పాన్ కార్డ్.. ఇప్పుడు ప్రతి ఆర్థిక అవసరానికీ ఎంతో కీలకం. బ్యాంక్ ఖాతా తెరవడం నుంచి బంగారాన్ని భారీ మొత్తంలో కొనడం వరకూ పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (PAN) తప్పనిసరి. ఈ పాన్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని ఇటీవల కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం సుమారు 1435 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. పాన్, టాన్, టిన్‌లకు కలిపి ఏకీకృత వ్యవస్థను ఏర్పాటు చేసి, డేటా గోప్యత కోసం మరిన్ని చర్యలను తీసుకోనున్నట్లు ప్రకటించింది. డూప్లికేట్ పాన్, డబుల్ పాన్ వంటి వాటికి చెక్ చెప్పడంతో పాటు వివిధ వ్యవస్థలను బలోపేతం చేసి, పన్నుఎగవేతలను మరింత కట్టడి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఇంతకీ కేంద్రం కొత్తగా చెబుతున్న పాన్ 2.0 ఏంటి? ఇప్పటికే పాన్ ఉన్నవారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలా? పాత పాన్ ఉన్నవాళ్లందరికీ కొత్తది పంపిస్తారా? మార్పులు చేర్పులు ఎలా చేసుకోవాలి?
74.6 కోట్ల పాన్ కార్డులు
భారత్‌లో 2018లో 37.9 కోట్లుగా ఉన్న పాన్ కార్డులు 2024 మార్చినాటికి 74.6 కోట్లకు పెరిగాయి. ఆధార్‌తో పాన్ కార్డ్ లింక్ చేసిన వాళ్ల సంఖ్య 60.5 కోట్లుగా ఉందని ఐటీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. పాన్ కార్డులలో 98 శాతం వ్యక్తిగతమైనవి కాగా, సంస్థలకు 0.83 శాతం, కంపెనీలకు 0.35 శాతం, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్‌కు 0.33 శాతం జారీ అయ్యాయి. ఇక మిగిలినవి ప్రభుత్వాలు, హిందూ అవిభక్త కుటుంబాలు, స్థానిక సంస్థలు ఉన్నాయి.
పాన్ కార్డ్ 2.0 అంటే?
పాన్ 2.0పై తలెత్తే కొన్ని ప్రశ్నలకు కేంద్రం ఇచ్చిన సమాధానాలు ముందుగా చూద్దాం. పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ కోసం ఏర్పాటు చేసిన ఈ-గవర్నెన్స్ ప్రాజెక్ట్ ఇది. పాన్ సేవలను అధునాతన టెక్నాలజీతో మరింత సులభతరం చేయడం ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ కింద పాన్ అలాంట్‌మెంట్, అప్‌డేషన్, కరెక్షన్ వంటి సేవలను ఏకీకృతం చేస్తారు.
టాన్ (TAN - Tax Deduction and Collection Amount number)ను ఈ ప్రాజెక్ట్‌లో విలీనం చేయనున్నారు. పాన్‌ను వేగంగా (అథెంటికేషన్, వ్యాలిడేషన్) వెరిఫై చేసుకునే వెసులుబాటును ఫైనాన్షియల్ సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలు, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించబోతున్నారు.
పాన్ 2.0తో వేగంగా డేటాను పొందొచ్చు.
తప్పుల దిద్దుబాటు, మార్పులు త్వరగా పూర్తి చేసుకోవచ్చు.
వేచి ఉండే సమయం తగ్గుతుంది.
ఏకీకృత వ్యవస్థ కావడంతో డేటా అంతా ఒకేచోట ఉంటుంది.
ఎలాంటి ఖర్చూ లేకుండా పాన్ పొందొచ్చు.
పేపర్‌లెస్ కాబట్టి పర్యావరణ హితమైనది
డేటా భద్రత మరింత మెరుగ్గా ఉంటుంది.
పాత పాన్ కార్డుకు, కొత్తదానికి తేడా ఏంటి?
పాన్ సంబంధ సేవలను ప్రస్తుతం వివిధ విభాగాలు చూస్తున్నాయి. వాటిలో ఐటీ శాఖకు చెందిన ఈ-ఫైలింగ్ పోర్టల్, యూటీఐ ఐటీఎస్‌ఎల్ పోర్టల్, ప్రొటీన్ - ఈ గవర్నెన్స్ పోర్టల్ ఉన్నాయి. అయితే కొత్త వ్యవస్థలో పాన్, టాన్ సంబంధ సేవల బాధ్యతలను ఒకే సంస్థ చూసుకుంటుంది. సింగిల్ యూనిఫైడ్ పోర్టల్‌లో టాన్, పాన్‌కు సంబంధించిన పూర్తిస్థాయి సేవలు అందుబాటులో ఉంటాయి. కొత్తగా పాన్ జారీ, వాటిలో మార్పులు చేర్పులు, ఆన్‌లైన్‌లో పాన్ నిర్ధరణ,కార్డు పునర్ముద్రణ వంటివి ఈ పోర్టల్‌లోనే అందుబాటులో ఉంటాయి. టెక్నాలజీ ఆధారంగా పూర్తిగా పేపర్‌లెస్ విధానం ఉండనుంది. పాన్ కేటాయింపు, కరెక్షన్ వంటివన్నీ ఉచితంగానే చేసుకోవచ్చు. ఈ-పాన్‌ను రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి పంపుతారు.
ప్రస్తుతం మనం పాన్ కార్డ్‌ను యూటీఐలో దరఖాస్తు చేసుకుంటే, మళ్లీ ఆ సంస్థ వెబ్‌సైట్‌కు వెళ్లి మాత్రమే కార్డ్ రీప్రింటింగ్, ఈ-పాన్, కరెక్షన్ వంటివి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ ప్రక్రియకు ఫుల్ స్టాప్ పడుతుంది. అలానే ఆధార్ - పాన్ మిస్‌మ్యాచ్ అయినప్పుడు అప్లికేషన్‌ను సదరు సంస్థకు ప్రాసెసింగ్ కోసం ఫిజికల్‌గా పంపాల్సి వచ్చేది. ఆ ఇబ్బంది కూడా ఇకపై ఉండకపోవచ్చు.
కొత్త కార్డు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా?
పాత కార్డు చెలామణీలో ఉంటుంది. కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా కరెక్షన్ - అప్‌డేషన్ ఉన్నప్పుడు మాత్రమే 2.0 కింద దరఖాస్తు చేసుకుని కొత్త కార్డును పొందొచ్చు. కొత్త వ్యవస్థలో కూడా పాత కార్డులు, నెంబర్లు పనిచేస్తాయని కేంద్రం స్పష్టంగా చెబుతోంది. ఇప్పటికే పాన్ ఉన్న ప్రతి ఒక్కరికీ కొత్త కార్డులను ఐటీ శాఖ పంపించదు అని గమనించాలి.
క్యూఆర్ కోడ్ తప్పనిసరా?
ఐదారేళ్లుగా పాన్ కార్డులు క్యూఆర్ కోడ్‌తోనే వస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులో కూడా క్యూఆర్ ఆధారిత వ్యవస్థ ఉంటుంది. కొత్త దానిలో మరింత వేగంగా పాన్ డేటా ప్రాసెస్ అయ్యేలా డైనమిక్ క్యూఆర్ వ్యవస్థ ఉంటుంది. పాన్ కార్డుపై ఉన్న క్యూఆర్ స్కాన్ చేయగానే పేరు, ఫొటో, సంతకం, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ వంటి వివరాలన్నీ తేలికగా తెలుసుకోవచ్చు. ఇది బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సులువుగా ఉంటుంది. పాత పాన్ ఉన్నవాళ్లు మార్చుకోవడమే మంచిదని పాన్ ప్రాసెసింగ్ ఏజెన్సీ ప్రొటీన్‌టెక్ చెబుతోంది. కొత్త సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న క్యూఆర్ కోడ్ పాన్ కార్డ్ పొందడం మంచిదని సూచిస్తోంది. పర్సనల్ డేటా, పెళ్లి తర్వాత ఇంటిపేరులో మార్పు, అడ్రస్ మార్పు వంటివి ఉన్నప్పుడు పాన్ డేటా అప్‌డేట్ చేసుకోవడం మంచిది.
అడ్రస్ మార్పు ఎలా?
ఇప్పుడున్న వ్యవస్థ ద్వారా కూడా మీరు పాన్ కార్డులో చిరునామా మార్చుకోవచ్చు. ఆధార్‌తో లింక్ అయి ఉండే మీ అడ్రస్‌ను https://www.onlineservices.nsdl.com/paam/endUserAddressUpdate.html లేదా https://www.pan.utiitsl.com/PAN_ONLINE/homeaddresschange లింకు ద్వారా సులువుగా మార్చుకోవచ్చు.
పాన్ కార్డ్ డేటాబేస్‌ను టెక్నాలజీ ద్వారా మరింత అధునాతనంగా మారుస్తున్నారు. దీనివల్ల పాన్ వివరాలేవీ మారవు. కొత్త కార్డులను మీ పాత చిరునామాకు పంపించరు. ప్రత్యేకంగా ఏదైనా మార్పును కోరుతూ రిక్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే కొత్త కార్డు వస్తుంది. ఐటీ శాఖ యాక్ట్ 1961 ప్రకారం ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉండడం నేరం. తెలియక ఎక్కువ కార్డులను కలిగి ఉంటే సంబంధిత ఐటీ అధికారిని సంప్రదించి ఒక కార్డును డీయాక్టివేట్ చేసుకోవాలి. కొత్త వ్యవస్థ కేంద్రీకృతంగా ఉండటంతోపాటు టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ వినియోగం వల్ల డూప్లికేషన్‌కు అవకాశాలు బాగా తగ్గిపోతాయని ప్రభుత్వం చెబుతోంది.
లోన్స్ సులువుగా పొందొచ్చా?
ప్రత్యేక రీడర్ల ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా మీ డేటా (పేరు, ఊరు, ఫొటో, ట్యాక్స్ చెల్లింపులు.. వంటివి) సులభంగా, క్షణాల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చేరతాయి. దీంతో లోన్ ప్రాసెసింగ్ వేగంగా జరుగుతుంది. ఆడిటింగ్ వంటి సమయాల్లో క్యూర్‌ఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కొనుగోళ్లు, పన్ను చెల్లింపులు, రిటర్న్స్ ఫైలింగ్ పనులన్నీ సులువుగా తెలుసుకునే వీలుంటుంది. ప్రత్యేక క్యూఆర్ కోడ్ అప్లికేషన్ ద్వారా స్కాన్ చేసినప్పుడు మాత్రమే ఈ వివరాలు తెలుస్తాయి. ఫోన్‌లోని క్యూఆర్ స్కానర్‌తో దీన్ని స్కాన్ చేయలేం. పాన్ పైన ఉండే కోడ్‌లో డేటా అంతా ఎన్‌క్రిప్ట్ అయి ఉంటుంది. అథెంటిక్, సర్టిఫైడ్ స్కానర్స్ మాత్రమే వీటిని రీడ్ చేయగలవు.
ప్రభుత్వ గుర్తింపు పొందిన వ్యవస్థలు, వ్యక్తులు మాత్రమే ఈ డేటాను యాక్సెస్ చేయగలరు. బ్యాంక్స్, ఐఆర్‌డీఏఐ గుర్తింపు పొందిన బ్రోకర్స్, మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్, సెబీ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇన్సూరెన్స్ రిపాజిటరీలు, క్రెడిట్ కార్డ్ సంస్థలు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు, కేవైసీ రిజిస్ట్రీ, ఐటీ శాఖ, స్టాక్ ఎక్స్ఛేంజీలు వంటి సంస్థలు మాత్రమే పాన్ క్యూఆర్ కోడ్ డేటాను డీకోడ్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అందుకే డేటా గురించి భయపడాల్సిన అవసరం లేదు.
పాన్‌ను ఎప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి?
పాన్‌లో మీ పేరు, ఆధార్‌లో మీ పేరు మిస్‌మ్యాచ్ అయినప్పుడు దాన్ని కచ్చితంగా అప్‌డేట్ చేయాలి. లేకపోతే ఆన్‌లైన్ పాన్ వెరిఫికేషన్ ఫెయిల్ అవుతుంది. ఆర్థిక లావాదేవీలకు, కొన్ని ప్రభుత్వ సేవలు పొందాలనుకున్నప్పుడు ఇది అవరోధంగా మారుతుంది. లోన్లు, క్రెడిట్ కార్డు దరఖాస్తుల వంటివి తిరస్కరణకు గురవుతాయి. అందుకే కేవలం పాన్ రీప్రింట్ కోసం దరఖాస్తు చేయకుండా, అవసరమైన మార్పులు చేయించుకోవాలి. కేంద్రం ఈ ప్రాజెక్ట్ కోసం నిర్దిష్ట సమయాన్ని వెల్లడించలేదు. అయితే ఇప్పుడున్న పాత వ్యవస్థ ద్వారా కూడా మనం పాన్ అప్‌డేట్స్ యధావిధిగా చేసుకోవచ్చు. పేరులో మార్పులు, చిరునామా మార్పులు, సంతకం మార్పులు వంటివి ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఐటీ శాఖ వెబ్‌సైట్, Protean, UTIITSL ద్వారా చేసుకోవచ్చు.