సమంత కేసు: యూట్యూబ్ చానళ్లలో ఎవరినైనా, ఏమైనా అనేయొచ్చా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?

శుక్రవారం, 22 అక్టోబరు 2021 (18:48 IST)
నటి సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్న నేపథ్యంలో ఆమె విడాకులకు గల కారణాలు అంటూ అనేక ‘ఊహాగానాలతో’ కొన్ని మీడియా చానళ్లు, యూట్యూబ్ చానళ్లు చేసిన విశ్లేషణలు వైరల్ అయ్యాయి. ఆ చానళ్లలో ప్రసారం చేసిన సమాచారం ఆధారంగా సంబంధం లేని రంగాల వారు కూడా సమంత వ్యక్తిగత జీవితం గురించి విశ్లేషణలు చేశారు.

 
అయితే, సమంత వీటినన్నిటినీ చూస్తూ ఊరుకోలేదు. మొదట్లో ఈ వార్తలు తనకు మానసిక వేదన కలిగిస్తున్నాయంటూ, తనకు కాస్త ప్రైవసీ కావాలని కోరుతూ ఆమె ఒక ట్వీట్ కూడా చేశారు. కానీ, ఆమెపై వస్తున్న వార్తల ప్రవాహం ఆగలేదు. దీంతో సమంత కొన్ని యూట్యూబ్ చానళ్లు నిరాధారంగా, అసత్య ప్రచారం చేస్తూ తన పరువుకు, ప్రతిష్టకు భంగం కలిగించాయని పేర్కొంటూ కూకట్‌పల్లిలోని అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టులో చానళ్లు, ఒక వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

 
కొందరు సంబంధం లేని వ్యక్తులు చేసిన ప్రచారం తనకు, తన కుటుంబానికి తీవ్ర మనస్థాపం కలిగించిందని, సొంతంగా కెరీర్‌లో ఎదిగిన తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తోందని, సమంత ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వీడియోలన్నీ గూగుల్‌లో, ఇతర సోషల్ మీడియా వేదికలపైనా వైరల్ అయ్యాయని, ఇది అవమానకరంగా ఉందంటూ సమంత తరఫు న్యాయవాది పిటిషన్‌లో తెలిపారు.

 
కిరణ్ బేడీ, జితేందర్ సింగ్ వర్సస్ ఏఐఆర్ కమిటీ ఆఫ్ ఇంక్వైరీ కేసులో "ఒక వ్యక్తి పరువు చాలా విలువైనది. పరువు మానవ సమాజానికి చాలా ముఖ్యమైన అంశం. ఇది రాజ్యాంగపరంగా ప్రతీ వ్యక్తి అనుభవించగలిగే హక్కు" అని సుప్రీం కోర్టు పేర్కొన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.

 
యూట్యూబ్ లేదా సోషల్ మీడియా చానళ్లను నియంత్రించే చట్టాలేంటి?
మీడియాకు సంబంధించే చట్టాలన్నీ మీడియా అని చెప్పే ప్రతి సంస్థకు, చానల్‌కు, యూట్యూబ్ చానళ్లకూ వర్తిస్తాయి అని మహీంద్ర యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర మాజీ సమాచార కమిషనర్ శ్రీధర్ మాడభూషి బీబీసీతో చెప్పారు. కానీ, దురదృష్టవశాత్తూ చాలా మీడియా చానళ్లు ఆ నియమావళిని పాటించటంలేదని అన్నారు. "ఇది బాధ్యతారాహిత్యం మాత్రమే" అని అన్నారు. బహిరంగంగా అవమానపరచడం, దుష్ప్రచారం, పరువు తీయడం, మనోభావాలను గాయపరచడం లాంటి పరువు నష్టానికి సంబంధించిన అంశాలన్నీ ఈ చానళ్లకూ వర్తిస్తాయని శ్రీధర్ అన్నారు.

