హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన 114 మందిని ఈయనే కాపాడారు

బుధవారం, 16 సెప్టెంబరు 2020 (14:59 IST)
హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ తీరం. టాంక్ బండ్‌కి అవతలి వైపు. తుప్పల మధ్య నుంచి నాంపల్లి సికింద్రాబాద్ స్టేషన్లను కలిపే రైల్వే ట్రాక్. ఆ ట్రాక్ మీద కూర్చున్నాడు ఓ కుర్రాడు. వయసు పది, పదకొండేళ్లు ఉండొచ్చేమో! సరిగ్గా తెలీదు. ఆ మాటకు వస్తే, ఆ కుర్రాడికే తన వయసు తనకే స్పష్టంగా తెలీదు.

 
మత్తుమందు బానిసలు, చెత్త ఏరుకునే వారు, ఇలా రకరకాల వారికి ఆ రైల్వే ట్రాక్ ఆవాసం. పని దొరికినప్పుడు చేయడం, దొరకనప్పుడు వెళ్లి ఆ ట్రాక్ మీద కూర్చోవడం.. ఇదీ ఆ కుర్రాడి దినచర్య. తానుండే అనాథాశ్రమంలో తన తోటి వారికి పని దొరికింది. చెత్త ఏరి, చెత్త బండి తోలే పని. తనకూ వచ్చింది ఆ పని. కానీ నచ్చలేదు. అందుకే వేరే పనులు చేస్తూ, పని లేనప్పుడు ట్రాక్ దగ్గర కూర్చుంటాడు.

 
ఓ రోజు ఎప్పట్లాగే ట్రాక్ దగ్గర ఒంటరిగా కూర్చున్నాడు. దూరంగా కొందరు గుంపుగా ఉన్నారు. వాళ్లెప్పుడూ అక్కడే ఉంటారు. అప్పుడే అక్కడకి సైఫాబాద్ స్టేషన్ నుంచి కొందరు పోలీసులు వచ్చారు. అక్కడున్న వారితో మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరితో విడివిడిగానూ, అందరితో కలిపి కూడా మాట్లాడుతున్నారు. పోలీసులు అడిగిన దానికి అక్కడి వారు ఒప్పుకోవడం లేదు.

 
ఇదంతా గమనిస్తున్న ఆ కుర్రాడు నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్లాడు. వాళ్లు చెప్పింది విన్నాడు. ఆ పని చేసేందుకు తాను సిద్ధమని పోలీసులతో చెప్పాడు. ఈ కుర్రాణ్ణి ఎగాదిగా చూసిన పోలీసులు వద్దన్నారు. ‘నువ్వు పిల్లాడివి. కుదరద’న్నారు. ‘కాదు, నేను చేయగలను’.. జవాబిచ్చాడు ఆ కుర్రాడు. పోలీసులకు మనసు ఒప్పుకోవడం లేదు. కానీ, వాళ్ల ముందు వేరే దారి కూడా లేదు.

 
దీంతో ఆ కుర్రాడిని తమతో తీసుకువెళ్లారు. పోలీసులు చెప్పింది ఆ కుర్రాడు చేశాడు. అందుకు వాళ్లు ముప్పయో, నలభయో అతడి చేతిలో పెట్టారు. అప్పట్లో అది తనకు చాలా పెద్ద సంపాదన. ఆ కుర్రాడి పేరు శివ. అతడు చేసిన పని ఏంటంటే, హుస్సేన్ సాగర్‌లో నీటిలో బాగా నాని, కుళ్లిపోతున్న ఒక మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకు రావడం.

 
ఈ ఘటన జరిగి, రెండు దశాబ్దాలు గడిచింది. శివ ఇంకా అదే పని చేస్తున్నారు. అయితే, మృతదేహాలను వెలికి తీయడమే కాదు, మృత్యువు అంచుల్లో నుంచి ఎందరినో లాక్కువచ్చి, బతికిస్తున్నారు. సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఎందరినో ప్రాణాలు పణంగా పెట్టి శివ కాపాడారు.

 
ఆయన వెలికితీసిన శవాల లెక్కలేదు కానీ, కాపాడిన ప్రాణాల లెక్కైతే ఆయన వేసుకున్నారు. పది, ఇరవై కాదు... అక్షరాల 114 మంది ప్రాణాలను ఆయన కాపాడారు. వీరిలో కొందరిని దూకుతుండగానే ఆపారు. ఇంకొందరిని దూకాక, వెలికితీసి కాపాడారు. శివ నివాసం ట్యాంక్‌బండ్‌లోనే. హుస్సేన్ సాగర్ నుంచి అనాథ శవాలు తీయడం, ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశంతో సాగర్‌లోకి దూకినవారిని రక్షించడం ఇప్పుడు ఆయన పని.

 
ఎలా మొదలైంది?
తనను కన్న తల్లితండ్రులెవరో శివకు తెలియదు. ఊహ తెలిసే సరికి యాకుత్‌పురాలోని ఒక అనాథాశ్రమంలో ఉన్నాడు. చార్మినార్ దగ్గర్లోని ఓ బడిలో చదువుకున్నాడు. శివ అసలు పేరు హన్మంతు. క్లాసులో అప్పటికే అదే పేరుతో చాలామంది ఉండటంతో, హన్మంతు పేరును శివగా మార్చారు ఆయన టీచర్.

 
మూడో తరగతి చదువుతున్నప్పుడు (అది ఏ ఏడాదో ఆయనకు గుర్తులేదు) మొహర్రం పండుగ వచ్చింది. ఆ పండుగ నాడు శివ తన ఆశ్రమానికి వెళ్తుండగా, దారి తప్పిపోయారు. మార్గం గుర్తు లేక, ఏవేవో గల్లీలు తిరిగాడు. చివరకు నడిచీనడిచీ దిల్‌సుఖ్‌నగర్ చేరుకున్నాడు.

 
అప్పుడు ఫుట్‌పాత్ పైనే నివాసం. ఒక టిఫిన్ బండి దగ్గర ఎంగిలి ఆకులు తీసే పని చేసి, వారి దగ్గర టిఫిన్ తినేవాడు. తర్వాత, అక్కడే ఫుట్‌పాత్‌పై నివసిస్తోన్న ఓ కుటుంబం దగ్గర చేరాడు. వారు తమ పిల్లలతో పాటూ శివకూ ఇంత తిండి పెట్టేవారు. వారితో పాటూ సరూర్‌నగర్ చెరువులో ఈత కొట్టడం నేర్చుకున్నాడు శివ. అప్పటికి ఆ పిల్లాడికి తెలియదు, ఆ ఈత తన జీవితంలో ఎలా భాగం కాబోతోందోనని!

 
అదే ఫుట్‌పాత్‌పై సుమారు 18 మంది కుర్రాళ్లు ఒక గుంపుగా చేరారు. అందులో దొంగలు ఉన్నారు. ఇంట్లోంచి తప్పిపోయి వచ్చిన వారు ఉన్నారు. పారిపోయిన వారు ఉన్నారు. మత్తుకు బానిసలు అయిన వారు ఉన్నారు. వీరంతా ఒక జట్టు.

 
కొత్తపేట పండ్ల మార్కెట్ చాలా ఫేమస్. శివ జట్టులోని కొందరు కుర్రాళ్లు అక్కడకు వచ్చే పండ్ల లారీలు స్లో అయినప్పుడు వాటిపైనున్న పండ్లు దొంగతనం చేసేవారు. ఒకరోజు పోలీసులు వచ్చారు. దొంగతనం చేసినవారినీ, చేయనివారినీ కలిపి తీసుకుపోయారు. గట్టిగా కొట్టారు. ‘‘నేను వాళ్లతో ఉన్నా. కానీ. ఎప్పుడూ దొంగతనం చేయలేదు. చేయని తప్పుకు దెబ్బలు తినడంతో చాలా బాధేసింది’’ అన్నారు శివ ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ.

 
కొన్ని రోజుల తరువాత ఒక అనాథాశ్రమానికి చెందిన ఒక బృందం వాళ్ల దగ్గరకు వచ్చింది. విడతల వారీగా అక్కడున్న పిల్లలను తీసుకుని వెళ్లారు. ముందు మలక్ పేటలో, తరువాత ఖైరతాబాద్‌లో ఉంచారు. వయసు పెరిగిన తర్వాత ఆ ఆశ్రమం వాళ్లు పిల్లలకు పనులు చేసే అవకాశం కల్పించారు. శివ తోటి కుర్రాళ్లు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్‌ల్లో చెత్త ఏరుకునే పనిలో చేరారు. తానూ చేరాడు. కానీ అది అతడికి నచ్చలేదు.

 
ఈ పనులు చేస్తూనే రకరకాల చోట్లకు తిరిగాడు శివ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర వ్యభిచారం చేసే వారు, తాము కస్టమర్లతో వెళ్లే సమయంలో, తమ పిల్లలకు కాపలాగా ఉండేలా, తమకు అవసరమైన సామాన్లు తెచ్చేలా శివను వాడుకున్నారు. వాళ్లు ఇచ్చే డబ్బు ఆ వయసులో శివకు మంచి ఆదాయం. అదే సరిపోయేది.

 
అక్కడే శివకు కృష్ణ అనే హిజ్రాతో పరిచయం అయింది. కాస్త చదువుకున్న వాడైన కృష్ణ, క్రమంగా శివను వ్యభిచారం చేసే వారి నుంచి దూరం చేశాడు. తిరిగి ఆశ్రమంలో చేర్పించాడు. కష్టపడి చదువుకోవాలని సూచించాడు. ఆశ్రమం వారితో కూడా కృష్ణే మాట్లాడాడు.

 
దీంతో ఆశ్రమం వాళ్లు శివను బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. సీనియర్లు తనపై పెత్తనం చేయడం నచ్చని శివ, ఆశ్రమంలో నుంచి మళ్లీ బయటకు వచ్చేశాడు. అప్పుడే ఖాళీగా తిరుగుతూ ఏదో పని చేయడం ప్రారంభించాడు. ఆ క్రమంలో జరిగిందే హుస్సేన్ సాగర్లో మృతదేహం తీసిన ఘటన. అప్పటి నుంచీ అదే తన పని అయిపోయిందంటారు శివ.
సాగర్ ఒడ్డునే నివాసం
ప్రస్తుత హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న టూరిజానికి సంబంధించిన ఓ నిర్మాణంలోనే శివ కాపురం ఉంటున్నారు. చిన్న వయసులోనే యాదగిరి గుట్టకు చెందిన ఒక అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నారు. ఏడుగురు సంతానం. వారిలో ముగ్గురిని హుస్సేన్ సాగర్ లేక్ పోలీసులు ప్రభుత్వ హాస్టళ్లలో చేర్పించారు. మరో ముగ్గురిని మరో ఆశ్రమంలో చేర్పించారు రాంగోపాల్ పేట పోలీసులు.

 
‘‘వేరే చోటకు నేను వెళ్లిపోయి ఉండొచ్చు. కానీ, ఇక్కడ ఉంటేనే, ఎవరైనా చనిపోవడానికి వస్తే, రక్షించొచ్చు. వేరే దగ్గర ఉంటే, మృతదేహాలు తీసేందుకే రావాలి. ఒక ప్రాణాన్ని రక్షించినప్పుడు వచ్చే సంతృప్తే వేరు’’ అని అన్నారు శివ.

 
తనకు ఆత్మీయులు, సన్నిహితులు అనుకున్న చాలా మందిని శివ కోల్పోయారు. వారంతా సరైన పోషణ లేక, మత్తుకు బానిసలై, వ్యాధులకు గురై... ఇలా రకరకాల కారణాలతో చనిపోయారు. తనతో పాటూ సాగర్‌లో ఈత కొట్టిన పవన్, తనను ఆదరించిన పెంపుడు తల్లి కొడుకు మహేందర్‌లు కూడా వారిలో ఉన్నారు.

 
అందుకే ఎవరైనా చనిపోతే తనకు చాలా బాధగా అనిపిస్తుందని, మనుషులను కాపాడొచ్చనే సాగర్ దగ్గర ఉంటున్నానని శివ అన్నారు. తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ఈతగాడిగా ఉంటూ శవాలు తీసే పనిచేసిన అన్నాచ్చి అనే వ్యక్తి తనకీ పనిలో మెలకువలు నేర్పించారాని శివ చెప్పారు. సాగర్‌లోనే కాకుండా, ఇతర చోట్ల కూడా బాగా దెబ్బతిన్న మృతదేహాలను శివ తీస్తుంటారు.

 
కన్న తల్లితండ్రులు ఎవరో తెలియని శివను, లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర కూలి పని చేసుకుంటూ బతికిన మల్లేశ్వరమ్మ అనే మహిళ చేరదీశారు. మల్లేశ్వరమ్మ కుమార్తె తప్పిపోయింది. మరో కొడుకు చిన్న వయసులోనే మరణించాడు. దీంతో శివను ఆమె అక్కున చేర్చుకున్నారు.

