మేడలీన్ మద్యం సేవిస్తూ ట్రంప్‌తో తనకున్న చనువు గురించి గొప్పలు చెప్పుకోవడంతో పాటు ఆయన కుటుంబానికి సంబంధించి బయటకు తెలియని వివరాలు బయటపెట్టారని.. ఆ కారణంతోనే ఆమెను తొలగించారని సీబీఎస్ న్యూస్ ప్రసారం చేసింది. ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడైన తొలి రోజు నుంచే మేడలీన్ ఆయనకు వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేస్తున్నారు. ఆమెను తొలగించడానికి గల కారణాలపై స్పందించేందుకు వైట్‌హౌస్ నిరాకరించింది. ఆమెను పక్కనపెట్టినట్లుగా న్యూయార్క్‌టైమ్స్ మొట్టమొదట ప్రచురించింది.
ఇంతకీ ఆమె ఏయే విషయాలు చెప్పింది
ట్రంప్ ఆగస్టు ప్రారంభంలో న్యూజెర్సీలోని బర్క్‌లీ హైట్స్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన డిన్నర్ సందర్భంగా ఆమె విలేకరులతో ఆఫ్ ద రికార్డుగా మాట్లాడుతూ చెప్పినవన్నీ మీడియాలో వచ్చేశాయి. తాగిన మత్తులో ఆమె ట్రంప్ కుటుంబానికి సంబంధించిన బయటకు తెలియని వివరాలు చెప్పారని సీబీఎస్ న్యూస్ వెల్లడించింది. అంతేకాదు, ట్రంప్‌ను కలవడానికి ప్రయత్నించే మీడియా వ్యక్తులు ఎవరెవరో కూడా ఆమె అందరితో చెప్పారని ఆ వార్తాసంస్థ తెలిపింది. అయితే, ఆమె వారితో జరిపిన సంభాషణల విషయం ట్రంప్‌కు ఎలా తెలిసిందన్న విషయంలో స్పష్టత లేదు.
వైట్‌హౌస్ అధికారుల్లో కొందరు చాలాకాలంగా మేడలీన్ అధ్యక్షుడిని మోసం చేస్తోందని అనుమానిస్తున్నారు. ట్రంప్ విరోధులకు అనుకూలంగా ఆమె తొలి రోజు నుంచే గూఢచారిలా పనిచేస్తోందని మాజీ అధికారి ఒకరు సీబీఎస్‌కు చెప్పారు. నిజానికి ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచిన రోజు రాత్రి మేడలీన్ చాలా బాధపడ్డారని, తట్టుకోలేక ఏడ్చారని.. ట్రంప్ విజయం తరువాత వెలువడిన రెండు పుస్తకాల్లో ఉంది. మేడలీన్ ట్రంప్ వద్ద పనిచేయడానికి ముందు రిపబ్లికన్ నేషనల్ కమిటీలో పనిచేసేవారు.
అయితే, ట్రంప్ విజయాన్నే తట్టుకోలేని ఆమె ఏం చేశారో ఏమో కానీ 1,45,000 డాలర్ల భారీ జీతానికి ఆయన వ్యక్తిగత సహాయకురాలి పోస్టును సంపాదించారు. మేడలీన్ తన ప్రయివేట్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ట్రంప్‌తో పాటు చేసే ప్రయాణాలు, వైట్‌హౌస్‌లో ఉద్యోగం గురించి, తన లైఫ్ స్టైల్ గురించి నిత్యం పోస్టులు పెడుతూ ఉంటారని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
గతంలో సీనియర్ పాత్రికేయుడు బాబ్ ఉడ్‌వర్డ్ ఓసారి ట్రంప్‌ను ఇంటర్వ్యూ చేస్తూ.. తాను ఆయన వ్యక్తిగత బృందంలోని పలువురి ద్వారా ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించినా వారెవరూ ఆ విషయాన్ని ట్రంప్ వరకు తీసుకెళ్లలేదని నేరుగా ఆయనకే చెప్పారు. అప్పుడు ట్రంప్ 'మీరు మేడలీన్ ద్వారా ప్రయత్నించాల్సి ఉండేది' అన్నారు. ట్రంప్ ఇతరుల వద్ద ఆమె ప్రస్తావన తెచ్చినప్పుడంతా 'మై బ్యూటీ' అనేవారని సీబీఎస్ న్యూస్ వెల్లడించింది.