 
తబ్లిగీ మర్కాజ్ సంస్థపై కోవిడ్ మహమ్మారి ప్రారంభ సమయంలో జరిగిన దుష్ప్రచారంపై సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ "అదుపు లేకుండా పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న వెబ్ పోర్టళ్లు, యూట్యూబ్ వేదికలు వాక్‌స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి" అని హెచ్చరించారు. ఇది దేశ ప్రతిష్టకు కూడా భంగం కలిగిస్తుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

 
"యూట్యూబ్ అనేది కొత్త సాంకేతికత. ఇది ఇతర మీడియా కంటే ప్రమాదకరం. ఒక వార్తాపత్రిక, టీవీలో ఏదైనా సమాచారం ప్రసారం చేసినప్పుడు అది ప్రసార సమయానికి మాత్రమే పరిమితం అవుతుంది. కానీ, డిజిటల్ మీడియా పరిధి చాలా విస్తృతం. పదే పదే వ్యక్తులు, సంస్థల వివరాలు అవమానకర రీతిలో ప్రసారమై వైరల్ అయ్యే అవకాశముంది" అని సుప్రీం కోర్టు న్యాయవాది శ్రవణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. పత్రికలు, టీవీలలో ఏదైనా తప్పుడు సమాచారం ప్రసారం జరిగినప్పుడు ఒక వివరణ ఇస్తాయి, కానీ, యూట్యూబ్ అలాంటి వివరణ ఇచ్చేలా చట్టాలేమి లేవని శ్రవణ్ అన్నారు.

 
తబ్లిగీ మర్కాజ్ సంస్థ పై దుష్ప్రచారం, పక్షపాత వైఖరితో పాత్రికేయం జరిగినట్లు జమాయిత్ ఉలామా హింద్ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా మాట్లాడుతూ "తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రింట్, టీవీ చానళ్ల కోసం నియంత్రణ యంత్రాంగం ఉంది కానీ, వెబ్, యూ ట్యూబ్ చానెళ్లకు నియంత్రణ విధానం లేదు" అని జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు. వాక్‌స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిని నియంత్రించేందుకు కేంద్రం విధానమేదైనా ప్రవేశపెట్టిందా అని ఆయన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు.

 
"కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను రూపొందించడం ద్వారా మీడియాకున్న వాక్‌స్వాతంత్ర్యానికి.. పౌరులు సరైన సమాచారాన్ని పొందేందుకు మధ్య సమతుల్యతను సాధించేందుకు చూస్తాం" అని తుషార్ మెహతా కోర్టుకు సమాధానమిచ్చారు. ఫేక్ న్యూస్ సర్క్యులేషన్‌ను నియంత్రించి వెబ్ పోర్టల్స్, చానళ్లు ప్రసారం చేసే కంటెంట్‌కు వారిని బాధ్యులను చేసేందుకు ఈ నిబంధనలను తీసుకొస్తున్నట్లు మెహతా చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021ను రూపొందించింది. దేశంలో ఉన్న ఓటీటి , డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ఈ నిబంధనలకు కట్టుబడి అమలు చేసేందుకు మే 25, 2021ను గడువు తేదీగా కూడా నిర్ణయించింది. కానీ, ఈ కొత్త ఐటీ నిబంధనలు మీడియా స్వాతంత్య్రాన్ని హరిస్తున్నాయని అంటూ చాలా మంది వివిధ కోర్టుల్లో సవాలు చేసిన విషయాన్ని తబ్లిగీ కేసు విచారణ సమయంలోనే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు చెప్పారు.

 
యూట్యూబ్ చానల్ ఎవరైనా తెరవవచ్చా?
కంటెంట్ ఉన్న ఎవరైనా సొంతంగా యూ ట్యూబ్ చానల్ తెరవవచ్చు. ఈ చానళ్లు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్‌ను పాటించాల్సి ఉంటుంది. 

 
యూట్యూబ్ కమ్యూనిటీ నియమావళి ఏమిటి
యూట్యూబ్ వేదికగా స్పాం, వేధింపులకు పాల్పడటం లాంటివి అనుమతించదు
కంటెంట్‌ను పర్యవేక్షించేందుకు యూట్యూబ్ కొంత మంది సభ్యులు, టెక్నాలజీ సహాయం తీసుకుంటుంది.

 
యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ పరిధిలోకి ఏమేం వస్తాయి?
వేరొకరిలా నటిస్తూ మోసం చేయడం (ఇంపర్సనేషన్ )
స్పామ్, స్కాంలు
పిల్లలకు హాని కలిగించే కంటెంట్
ఆత్మహత్య, స్వీయ హానిని ప్రేరేపించే కంటెంట్
విద్వేష ప్రసంగాలు
హింసాత్మక నేర సంస్థలు
హింసాత్మక గ్రాఫిక్స్ తో కూడిన కంటెంట్
కోవిడ్ 19 గురించి తప్పుడు సమాచారం
ఆయుధాల గురించి సమాచారం
చట్ట వ్యతిరేక ఉత్పత్తుల అమ్మకం లాంటి కార్యకలాపాలన్నీ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ నిషేధిస్తాయి.
 
 
పరువు నష్టం అంటే ఏంటి?
పరువు నష్టం(డిఫమేషన్) అనేది రెండు రకాలు. ఒకటి లైబల్, రెండవది స్లాండర్ . రాతపూర్వకంగా కానీ ప్రచురణలో కానీ ఎవరినైనా నిందిస్తే అది లైబల్ అవుతుంది. మాటలతో అవమానిస్తే దాన్ని స్లాండరింగ్ అంటారు. సైబర్ వేదికల కోసం ప్రత్యేకంగా డిఫమేషన్ చట్టాలేమి లేవు కానీ, ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం పరిధిలోకే ఈ నేరాలు కూడా వస్తాయని హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది మేఘన చెప్పారు.

 
ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 499 డిఫమేషన్ ను నిర్వచిస్తుంది. ఎవరైనా మాటల ద్వారా గాని, లేదా రాత పూర్వకంగా గాని, సంకేతాల ద్వారా కానీ, వ్యక్తుల ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ప్రవర్తించిన పక్షంలో అది సెక్షన్ 499 కింద నేర పరిధిలోకి వస్తుంది. ఐపీసీలోని సెక్షన్ 500 ఈ నేరానికి శిక్షను నిర్వచిస్తుంది. దీనికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, లేదా జరిమానా కానీ, లేదా రెండూ కానీ ఉండవచ్చు.

 
యూట్యూబ్‌పైనా డిఫమేషన్ వేయొచ్చా?
పత్రికలు, టీవీలపై పరువు నష్టం దావా వేస్తున్నప్పుడు.. రాసిన వారు, ప్రచురించిన వారిని కూడా బాధ్యులను చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కు ఎందుకు మినహాయింపు ఇవ్వాలని శ్రీధర్ మాడభూషి ప్రశ్నించారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను కూడా ప్రచురణకు వేదిక కల్పించినందుకు బాధ్యులను చేయాలని అన్నారు. అయితే, యూట్యూబ్ వేదిక ద్వారా కూడా కాపీ రైట్ లేదా పరువు నష్టం ఫిర్యాదు చేయవచ్చు. వ్యక్తిగత, సంస్థ పరువును దెబ్బ తీసే విధంగా యూట్యూబ్ ద్వారా కంటెంట్ ప్రసారం చేసిన పక్షంలో డిఫమేషన్ కంప్లయింట్స్ ఫార్మ్ ద్వారా యూట్యూబ్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
 
 
ఇందుకు తగిన ఆధారాలను సమర్పించేందుకు పరువు నష్టం జరిగిన వీడియోలను డౌన్‌లోడ్ చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత కోర్టులో పరువు నష్టం కేసు నమోదు చేయవచ్చు. యూట్యూబ్ మాతృ సంస్థ గూగుల్ కావడంతో, యూట్యూబ్ ఫిర్యాదు విధానం గూగుల్ ఫిర్యాదు విధానం ఒకేలా ఉంటాయి. గూగుల్ డిఫమేషన్ సపోర్ట్ పేజీలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం వ్యక్తులు, సంస్థల పరువును దెబ్బ తీసే విధంగా చేసిన వ్యాఖ్యలు, వీడియోలు డిఫమేషన్ పరిధిలోకి వస్తాయి. అయితే, "ఈ రిపోర్టడ్ కంటెంట్‌ను చాలా వరకు ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ సమీక్ష చేసి నియమాల ఉల్లంఘన జరగలేదని తేల్చేస్తుంది" బాధితులకు తగిన న్యాయం జరగదని టెక్ నిపుణులు నల్లమోతు శ్రీధర్ అంటారు.