 
ఇప్పుడు మల్లేశ్వరమ్మ కర్నూలులోని తన సొంతూరిలో నివాసం ఉంటున్నారు. శివ ఆమెను తన అమ్మగా చెప్పుకుంటారు. ఆమె బాగోగులు చూస్తుంటారు. ఆమె ఇంటి పేరునే శివ తీసుకున్నారు. ‘‘మాకు ఇబ్బంది లేదు. కానీ, పిల్లలకే ఇబ్బంది. వేసవిలో సాగర్ నుంచి వాసన ఎక్కువగా వస్తుంది. ఇక్కడికి పాములు వస్తుంటాయి. కానీ, ఇక్కడే ఉండి ఎవరూ చనిపోకుండా చూడాలనే తపన ఆయనకు ఎక్కువ. అందుకే ఇక్కడే కాపురం ఉంటున్నాం’’ అని శివ భార్య వివరించారు.

 
ఆమె తల్లిదండ్రులు ముందుగా శివతో ఆమె పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఇంట్లోంచి వచ్చేసి శివను పెళ్లి చేసుకున్నారు. కానీ, ఆ తర్వాత కుటుంబసభ్యులు వాళ్లతో కలిసిపోయారు.

 
ఆదాయం వినాయకుడు ఇస్తున్నాడు
శివ కుటుంబానికి సొంతిల్లు లేకపోయినా, భోజనానికి లోటు లేకుండా సాయం చేస్తున్నాడు వినాయకుడు. హుస్సేన్ సాగర్‌లో వినాయక చవితి తర్వాత విగ్రహాల నిమజ్జనం చేస్తారు. ఆ విగ్రహాల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో పాటూ ఇనుమును కూడా వాడతారు. నిమజ్జనం తరువాత సాగర్లోకి దిగి, ఆ ఇనుము సేకరించి, అమ్ముకుని జీవిస్తుంటారు శివ.

 
‘‘ఎన్‌టీఆర్ మార్గ్ వైపు సాగర్ లోతు తక్కువ. ‌నిమజ్జనం అయిన తరువాత మూడు నాలుగు రోజులు హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌లపై ఉండే వారంతా అక్కడే ఉంటారు. ఆ ఇనుము సేకరిస్తారు. మేమూ తీస్తాం. కానీ ట్యాంక్‌బండ్ వైపు లోతు ఎక్కువ. ఇక్కడకు వేరే వారు రారు. నేనూ, నాతో పాటూ ఉండే కొందరు కలసి ఇక్కడ ఇనుము సేకరిస్తాం’’ అని శివ చెప్పారు.

 
శవాలు తీయడాన్ని, ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారిని కాపాడటాన్ని తాను ఆదాయ వనరుగా చూడనని అంటున్నారు శివ. అయితే, కొందరు కృతజ్ఞత భావంతో నగదు లేదా వస్తు రూపంలో ఆయనకు సాయం చేస్తుంటారు. ఇక శవాలు తీయించినప్పుడు పోలీసులు తక్కువైనా ఎంతో కొంత ఇస్తుంటారని అన్నారు శివ. జుట్టు పెంచుకుని, కండలు కలిగిన శరీరంతో ఉండడంతో తనకు సినిమాల్లో విలన్ల వెనుక నుంచునే వేషాలు కూడా దొరుకుతున్నాయని ఆయన చెప్పారు.

 
ప్రస్తుతం శివ దృష్టి తన సంపాదన మీద లేదు. కర్నూలులోని తన పెంపుడు తల్లి ఊరిలో ఆయన రేణుక ఎల్లమ్మ గుడి కడుతున్నారు. ఆ గుడికి చందాలు అడుగుతున్నారు. ఇప్పటి వరకూ లక్షన్నర పోగు చేశారు.

 
‘‘నేను ఒక రోజు ఒక మహిళ మృతదేహాన్ని ఒడ్డుకు తెచ్చాను. ఆమె ఒంటి మీదకు దేవత వస్తుంది. ఆమె శరీరం బయటకు తెచ్చినప్పటి నుంచీ నా మనసు అదోలా అయిపోంది. ఆ తర్వాత, రేణుక ఎల్లమ్మ గుడి కట్టాలని నిర్ణయం తీసుకున్నాను. 2016లో మొదలుపెట్టా. ఇంకా కడుతూనే ఉన్నా. తెలిసిన వారు సాయం చేస్తున్నారు. నేను కూడా చాలా మందిని గుడికి సహకారం అడుగుతున్నాను. మనం చేసిన పని ఏదైనా శాశ్వతంగా ఉండిపోవాలని ఇలా చేస్తున్నా’’ అని చెప్పారు శివ.

 
ఎందుకీ ఆత్మహత్యలు?
ఆత్మహత్యలు చేసుకోవడానికి వచ్చే వారిలో ఎక్కువ మంది మధ్యతరగతి, మధ్య వయసు వారే ఉంటారంటారు శివ. ఇంట్లో గొడవలు, ఆర్థిక సమస్యలు, చదువులు, ప్రేమ వ్యవహారం, ఇంట్లో కన్నపిల్లలు పట్టించుకోని వృద్ధులు.. ఇలా రకరకాల కారణాలతో ఆత్మహత్య చేసుకోవడానికి వస్తుంటారని అన్నారు.

 
ఒక్కొక్కరిదీ ఒక్కో కారణమంటూ, కొన్ని ఉదాహరణలు ఆయన చెప్పారు. కరోనా సమయంలో కూడా ఆయన పలు మృతదేహాలను వెలికితీశారు. ‘‘చార్మినార్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి ఆస్తమా ఉంది. కరోనా వల్ల బెడ్స్ లేవు. వైద్యులు రోజూ ఆసుపత్రికి రమ్మని చెప్పారట. ఆయన నేరుగా వచ్చి సాగర్లో దూకేశారు. ఆయన్ను కాపాడటం కోసం ఆయన స్నేహితుడు కూడా దూకేశారు. నేను ఆయన స్నేహితుడిని కాపాడగలిగాను. ఆ వ్యక్తి మృతదేహాన్ని బయటకుతీశా. అయితే, వాళ్ళ వాళ్లెవరూ ఆయన శరీరం ముట్టుకోలేదు. నేనే అమీర్‌పేటలో ఆ వ్యక్తికి అంత్యక్రియలు చేశాను. పోలీసులు వద్దని వారించారు. శానిటైజర్ రాసుకుని, జాగ్రత్తలు తీసుకుని నేనే చేసేశా’’ అని శివ వివరించారు.

 
‘‘మరో పెద్దాయన ఉన్నారు. పెళ్లి కాలేదు. ఆయన చెల్లెళ్ల కుటుంబాల వారు ఇప్పటి వరకూ చూస్తున్నారు. కరోనా అనుమానంతో వారు ఆయన్ను చూడడం మానేశారు. దీంతో ట్యాంక్ బండ్‌లో దూకేశారు. కాపాడాను. పోలీసులు వచ్చి వారి కుటుంబ సభ్యులకు సర్ది చెప్పి ఆయన్ను అప్పగించారు’’ అంటూ లాక్‌డౌన్ కాలంలో తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు శివ.

 
లాక్‌డౌన్ సమయంలో సాగర్‌లో, ఇతరత్రా రోడ్లపై మరణించే వారివి దాదాపు 17 మృతదేహాలను శివ వెలికితీశారు. వారిలో సగం మంది మద్యానికి బానిసలై, లాక్‌డౌన్‌లో మందు దొరకకపోవడం వల్ల చనిపోయినవారు, ఆత్మహత్య చేసుకున్నవారేనని అన్నారాయన. ట్యాంక్ బండ్‌లోనే తాను ఆరేడు శవాలు తీసినట్లు చెప్పారు.

 
శివకు ఒకటే కోరిక, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోకూడదు. ఆత్మహత్యలకు ప్రయత్నించే వారిని కాపాడడం కోసం తాను ఇక్కడే ఉంటాను అంటున్నారాయన. తన పిల్లలను బాగా చదివించి, ఒకరిని సైన్యంలోకి పంపి, మిగతా వాళ్లందరినీ పోలీసులను చేయాలని తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు.

 
కర్నూలు జిల్లా సి.బెలగళ మండలం గండ్రేవులలో తాను తలపెట్టిన రేణుక ఎల్లమ్మ గుడిని పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నానని చెప్పారు. ఆ గ్రామానికి చెందిన రామ్మూర్తి, రఘునందన్‌లు స్థలం ఉచితంగా ఇవ్వగా తాను నిర్మాణ బాధ్యతలు తీసుకున్నానని శివ చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు