అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం వచ్చింది. కనీసం 920 మందిమరణించినట్లు అక్కడి తాలిబన్ అధికారులు చెప్పారు. అఫ్గానిస్తాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. మారుమూల ప్రాంతాలలోకి హెలీకాప్టర్లు వెళ్లి బాధితులను ఆసుపత్రులకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నాయి.
మరణాల సంఖ్య పెరగొచ్చని అంతకు ముందే స్థానిక అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు. వందల ఇళ్లు కూలిపోయాయని, మృతుల సంఖ్య పెరగొచ్చని తాలిబన్ నేత హిబతుల్లా అఖుండ్‌జాదా అన్నారు. గత రెండు దశాబ్దాల్లో ఇది అత్యంత ఘోరమైన భూకంపమని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిప్యూటీ మినిస్టర్ షరాఫుద్దీన్ ముస్లిం అన్నారు. ఏ వీధిలోకి వెళ్లినా భూకంప బాధితులు ఏడుస్తూ కనిపిస్తున్నారు. చాలా ఇళ్లు కూలిపోయాయి అని పక్తికా ప్రావిన్స్ లో పనిచేస్తున్న జర్నలిస్టు ఒకరు బీబీసీకి తెలిపారు.
అఫ్గానిస్తాన్ ఆగ్నేయ ప్రాంతంలో ఉండే ఖోస్త్ నగరానికి 44 కిలోమీట్ల దూరంలో ఈ భూకంపం కేంద్రం ఉంది. భూకంప కేంద్రం నుంచి 500 కిలోమీటర్ల దూరం వరకు ప్రకంపనలు వచ్చాయి. పాకిస్తాన్, భారత్, అఫ్గానిస్తాన్ దేశాలలోని అనేక ప్రాంతాలలో ప్రకంపనలు నమోదయ్యాయి. 500 కిలోమీటర్ల పరిధిలో భూమి కంపించిదని యూరోపియన్ మెడిటేరియన్ సెస్మోలాజికల్ సెంటర్ తెలిపినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌తో పాటు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోనూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు.
శిథిలాలలో చిక్కుకున్నవారి ఫొటోలు, వీడియోలు పెద్దసంఖ్యలో సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. 'పక్తికా ప్రావిన్స్‌లోని నాలుగు జిల్లాల్లో రాత్రి భారీ భూకంపం వచ్చింది. ఈ ప్రమాదంలో వందల మంది మా దేశ పౌరులు చనిపోయారు. మరెంతో మంది గాయపడ్డారు. పదుల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి.' అని అఫ్గాన్ ప్రభుత్వ ప్రతినిధి బిలాల్ కరీమీ ట్వీట్ చేశారు.