విజయ నిర్మల మరణం: 'అసిస్టెంట్ డైరెక్టర్స్‌కు ఆవిడ అమ్మ.. షూటింగ్ సెట్‌లో హిట్లర్'

గురువారం, 27 జూన్ 2019 (14:37 IST)
ప్రముఖ తెలుగు సినీ నటి, హీరో కృష్ణ సతీమణి విజయ నిర్మల జూన్ 27, గురువారం తెల్లవారుజామున మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ నిర్మల, హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ప్రస్తుతం ఆమె వయసు 75 సంవత్సరాలు. ఆమె మృతదేహాన్ని ఈరోజు ఉదయం 11 గంటల నుంచి నానక్‌రామ్ గూడలోని తమ నివాసంలో ఉంచుతామని, విజయ నిర్మల అంత్యక్రియలను రేపు నిర్వహిస్తామని నరేష్ తన ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేశారు.
 
విజయ నిర్మల మృతి పట్ల పలువురు సీనీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలనటిగా తమిళ, తెలుగు చిత్రాల్లో నటించిన విజయ నిర్మల, హీరోయిన్‌గా తన కెరియర్‌ను కొనసాగించారు. తెరమీద మాత్రమే కాక, డైరెక్టర్‌గా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. విజ‌య నిర్మ‌ల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సినీ హీరో చిరంజీవి అన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''మ‌న తెలుగు ప‌రిశ్ర‌మ‌లో భానుమ‌తి గారి త‌ర్వాత గ‌ర్వించ‌ద‌గిన బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి శ్రీమ‌తి విజ‌య‌నిర్మ‌ల గారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. బాలనటిగా, కథానాయికగా, దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను చాటారు విజయ నిర్మల'' అని చిరంజీవి అన్నారు.
 
''అంత‌టి ప్రతిభావంతురాలిని మ‌నం ఇప్ప‌ట్లో ఇంకెవ‌రినీ చూడ‌లేం. కృష్ణ‌గారికి జీవిత భాగ‌స్వామిగా ఎప్పుడూ ఆయ‌న ప‌క్క‌న నిల‌బ‌డి ఆయ‌న‌కు చేదోడువాదోడుగా ఉంటూ త‌న ధ‌ర్మాన్ని నెర‌వేరుస్తూ వ‌చ్చారు. ఆమె లేని లోటు కృష్ణ గారికి ఆ కుటుంబానికే కాదు యావ‌త్ తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు. వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, ఆ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తూ కృష్ణ‌గారికి, న‌రేష్‌కు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను'' అని చిరంజీవి అన్నారు.
 
పనిరాక్షసి
బాలనటిగా తమిళ, తెలుగు చిత్రాల్లో నటించిన విజయ నిర్మల, హీరోయిన్‌గా తన కెరియర్‌ను కొనసాగించారు. నటిగా మాత్రమే కాకుండా, డైరెక్టర్‌గా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. మలయాళ సినిమా 'భార్గవి నిలయం' హీరోయిన్‌గా విజయ నిర్మల తొలి చిత్రం. రంగులరాట్నం సినిమాతో తెలుగు సినిమాలో హీరోయిన్‌గా అడుగుపెట్టారు. కృష్ణతో విజయ నిర్మల తొలి చిత్రం సాక్షి. హీరోయిన్‌గా రెండు సినిమాల్లో నటించిన తర్వాత, ఆమె సాక్షి సినిమాలో నటించారు. తన భర్త పేరు కృష్ణ, తన పేరులోని విజయ రెండు పేర్లు కలిసేలా ‘విజయకృష్ణ’ బ్యానర్‌ను ప్రారంభించారు.
 
హీరోయిన్‌గా మొదటి సినిమా మళయాళంలో చేసిన విజయ నిర్మల, డైరెక్టర్‌గా తన మొదటి చిత్రం ‘కవిత’ను కూడా మళయాళంలోనే చేశారు. ఈ సినిమా విజయం సాధించడంతో 'మీనా' నవల ఆధారంగా, తెలుగులో అదే పేరుతో మీనా సినిమాకు దర్శకత్వం వహించారు. దర్శకత్వంలో ఆమె పనితనం చూసి, అందరూ ఆమెను పనిరాక్షసి అని పిలిచేవారు.
 
తన సొంత బ్యానర్‌లో మాత్రమే కాకుండా, ఇతర నిర్మాతలు కూడా విజయ నిర్మలతో సినిమాలు చేశారు. తన భర్త కృష్ణతోపాటు, హేమాహేమీలు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావును కూడా విజయనిర్మల డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో కృష్ణ కూడా మరో హీరోగా నటించారు. సావిత్రి, భానుమతి తర్వాత దర్శకత్వం వైపు మళ్లిన ప్రముఖ హీరోయిన్ విజయ నిర్మల. హీరోయిన్‌గా ఆమె కృష్ణతో ఎక్కువ సినిమాలు చేశారు.
 
'అసిస్టెంట్ డైరెక్టర్స్‌కు ఆవిడ అమ్మ.. షూటింగ్ సెట్‌లో హిట్లర్'
విజయ నిర్మల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన దర్శకుడు శివనాగేశ్వర రావు, ఆమెకు సంబంధించిన జ్ఞాపకాలను జర్నలిస్ట్ రూపావాణికి వివరించారు.''అవసరానికో సందర్భాన్ని బట్టో చాల మందిని మేడం అనాల్సివస్తుంది.. కానీ నేను ఇష్టంగా మేడం అని పిలుచుకునేది మాత్రం మా మేడం విజయ నిర్మల గారినే.. నేను ఆవిడ దగ్గర 2 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. అసిస్టెంట్ డైరెక్టర్స్‌కు ఆవిడ అమ్మ.. సెట్ లో హిట్లర్'' అని శివనాగేశ్వర రావు చెప్పుకొచ్చారు.
 
''ఊటీలో కృష్ణ గారి షూటింగ్స్ జరుగుతుంటే ఏప్రిల్, మే నెలల్లో ఆయన అన్ని సినిమాల సాంగ్స్ ఊటీలో ప్లాన్ చేసేవారు. అప్పుడు మేడం కూడా ఊటీలోనే వుండే వారు. ఆవిడ స్వయంగా వంటచేసి, లొకేషన్‌కి పంపేవారు. కృష్ణ గారి బర్త్‌డే అయితే మాకు పండగే.. ఆ రోజు ఆవిడ స్వయంగా వండిన వంటలతోనే మాకు భోజనాలు!''
 
''కొన్ని మరణాలు ఒక పట్టాన జీర్ణించుకోలేం. నిర్మాతని జాగ్రత్తగా చూసుకోవాలి అనే విషయం ఆమె దగ్గర నేను నేర్చుకున్న తొలి పాఠం'' అని ఆయన అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు