తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొందరు గ్రామస్థులు శ్మశానంలో ఐసొలేషన్లో ఉన్నారని ఆంధ్రజ్యోతి దిన పత్రిక కథనం ప్రచురించింది. కరోనా బాధితులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాలకు వెళ్లడమో.. హోం ఐసొలేషన్‌లో ఉండటమో చేస్తుంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని గిరిజన గ్రామం మొద్దులమడ వాసులు భిన్నంగా వ్యవహరించారు.
150 జనాభా ఉన్న ఈ గ్రామం లో 50 మందికి పాజిటివ్ వచ్చింది. ఇంటికొకరు వైరస్ బారినపడ్డారు. దీంతో తమ ద్వారా మిగతావారికి వ్యాపించకుండా ఉండేందుకు వైకుంఠధామం (శ్మశానం)ను ఐసొలేషన్ కేంద్రంగా ఎంచుకున్నారు. ఈ మేరకు రెండు రోజుల నుంచి వైకుంఠధామంలోనే ఉంటున్నారు. సామూహిక వంటలకు ఏర్పాట్లు చేసుకున్నారు. వీరికి అవసరమైన ఆహార సామగ్రిని ఊరి ప్రజలు సమకూర్చారని పత్రిక చెప్పింది.
చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, బంధువులూ కొంతసాయం చేశారు. టీఆర్‌ఎస్ నాయకుడు బిర్రం వెంకటేశ్వరరావు నిత్యావసర వస్తువులను అందజేశారు. చిప్పల బాబు భోజనాలు పంపిస్తున్నారు. కాగా, మొద్దులమడలో కరోనా సోకినవారిని ఐసొలేషన్ కేంద్రానికి తరలించి వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దీనికి వారు అంగీకరించడం లేదు. ఇక్కడే తమకు స్వేచ్ఛగా ఉందని చెబుతున్నారని ఆంధ్రజ్యోతి వివరించింది.