భారత స్పేడెక్స్ మిషన్ సోమవారం (డిసెంబర్ 30, 2024) రాత్రి 9 గంటల 58 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. స్పేడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్‌పరిమెంట్. స్పేస్‌క్రాఫ్ట్‌ను డాకింగ్, అన్‌డాకింగ్ చేసేందుకు అవసరమైన టెక్నాలజీ అభివృద్ధి, ప్రదర్శన స్పేడెక్స్ మిషన్ ప్రధాన లక్ష్యం. స్పేస్ డాకింగ్ అంటే అంతరిక్షంలో రెండు వ్యోమ నౌకలను ఒకదాని పక్కన మరొకటి చేర్చి అనుసంధానించడం. ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) ప్రకారం, పీఎస్‌ఎల్వీ -సీ60 రాకెట్ సహాయంతో దీనిని అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. డిసెంబర్ 21న లాంచ్ వెహికల్‌ను లాంచ్ ప్యాడ్ వద్దకు తరలించారు. దీనికి సంబంధించిన వీడియోను ఇస్రో ఎక్స్‌లో షేర్ చేసింది.
ఈ మిషన్ ప్రత్యేకతలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
అసలేంటీ స్పేడెక్స్
స్పేడెక్స్ మిషన్‌లో రెండు చిన్నసైజు స్పేస్‌క్రాఫ్ట్‌లు ఉంటాయి. ఒక్కోటి సుమారు 220 కిలోల బరువు ఉంటుంది. పీఎస్‌ఎల్‌వీ - సీ60 రాకెట్ ద్వారా వీటిని ప్రయోగించనున్నారు. ఇవి భూమి నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తాయి. వీటిలో ఒకటి ఛేజర్ (SDX01) అనే శాటిలైట్(ఉపగ్రహం) కాగా, మరోటి టార్గెట్ (SDX02). విజయవంతంగా డాక్ చేయడం, డాక్ అయిన స్పేస్‌క్రాఫ్ట్‌ల మధ్య ఎనర్జీ ట్రాన్స్‌ఫర్, అన్‌డాక్ అయిన తర్వాత పేలోడ్‌లను ఆపరేట్ చేయడం ఈ మిషన్ ముఖ్య లక్ష్యాలు. ఒక స్పేస్‌క్రాఫ్ట్‌ను మరో స్పేస్‌క్రాఫ్ట్‌తో అనుసంధానం చేయడాన్ని డాకింగ్ అని, అనుసంధానమై ఉన్న రెండు స్పేస్‌క్రాఫ్ట్‌లను వేరుచేయడాన్ని అన్‌డాకింగ్ అని అంటారు.
స్పేడెక్స్ మిషన్ ఎందుకు ప్రత్యేకం?
తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసిన టెక్నాలజీని ఉపయోగించడమే ఈ మిషన్. భారత అంతరిక్ష పరిశోధనలకు ఈ టెక్నాలజీ చాలా కీలకం. భారత అంతరిక్ష కేంద్ర నిర్మాణం - నిర్వహణ, భారత వ్యోమగాములను చంద్రుడిపైకి పంపే ప్రణాళికలు కూడా ఈ భవిష్యత్ ప్లాన్లలో భాగమే. ఒక సాధారణ మిషన్‌ను పూర్తి చేయడం కోసం ఎక్కువ రాకెట్లను ప్రయోగించాల్సి వచ్చినప్పుడు 'ఇన్ - స్పేస్ డాకింగ్' టెక్నాలజీ అవసరం అవుతుంది. ఉదాహరణకు, స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా రెండు శాటిలైట్లు ఛేజర్ (SDX01), టార్గెట్ (SDX02)ను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. ఈ రెండు శాటిలైట్లు అత్యంత వేగంగా భూమి చుట్టూ పరిభ్రమిస్తాయి. రెండింటినీ ఒకే కక్ష్యలో, ఒకే వేగంతో తిరిగేలా ప్రయోగిస్తారు, కానీ ఈ రెండింటి మధ్య దాదాపు 20 కిలోమీటర్ల దూరం ఉండేలా వేరు చేస్తారు. దీనినే 'ఫార్ రెండెవూ' అని కూడా పిలుస్తారు.
ఈ ప్రయోగం భారత్‌కు ఎందుకు కీలకం?
స్పేడెక్స్ మిషన్ విజయవంతమైతే, ప్రపంచంలో స్పేస్ డాకింగ్ టెక్నాలజీ ఉన్న నాలుగో దేశంగా భారత్ అవతరించనుంది. అంతరిక్షంలో డాకింగ్ చేయడం చాలా క్లిష్టమైన పని. స్పేస్ డాకింగ్ టెక్నాలజీ విషయంలో ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే ముందంజలో ఉన్నాయి. స్పేడెక్స్ మిషన్ ద్వారా స్పేస్ డాకింగ్ టెక్నాలజీలో భారత్ నైపుణ్యం సాధించే అవకాశం ఉంది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఈ మిషన్‌తో స్పేస్ డాకింగ్‌లో నైపుణ్యం సాధించడం ద్వారా భారత్‌ను ప్రత్యేక దేశాల జాబితాలో నిలబెడుతుందని అన్నారు. చంద్రయాన్ -4, భారత అంతరిక్ష కేంద్రం వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో ఈ డాకింగ్ టెక్నాలజీ కీలకమని ఆయన అన్నారు. గగన్‌యాన్ మిషన్‌కు కూడా ఇది ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు.
ఇంకా ఏమేం ప్రయోజనాలున్నాయంటే..
ఈ మిషన్ లక్ష్యాలలో ఒకటైన డాక్ చేసిన స్పేస్‌క్రాఫ్ట్‌ల మధ్య ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ 'స్పేస్ రోబోటిక్స్' వంటి భవిష్యత్ ప్రయోగాల్లో కీలకం కానుందని నిరూపించవచ్చు. అంతేకాకుండా, స్పేస్‌క్రాఫ్ట్‌పై పూర్తి నియంత్రణ, అన్‌డాకింగ్ తర్వాత పేలోడ్ నిర్వహణ వంటి అంశాలు కూడా ఈ మిషన్ లక్ష్యాల్లో భాగంగా ఉన్నాయి. ఈ స్పేడెక్స్ మిషన్ పీఎస్ఎల్వీ 4వ స్టేజ్.. అంటే POEM - 4 (పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్‌పరిమెంటల్ మాడ్యూల్ - 4)ని కూడా ఉపయోగించనుంది. ఇది అకడమిక్ సంస్థలు, స్టార్టప్‌లకు సంబంధించిన 24 పేలోడ్‌లను కూడా తీసుకెళ్లనుంది. ఈ మిషన్‌లో భాగంగా డాక్ చేస్తున్న రెండు శాటిలైట్లు గంటకు 28,800 కిలోమీటర్ల వేగంతో తిరుగుతాయి. అంత వేగంతో కదులుతున్న వాటి వేగం తగ్గిస్తూ డాక్ చేయనుంది ఇస్రో. ఇది సవాల్‌తో కూడుకున్న పని.