 
యూట్యూబ్ కమ్యూనిటీ నియమావళిని ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది?
ఏదైనా కంటెంట్ కంమ్యూనిటీ గైడ్ లైన్స్‌కు తగిన విధంగా లేనప్పుడు, మొదటిసారి నియమావళికి అనుగుణంగా లేదనే హెచ్చరిక చేస్తుంది. రెండవ సారి కూడా ఉల్లంఘన జరిగితే, ఈ మెయిల్ ద్వారా స్ట్రైక్ చేస్తుంది. ఒక్కసారి ఈ స్ట్రైక్ వస్తే, యూట్యూబ్‌లో వీడియోలు, పాడ్ కాస్ట్స్ లాంటివి ఒక వారం రోజుల వరకూ పోస్ట్ చేయడానికి అనుమతించదు. రెండవ స్ట్రైక్ వస్తే, రెండు వారాల వరకూ ఎటువంటి కంటెంట్ పోస్ట్ చేసేందుకు అనుమతించదు. మూడు సార్లు గనక స్ట్రైక్ లు వస్తే, ఛానెల్ ను పూర్తిగా ప్లాట్ ఫార్మ్ పై నుంచి తొలగిస్తారు. 90 రోజుల వరకూ తిరిగి ఛానెల్ పునరుద్ధరణ జరగకపోవచ్చు.

 
మొదటి సారి స్ట్రైక్ వచ్చినప్పుడే, దానికి గల కారణాలు తెలుసుకుని జాగ్రత్తలు వహించాలని యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ సూచిస్తున్నాయి. ఎవరైనా వీడియో కంటెంట్ గురించి ఫిర్యాదు చేసిన పక్షంలో ఆ వీడియోను సమీక్ష చేసి దానిని నియంత్రించాలో లేదా కంటెంట్ తొలగించాలా అనేది నిర్ణయిస్తారు. అయితే, సదరు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఇటువంటి ఫిర్యాదులను తీవ్రంగా పరిగణిస్తే వారి యూజర్ బేస్, రెవెన్యూ తగ్గుతుందనే ఉద్దేశంతో చాలా ఫిర్యాదులపై చర్యలు తీసుకోరని శ్రీధర్ నల్లమోతు చెప్పారు.

 
ఇతరుల వీడియోలు వాడటం వల్ల కాపీ రైట్ ఉల్లంఘన నోటీసులు (స్ట్రైక్) పంపిస్తారు. ఇలాంటి సందర్భాల్లో వీడియోలను పూర్తిగా తొలగిస్తారు. విశాఖపట్నానికి చెందిన త్రినాథ్ ఒక ప్రైవేటు యూ ట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు. ఆయన కూడా ఆడియో, వీడియో కాపీ రైట్ విషయంలో ఇలాంటి స్ట్రైక్‌లను ఎదుర్కొన్నట్లు చెప్పారు. సాధారణంగా, బాధిత వ్యక్తులు వ్యక్తిగతంగా గాని, తమ న్యాయవాదుల ద్వారా గానీ తమకు ఇబ్బంది కలిగించే వీడియోలను తొలగించమని అభ్యర్థిస్తారని చెప్పారు. అలా తనకు, ఒక కాలేజీలో విద్యార్థులు గొడవ చేసిన వీడియోను పోస్టు చేసినప్పుడు సదరు కాలేజీ యాజమాన్యం ఆ వీడియోను తొలగించమని అభ్యర్ధించినట్లు చెప్పారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు తెలిపారు. వారి అభ్యర్ధన మేరకు ఆ వీడియోను తొలగించినట్లు చెప్పారు.

 
యూట్యూబ్ ఫిర్యాదునెలా నమోదు చేయాలి?
యూట్యూబ్‌లో 'సబ్‌మిట్ ఏ కంప్లయింట్' ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఫిర్యాదుదారుల నివాసం ఉండే దేశంలో వాడే ఫిర్యాదు దరఖాస్తును నింపాలి. ఈ ఫిర్యాదు చేసేందుకు అమెరికాలో భిన్నమైన ప్రక్రియ ఉంటుంది. అయితే, డిఫమేషన్ పరిధిలోకి ఏయే అంశాలు వస్తాయనే విషయం పై సొంతంగా యూ ట్యూబ్ ఎటువంటి నిర్ణయం తీసుకోదు. అమెరికాలో థర్డ్ పార్టీలు పోస్ట్ చేసే సమాచారం గురించి యూ ట్యూబ్ ని బాధ్యులను చేయకుండా కమ్యూనికేషన్స్ డీసెన్సీ చట్టం లోని సెక్షన్ 230 కాపాడుతుంది. కానీ, సదరు సమాచారాన్ని పోస్టు చేసిన వారిని మాత్రం బాధ్యులను చేస్తుంది. డిఫమేషన్ లాంటి సివిల్ నేరాలకు నేరుగా యూట్యూబ్ పై చట్టపరమైన చర్య తీసుకునే వీలుండదు. కానీ, ఛానెల్ పబ్లిష్ చేసిన కంటెంట్‌లో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మార్పులు చేసినా

 
ఒక ప్రకటన అర్థాన్ని మార్చినా...
మార్చిన ప్రకటన అవమానపరిచేదిగా ఉన్నా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని మింక్ లా సంస్థ పేర్కొంటోంది. లేదా వారు సొంతంగా చట్టవ్యతిరేక సమాచారాన్ని ప్రసారం చేసినా అటువంటి కంటెంట్ తొలగిస్తామని హామీ ఇచ్చి, తొలగించకపోయినా కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే వీలుంటుంది. 2018లో తెలుగు నటి పడాల కళ్యాణి (కరాటే కళ్యాణి) తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచారంటూ ఒక ప్రైవేటు ఛానెల్ పై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు చేశారు.

 
ఇండియాలో కూడా యూ ట్యూబ్ పై కేసు ఫైల్ చేయవచ్చా?
యూట్యూబ్ ఆపరేట్ చేస్తున్న అన్ని దేశాలలోనూ యూట్యూబ్ పై కేసు ఫైల్ చేయవచ్చని శ్రవణ్ కుమార్ చెప్పారు. ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 75 (1) ప్రకారం.. సర్వీస్ ప్రొవైడర్ ప్రధాన కార్యాలయం దేశానికి వెలుపల ఉన్నప్పటికీ వారు భారత్‌లో సేవలు అందిస్తే.. ఐటీ చట్టం వారికి వర్తిస్తుంది. సాధారణంగా యూట్యూబ్ పై అత్యధికంగా కాపీ రైట్ కేసులుంటాయి. కొత్త ఐటీ నిబంధనల ద్వారా మీడియా ప్రచురించే వార్తలకు సదరు సంస్థలు లేదా ఓటీటి వేదికలను బాధ్యులను చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిబంధనల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు త్రీ టైర్ మెకానిజమ్ ను ప్రవేశపెట్టినట్లు తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.

 
ఈ విధానం ద్వారా:
ముందుగా బాధితులు సదరు మీడియా సంస్థకు లేదా ఛానెల్‌కు ఫిర్యాదు చేయవచ్చు. మీడియా వాటిని సరిదిద్దుకునే చర్యలు తీసుకోవడం లేదా 15 రోజుల్లోగా ఆ ఫిర్యాదుకు సమాధానం ఇవ్వడం గానీ చేయాల్సి ఉంటుంది. ఈ ఫిర్యాదు పట్ల 15 రోజుల లోపు ఎటువంటి చర్యలు తీసుకొని పక్షంలో సదరు సంస్థలు, వ్యక్తుల పై చర్యలు తీసుకోవచ్చని తుషార్ మెహతా వివరించారు.

 
బాధ్యతారాహిత్యంగా రిపోర్టింగ్ చేయడాన్ని, ఫేక్ న్యూస్ ను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరంగా తెలియచేస్తూ రెండు వారాలలోగా కౌంటర్ అఫిడవిట్ నమోదు చేయమని సుప్రీం కోర్టు తుషార్ మెహతాను కోరింది. అయితే, వీటి అమలు పై ఇంకా చాలా సందిగ్ధతలు నెలకొని ఉన్నాయని మేఘన అంటారు. సమంత విషయంలో యూ ట్యూబ్ చానెళ్లు చేసిన నష్టానికి వెల కట్టలేమని, ఆమెకు జరిగిన నష్టానికి తగిన పరిహారం ఇమ్మని కోరుతూ సమంత తరుపు న్యాయవాదులు కోరారు. అంతే కాకుండా, సమంత పై చేసిన అపవాదులకు బహిరంగంగా క్షమాపణ చెబుతూ కోర్టు ఖర్చులను కూడా డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు