హీట్‌వేవ్: ఈ వారాంతంలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటిపోవచ్చు- వాతావరణ విభాగం హెచ్చరిక

బుధవారం, 18 మే 2022 (17:07 IST)
వాయువ్య భారత దేశం, పాకిస్తాన్‌లలో వాతావరణ మార్పుల వల్ల తీవ్ర వడగాలులు వీచే ప్రమాదం 100 రెట్లు ఎక్కువని వాతావరణ విభాగం తాజా అధ్యయనం వెల్లడించింది. 2010లో ఈ ప్రాంతంలో నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ప్రతి మూడేళ్లకూ ఒకసారి నమోదు కావొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. వాతావరణ మార్పులే లేకపోతే ఇలాంటి విపరీత ఉష్ణోగ్రతలు ప్రతి 312ఏళ్లకు ఒకసారి మాత్రమే నమోదు అవుతాయని అధ్యయనంలో పేర్కొన్నారు.

 
రానున్న రోజుల్లో వాయువ్య భారత దేశంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పెరగొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో వాతావరణ మార్పుల ప్రభావం మీద ప్రపంచ వాతావరణ విభాగం (డబ్ల్యూఎంవో) స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ రిపోర్ట్ ఇటీవల విడుదల చేసింది. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు, సముద్ర మట్టాల పెరుగుదల, సముద్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, సముద్రాల లవణీయత పెరగడం లాంటి వాతావరణ మార్పుల సంకేతాలు 2021లో రికార్డు స్థాయిలకు వెళ్లినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.

 
వాతావరణ మార్పులకు కళ్లెం వేయడంలో మానవులు విఫలం అవుతున్నారని చెప్పడానికి ఈ నివేదిక ఒక ఉదాహరణ అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు.

 
విపరీత హీట్‌వేవ్‌లు
గత కొన్ని వారాలుగా వాయువ్య భారత్, పాకిస్తాన్‌లలో హీట్‌వేవ్‌లు నమోదవుతున్నాయి. గత శనివారం పాకిస్తాన్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 51 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వెళ్లాయి. ఈ వారాంతంలో మళ్లీ అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ విభాగంలోని గ్లోబల్ గైడెన్స్ యూనిట్ హెచ్చరిస్తోంది. ‘‘కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు కూడా వెళ్లొచ్చు. రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువే ఉంటాయి’’అని పరిశోధకులు వెల్లడించారు.

 
‘‘సాధారణంగా ఈ ప్రాంతాల్లో ఏప్రిల్, మే నెలల్లో రుతుపవనాలకు ముందు ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి’’అని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ నికోస్ క్రిస్టిడిస్ చెప్పారు. ‘‘అయితే, వాతావరణ మార్పుల వల్ల ఈ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలకు పెరిగి, విపరీత హీట్‌వేవ్‌లు నమోదయ్యే ముప్పుంది’’అని ఆయన చెప్పారు.

 
2010లో ఇలానే..
ఈ ప్రాంతాల్లో 2010 ఏప్రిల్, మే నెలల్లో విపరీత ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1900 తర్వాత తొలిసారి ఇక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆనాటి పరిస్థితులను పరిశోధకులు విశ్లేషించారు. భవిష్యత్‌లో వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి హీట్‌వేవ్‌లు ఎప్పుడు, ఎలా నమోదు కావొచ్చనే అంశాలను వారు పరిశీలించారు. అధ్యయనంలో భాగంగా కంప్యూటర్ సిమ్యులేషన్లతో వాతావరణాన్ని మార్పుల ప్రభావాన్ని అంచనా వేశారు.

 
ఇప్పటిలానే వాతావరణం ఉంటే హీట్‌వేవ్‌లు ఎలా ఉంటాయి? లేదా గ్రీన్‌హౌస్ వాయువులతో పాటు ఇతర వాతావరణ మార్పుల కారకాలకు కళ్లెం వేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? అని విశ్లేషించారు. దీని కోసం 14 కంప్యూటర్ మోడల్స్ సాయంతో పదుల సంఖ్యలో సిమ్యులేషన్లను రూపొందించారు. వీటి విశ్లేషణలో పరిస్థితులు మరింత భయానకంగా ఉండబోతున్నాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఒకవేళ వాతావరణ మార్పులు ఇలానే కొనసాగితే, ఈ శతాబ్దం మధ్యనాటికి భారత్, పాకిస్తాన్‌లలో విపరీత ఉష్ణోగ్రతలు ప్రతి ఏటా నమోదయ్యే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు