కార్గిల్ యుద్ధం: పాక్ సైన్యం చొరబాట్ల గురించి ఉప్పందించిన గొర్రెల కాపరి ఇప్పుడేం చేస్తున్నారు?

గురువారం, 25 జులై 2019 (18:23 IST)
1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో సుమారు 610 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరి ఆ చొరబాట్ల గురించి మొదట భారత సైన్యానికి సమాచారం ఇచ్చింది ఎవరు? నిజానికి, అప్పుడు పాకిస్తాన్ సైన్యం చొరబాట్ల గురించి భారత సైన్యానికి ఉప్పందించిన వ్యక్తి కార్గిల్‌లోని గార్కౌన్ గ్రామానికి చెందిన ఓ గొర్రెల కాపరి. ఆయన పేరు తాషీ నామ్‌గ్యాల్. ఆయనతోపాటు ఆ గ్రామంలో కొంతమంది గ్రామస్థులు కూడా ఆర్మీకి సహకరించారు.

 
కార్గిల్ యుద్ధం ముగిసి 20 ఏళ్లైన సందర్భంగా బీబీసీ ప్రతినిధి అరవింద్ ఛాబ్రా ఆ గ్రామానికి వెళ్లారు. ఆనాటి చొరబాట్లపై స్థానికులతో మాట్లాడారు. గార్కౌల్ గ్రామం కార్గిల్‌‌లోని బాల్టిక్ సెక్టార్లో ఉంది. కొత్తగా కొన్న యాక్ (జడలబర్రె) కనిపించకపోవడంతో దాన్ని వెతుకుతూ కొండలపైకి వెళ్లారు తాషీ.

 
యాక్ కోసం వెతికితే పాక్ సైన్యం ఉంది
కొండ రాళ్లలో చాలా సేపు వెతికాక ఆయనకు తన యాక్ కనిపించింది. దానితోపాటు అక్కడ కనిపించిన దృశ్యం, కార్గిల్ యుద్ధానికి మొదటి కారణం అని భావిస్తారు. "అది నా కొత్త యాక్ కాకుంటే దాన్ని నేను పట్టించుకునేవాడినే కాదు. దాన్ని వెతకడానికి వెళ్లకపోతే బహుశా అక్కడ పాకిస్తాన్ సైన్యం ఉండడం నాకు తెలిసుండదు" అని తాషీ చెప్పారు. ఆయన అక్కడ కొంతమంది అనుమానితులను చూశారు. వెంటనే ఆ సమాచారం భారత సైన్యానికి చెప్పారు.

 
"నేనొక పేద పశువుల కాపరిని. అప్పుడు నేను 12 వేల రూపాయలకు ఆ యాక్‌ను కొన్నాను. కొండల్లో అది తప్పిపోవడంతో కంగారుపడ్డా. అది కొత్త యాక్ కావడంతో దాన్ని వెతకడానికి వెళ్లా. యాక్‌తోపాటు, పాక్ సైనికులు కూడా కనిపించారు" అన్నారు. పాక్ సైనికులు కార్గిల్ శిఖరాలపైకి చేరిన విషయం గురించి కీలక సమాచారం ఇచ్చినా, తనకు ప్రభుత్వం వల్ల ఒరిగిందేమీ లేదన్నారు తాషీ.

 
"20 ఏళ్లు గడిచిపోయాయి. నేనేం సాధించాను, ఏం లేదు. వాళ్లకు చాలా కీలక సమాచారాన్ని అందించాను. నాకు ప్రభుత్వం సంతోషంగా ఏదో ఒక సాయం చెయ్యాల్సింది. కానీ ఏమీ చెయ్యలేదు" అన్నారు తాషీ.

 
సింధూ నదీ తీరంలో
తాషీ నివసిస్తున్న గార్కౌన్ గ్రామం కార్గిల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో సింధునదీ తీరంలో ఉంది. అప్పట్లో కార్గిల్ పర్వతాల్లోకి చొరబడ్డ పాకిస్తాన్ సైన్యం అక్కడ తమ స్థావరాలు ఏర్పాటు చేసింది. తాషీ బౌద్ధ మతాన్ని ఆచరిస్తారు. ఆయన పాక్ సైనికులను తాను మొదటిసారి చూసిన ప్రాంతానికి మమ్మల్ని తీసుకెళ్లారు.

 
"తప్పిపోయిన మేకల కోసం వెతుకుతున్నప్పుడు వారి శిబిరాలు కనిపించాయి. అక్కడ నాకు మొత్తం ఆరుగురు కనిపించారు" అని తాషీ చెప్పారు. తాషీ మొదట వాళ్లను వేటగాళ్లని అనుకున్నారు. కానీ ఆయుధాలు, ఇతర సామగ్రి అంతా చూసి భారత సైన్యానికి సమాచారం ఇచ్చారు.

 
దక్కింది ప్రశంసలే
శత్రు సైనికుల గురించి కీలక సమాచారం ఇచ్చినందుకు తాషీకి చాలా ప్రశంసలు, ప్రశంసాపత్రాలు కూడా దక్కాయి. కానీ వాటి వల్ల తనకు ఒరిగిందేమీ లేదంటున్నారు తాషీ. "చాలామంది ఉన్నతాధికారుల నుంచి నాకు ఎన్నో సర్టిఫికేట్లు వచ్చాయి. కానీ అవి నాకు ఎందుకూ పనికిరాలేదు" అన్నారు.

 
"నాకు నలుగురు పిల్లలు. ఒక పాపను చదివించడానికి సాయం చేయడం తప్ప నాకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు. ఎలాంటి గౌరవం దక్కలేదు. ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఏవీ నిలబెట్టుకోలేదు" అన్నారు.

 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తనకు చాలా విశ్వాసం ఉందన్న తాషీ, ఎవరో ఒకరు తన సందేశాన్ని ఆయన వరకూ చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. తాషీ మాత్రమే కాదు, గ్రామస్థులందరూ అదే చెప్పారు. భారత సైన్యానికి తాము అంత సాయం చేసినా, ఎవరూ తమను పట్టించుకోలేదన్నారు. కానీ ఈ యుద్ధంలో భారత్ విజయానికి తాము కూడా కారణమైనందుకు గర్వంగా ఉందని చెబుతున్నారు.

 
యుద్ధం వల్ల గ్రామం ధ్వంసం
కార్గిల్ యుద్ధంలో తమ పొలాలు కూడా పాడయ్యాయని, కానీ తమ గురించి, గ్రామాభివృద్ధి గురించి ఎవరూ, ఏమీ చేయలేదని చెప్పారు. "ప్రతి కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు అక్కడే ఉండిపోయారు. ఇంట్లో మహిళలు, పిల్లల గురించి కూడా ఆలోచించలేదు. పాఠశాలలు మూసేశారు. ఆ యుద్ధంలో మా పొలాలు, గ్రామంలో కాలువలు అన్నీ నాశనమైపోయాయి" అని గార్కౌన్ గ్రామంలోనే ఉంటున్న సోనమ్ పంఛోక్ అనే మహిళ అన్నారు.

 
"ఈ గ్రామంలో కనీస సౌకర్యాలు కూడా లేవు. ఇప్పటి వరకు ఇక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయలేదు" అని ఆ గ్రామంలోనే ఉంటున్న మాజీ సైనికుడు త్సెరింగ్ స్కిత్ఫయిల్ చెప్పారు.

 
అధికారులు చెబుతోంది వేరే
గ్రామస్థుల ఫిర్యాదుల గురించి కార్గిల్ డిప్యూటీ కమిషనర్ బసీర్ ఉల్ హక్‌ను బీబీసీ వివరణ కోరింది. ఆయన తాషీ సహా ఆ గ్రామస్థులందర్నీ ఆగస్టు 15న సత్కరించాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. గ్రామాభివృద్ధి కోసం కూడా తాము ప్రణాళికలు సిద్ధం చేశామని, స్థానికంగా పర్యటకాన్ని కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

 
నిజానికి, ఇలాంటి సరిహద్దు గ్రామాల ప్రజలు శత్రువుల ప్రలోభాలకు లొంగిపోకుండా ఉండేందుకు, వారి వ్యక్తిగత అభివృద్ధి, గ్రామాభివృద్ధి కోసం కేంద్ర హోం శాఖ 'బోర్డర్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్' పేరిట ప్రత్యేకంగా నిధుల్నికేటాయించింది. ఈ విషయంలో అధికారులు ఎన్ని కబుర్లు చెబుతున్నా... తాషీ సహా అక్కడి గ్రామస్థుల వాదన మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు