబ్బందితో కలిపి 15 మంది గల్లంతు కావడానికి కారణమైన బోటు యాజమాన్యం మీద కేసు నమోదైంది.
ఈ ప్రమాదంలో 26 మందిని కచ్చులూరు గ్రామస్థులు, జాలర్లు కాపాడారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పడవ మునిగే ప్రమాదం ఉందని తెలిసి కూడా అత్యాశతో, నైపుణ్యం లేని డ్రైవర్లతో పాపికొండల విహారయాత్రకు లాంచీని నడపడం ద్వారా యజమానులు నిర్లక్ష్యానికి పాల్పడ్డారు. బోటు ఆచూకీ గుర్తించాం. దానికి బయటకు తీసేందుకు సాంకేతిక బృందాలతో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఏలూరు రేంజ్ డిఐజి ఎఎస్ ఖాన్ పర్యవేక్షణలో జిల్లా ఎస్పీ నయీం అస్మీ ఆదేశాల ప్రకారం జాడ తెలియని వారి గురించి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.