ప్రేమలో పడిపోవడం సరే, మరి బయటపడడం ఎలా? 18వ శతాబ్దికి చెందిన ఓ సన్యాసి చెప్పిన రహస్యాలు

మంగళవారం, 28 జూన్ 2022 (11:38 IST)
1736లో, బెనిటో జెరోనిమో ఫిజూ (1676-1764) అనే సన్యాసి తన అనుచరులకు చాలా ఉపయోగకరమైన రహస్యం అంటూ ఒకటి బోధించారు. ప్రేమ నుంచి ఎలా బయటపడాలి అన్నది ఆ ఉద్బోధ సారాంశం. మనం ప్రేమించే వ్యక్తులు నివసించే ప్రాంతం నుంచి దూరంగా వెళ్లడం, వారు చేసిన తప్పులను పదే పదే గుర్తు చేసుకోవడం, లేదంటే మరొక వ్యక్తితో ప్రేమలో పడటం లేదా లైంగిక వాంఛలు తీర్చుకోవడం లాంటి సంప్రదాయ పద్ధతులు మర్చిపొమ్మని ఫిజూ సూచించారు. ప్రేమ నుంచి బైటపడటానికి అనుసరించాల్సిన ఏకైక మార్గం, మనం ప్రేమించే వ్యక్తి జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా ఏదైనా ఒక భయంకరమైన సంఘటనను గుర్తుకు తెచ్చుకోవడమేనని ఆయన సూచించారు.

 
హృదయాన్ని చెదరగొట్టడానికి భయానక ఘటనలు
ప్రేమ నుంచి బయటపడేసే చికిత్స చేయడం చాలా కష్టమైన పని అని ఫిజూ ఒప్పుకున్నారు. ఇందుకోసం అత్యంత ప్రభావవంతమైన రూపాలను ఎలా ఎంచుకోవాలో ఆయన సూచించారు. ప్రత్యక్షంగా అనుభవించిన భయంకరమైన ఘటనలైతే సులభంగా పనవుతుందని ఫీజూ అన్నారు. ప్రేమికుడు లేదా ప్రేమికురాలి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇలాంటి భయంకరమైన దృశ్యాలను, ఘటనలను గుర్తుకు తెచ్చుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని ఫీజూ చెప్పారు.

 
ఈ ప్రయత్నంలో ఓపిక, సహనం కూడా అవసరమన్నారు ఫీజూ. ఎందుకంటే ప్రేమికుడు/ప్రేమికురాలి చిత్రం స్థానంలో ఒక వికారమైన రూపాన్ని గుర్తుకు తెచ్చుకునేందుకు అవసరమైన ఊహలు చేసేందుకు కొత్త సమయం పడుతుందని ఆయన చెప్పారు. "రెమెడియోస్ డెల్ అమోర్" అనే వ్యాసంలో ఆయన ట్రీట్‌మెంట్ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ప్రయత్నించారు. ప్రేమకథల ద్వారానే తన చికిత్సా విధానాలను వివరించారాయన.

 
ఇదే సందర్భంలో ఆయన మనిషిలో భావోద్వేగాలు ఎలా ఉద్భవించాయో చెప్పే ప్రయత్నం చేస్తారు. మరొక విధంగా చెప్పాలంటే, శరీరం, ఆత్మ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి. ఇంద్రియాల పట్ల అవగాహన, వాటివల్ల ఏర్పడే భావాలను, శరీరంలో అవి తెచ్చే మార్పులను కూడా ఆయన వివరించారు. (ఉదాహరణకు గుండె దడ, లైంగిక ఆసక్తి ఏర్పడటం లాంటివి).

 
ప్రేమ భౌతిక శాస్త్రం
ఒక సన్యాసిగా, తన నగరాన్ని విడిచి బయటకు రాని ఫీజూ, ఈ విషయాల గురించి మాట్లాడటం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. కానీ, ఫీజూ చాలా తీవ్రమైన మేధస్సు ఉన్న వ్యక్తిలా ఆలోచిస్తారు. ఆయనకు సామాజిక జీవితం ఉంది. అప్పట్లో ఆయన తాను రాసిన వ్యాసాలపై మేధావులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. వారి రచననలను చదివేవారు. తన మఠంలో నిత్యం సమావేశాలు నిర్వహించే వారు. యాభై సంవత్సరాల వయస్సులో ఆయన తన రచనల ద్వారా జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించారు.

 
అప్పటికే తత్వశాస్త్రాన్ని బాగా చదవిని ఫీజూ, ఆనాటి సమాజంలో ఉన్న తప్పుడు నమ్మకాలు, ఊహలను విచ్ఛిన్నం చేయడానికి తన పాండిత్యాన్ని ఉపయోగించేవారు. ఆయన రాసిన వ్యాసాలు ఆనాటి స్పానిష్ సమాజాన్ని, యూరప్, అమెరికన్ ప్రజలను అబ్బుర పరిచాయి. భావోద్వేగాలు ఎలా ఉత్పన్నమవుతున్నాయనే దానిపై ఫీజూ ఆలోచనల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అప్పట్లో ఆయన ఈ అంశంపై ప్రజాదరణ పొందారు. ఆయన భావాలకు మంచి ప్రచారం కూడా లభించింది. శరీరపరంగా మగవాళ్లు, ఆడవాళ్లు ఒకటేనని అంటారు ఫీజూ. 'ఫెమినిస్ట్ ఫిజియాలజీ' అనే భావనను ఆయన నమ్మి ప్రచారం చేశారు.

 
అంటే, ఆయన ఉద్దేశం ప్రకారం, స్త్రీ శరీరం తక్కువ, పురుష శరీరం ఎక్కువా కాదు. మేధోపరంగా, మానసికంగా స్త్రీ పురుషులిద్దరూ సమానులే. అతని చెప్పిన "ప్రేమ భౌతికశాస్త్రం" అనేది స్త్రీలు భావోద్రేకపరంగా బలహీనులు, మేధోపరంగా తక్కువవారు అని నమ్మే వారి వాదనలకు ప్రత్యామ్నాయంగా రూపొందించిన సిద్ధాంతం.

 
హృదయానుభూతి
నరాలు శరీరధర్మ శాస్త్రంలో ప్రధాన పాత్రను పోషిస్తాయని, అవి ఇంద్రియాలను ఆత్మతో అనుసంధానిస్తాయని 18వ శతాబ్దంలో నమ్మేవారు. అప్పటి ప్రజల నమ్మకం ప్రకారం నరాలు ఆత్మ ప్రతిస్పందనను శరీరంలోని మిగిలిన భాగాలకు ప్రసారం చేస్తాయి. సంప్రదాయ వైద్య నమూనాల ప్రకారం, సంబంధిత అవయవాలలో అభిరుచుల అనుభూతి ఉంటుంది. ఆకలితో ఉన్నవారు కడుపులో ఆకలిని అనుభూతి చెందుతారు. అలాగే, సెక్స్ కోరికలు ఉన్నవారు మరో భాగంలో ఆ భావనను అనుభవిస్తారు. అలాగే ప్రేమికుడు తన బాధ, సంతోషం, దు:ఖంలాంటి అనుభూతులను గుండెలో అనుభవిస్తాడు.

 
ఫీజూ అభిప్రాయం ప్రకారం ప్రేమ పుట్టడానికి కారణాలు ఇలా ఉంటాయి.
1- ఇద్దరు వ్యక్తులు కలుసుకుంటే, వారి ఇంద్రియాల(రెటీనా, నాలుక, ముక్కు, చెవి) పొరలు వివిధ కణాల ముద్రలను రికార్డ్ చేస్తాయి. వాటి నుంచి ప్రతిబింబించే కాంతి, అవి ఇచ్చే వాసన, వాటి నుంచి వచ్చే గాలి లాంటివి ఎదుటి మనిషిలో రికార్డవుతాయి. 
 
2 - ఈ పొరల కంపనాలు ఇంద్రియ నాడులను కదిలిస్తాయి. ఇవి ఉద్దీపనను బట్టి చాలా రకాలుగా ప్రతిస్పందిస్తాయి.
 
3 -నరాల కదలికలు ఆత్మ నివసించే కామన్ సెన్సోరియంకు చేరుకుంటాయి. ఊహ (ఆత్మలో ఒక భాగం) ఈ ప్రకంపనలను అర్థం చేసుకుంటుంది. సంబంధిత కంపనాలను వివిధ అవయలకు చేర్చే నరాలకు ప్రసారం చేస్తుంది
 
4 - ప్రేమికుల గుండె, శరీరం గుండా ప్రవహించే నరాలు ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, నిట్టూర్పులు, కన్నీళ్లులాంటివి. ఇది ప్రేమ భావనను పుట్టిస్తే, నాడీ ప్రవాహాలు లైంగిక అవయవాలకు చేరుతాయి.
 
ఈ ప్రకంపనలన్నీ ఊహల వల్ల కూడా కలుగుతాయని ఫీజూ వాదించారు. లేకపోతే మనం భౌతికంగా వ్యక్తితో ఉన్నంత కాలం మాత్రమే ఇలాంటి భావాలు ఉంటాయి.
 
ఇప్పుడు ప్రేమవ్యాధికి ఆయన చెప్పిన నివారణ మార్గం స్పష్టంగా అర్ధమవుతుంది. ప్రియమైన వ్యక్తులను జ్ఞాపకం రావడం వల్ల ఏర్పడిన నరాల ప్రకంపనలను, భయంకరమైన ఘటనలను ఊహించుకోవడం ద్వారా రద్దు చేయవచ్చు. '' ఒక అల మరొక అలను విచ్ఛిన్నం చేస్తుంది" అని ఫీజూ సూత్రీకరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు