బాలీవుడ్ అంటే హిందీ చిత్ర పరిశ్రమ. బాలీవుడ్‌కు హిట్లు, ఫ్లాప్‌లు, వేడుకలు, విషాదాలు, ప్రశంసలు, ఎగతాళి, ఉదాసీనత ఇవేవీ కొత్తకాదు. గతంలో ఎప్పుడో ఒకసారి వీటిని బాలీవుడ్ రుచి చూసింది. కానీ బాలీవుడ్ ఇంతకుముందున్నెడూ చూడని కొన్ని విషయాలు ఉన్నాయి. నటీనటులపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం అందులో ఒకటి.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమను, అందులోని నటీనటులను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా వారిపై నిందలేయడం, వారి గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం జరుగుతోంది. ఆన్‌లైన్‌లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న వారు ఇదంతా ఒక పద్ధతి ప్రకారం సమన్వయంగా చేస్తున్నారు. ఇలా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం వల్ల ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లు డబ్బులు కూడా సంపాదిస్తున్నారు.
ఇది ఎలా జరుగుతోందో అర్థం చేసుకోవాలంటే గూగుల్‌కు చెందిన వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్‌ను చూడండి. బాలీవుడ్ విషయంలో యూట్యూబ్‌లో తప్పుడు సమాచార వ్యాప్తి జరుగుతోంది. ఇదెలా జరుగుతుందో యూట్యూబ్ వివరణతో పాటు మేము ఈ కథనంలో వివరిస్తాము. అలాంటి వీడియోలను యూట్యూబ్‌లో వారాల పాటు చూసిన తర్వాత బీబీసీ డిస్‌ఇన్ఫర్మేషన్ యూనిట్ ఈ నెట్‌వర్క్‌ను గుర్తించింది.
హిందీ చలన చిత్ర పరిశ్రమ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్లు రైట్‌వింగ్ రాజకీయాలకు ఎలా మద్దతు తెలుపుతున్నారో బీబీసీ పరిశీలించింది. వాళ్లు బీజేపీ నాయకులతో మాట్లాడుతున్న వీడియోలు మాకు కనిపించాయి. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరైన ఇన్‌ఫ్లుయెన్సర్ల వర్చువల్ సమావేశంలోనూ ఇలాంటివాళ్లు కొందరు పాల్గొన్నారు. ఈ తప్పుడు సమాచారం ప్రభావం ఎంతో ఉంటుందని అంగీకరిస్తూనే.. తమను తాము రక్షించుకోవడానికి తాము చేయాల్సినంత చేయడం లేదని చిత్ర పరిశ్రమ సభ్యులు అభిప్రాయపడ్డారు.
'ఒక ఫేక్ వీడియో'
ముందుగా సందీప్ వర్మ ఉదాహరణతో మొదలుపెడతాం. మేము ట్రాక్ చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లలో వర్మ ఒకరు. ఆయన తానొక జర్నలిస్టునని, 'మధ్య తరగతి వ్యక్తి'నని చెప్పుకుంటున్నారు. బాలీవుడ్‌కు సంబంధించి ఆయన చానల్ (ఆ పేరు వెల్లడించడం లేదు)లో అనేక వీడియోలను మేము చూశాం. వాటిలో ఒక వీడియోలో ఆయన ఈమెను ఇంటర్వ్యూ చేశారు. (పై ఫోటోలో ఉన్న మహిళ) ఆమె ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ - ఎయిమ్స్‌లో మెడికల్ విజిల్‌బ్లోయర్ అని ఆయన చెప్పారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు దర్యాప్తునకు ఏర్పాటు చేసిన విచారణలో అనేక అవినీతి, అక్రమాలను ఆమె చూశారని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ఎయిమ్స్‌లో తప్పులెలా జరిగాయో చెప్పడానికి ఇదే 'అతిపెద్ద సాక్ష్యం' అంటూ వీడియోకు టైటిల్ పెట్టారు. ఈ ఆరోపణల గురించి తెలుసుకోవడానికి ఎయిమ్స్‌ను సంప్రదించింది బీబీసీ. అయితే, ఆ మహిళ సంబంధిత విభాగంలో ఎప్పుడూ పని చేయలేదని ఎయిమ్స్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. అంతేకాదు అదొక 'ఫేక్ వీడియో' అని ఆయన అభివర్ణించారు.
అయితే, ఆ విజిల్‌బ్లోయర్ చెప్పిన విషయాలను నిరూపించేందుకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ చెప్పారు. అయితే, ఆ ఆధారాలను ఇచ్చేందుకు మాత్రం నిరాకరించారు. సవాలు చేసినప్పుడు ఆయన ఉపసంహరించుకున్నారు. మాపై 'తదుపరి చర్యలు' తీసుకుంటానని బెదిరించారు.
పలువురు నటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు దేశ ద్రోహులు, హిందూ వ్యతిరేకులంటూ తప్పుగా ముద్ర వేస్తున్న కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్ల వీడియోలను మేము చూశాం. ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండానే డ్రగ్స్ ట్రేడ్, వ్యభిచారం, చైల్డ్ పోర్నోగ్రఫీ, చివరికి అవయవాల సేకరణలో పలువురు నటులకు ప్రమేయం ఉందంటూ కుట్రలు వ్యాప్తి చేయడం ఆ వీడియోల్లో మేము గమనించాం.
అలాంటి కొన్ని వీడియోల్లో తమకు నిధులు ఇవ్వాలంటూ ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. యూట్యూబ్ చాట్ ఫీచర్, పెయిడ్ మెంబర్‌షిప్ ఆప్షన్లను దీనికి ఉపయోగించుకుంటున్నారు. లేదంటే ఇన్‌ఫ్లుయెన్సర్లు నేరుగా తమ బ్యాంక్ అకౌంట్ వివరాలను వాళ్ల వీడియోల్లో ఇస్తున్నారు. "దయచేసి ప్రకటనలను (యూట్యూబ్) స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేయకుండా వాటిని చూస్తే, మాకు కొన్ని డబ్బులొస్తాయి. మేము నిలదొక్కుకోవడానికి అవి మాకు సాయం చేస్తాయి" అని ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ తన ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తులకు ప్రేక్షకులు ఎలా స్పందించారో, యూట్యూబ్ చాట్ ఆప్షన్స్ ద్వారా ఎలా డబ్బులు పంపించారో బీబీసీ చాలా వీడియోల్లో చూసింది.
"మేము ఎలా బతుకుతాం?"
బాలీవుడ్‌కు నిలయమైన ముంబైలో మేము నటి స్వర భాస్కర్‌ను కలిశాము. ఇలాంటి ఆన్‌లైన్ క్యాంపెయిన్‌ల ఆగ్రహాన్ని ఆమె తరచూ ఎదుర్కొంటుంటారు. దాని ప్రభావం ఎలా ఉంటుందని మేము ఆమెను అడిగాము. "నా గురించి ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. కానీ నా చర్యల వల్ల కంటే నా చుట్టూ వేరేవాళ్లు సృష్టించిన చర్యల వల్లే నాపై ప్రజల్లో అలాంటి అభిప్రాయం ఏర్పడింది" అని అన్నారు. ఇది తన జీవనోపాధిపై నేరుగా ప్రభావం చూపిందని ఆమె చెప్పారు.
"నాకు తగినన్ని అవకాశాలు రావడం లేదు. స్వర వస్తే వివాదాలు రావొచ్చని ఇండస్ట్రీలోని వాళ్లు భయపడుతున్నారు. కంపెనీల బ్రాండ్లు నన్ను చూసి చాలా భయపడుతున్నాయి" అని ఆమె అన్నారు. అయితే, అలాంటి ప్రచారాలు వ్యక్తిగతంగా కాకుండా పరిశ్రమపై ప్రభావం చూపుతాయా అని మేము ఆమెను అడిగాము. దీనికి ఆమె ఔనని చెప్పారు. ఇండస్ట్రీలో భయం బాగా ఉందని అన్నారు.
"2011, 2012, 2013లలో మాదిరిగా సినీ స్టార్లు పెట్రోల్ ధరలపై ఎందుకు గొంతెత్తరు? ఇవాళ ఎందుకు వాళ్లు మాట్లాడటం లేదు? వాళ్లపై దాడి జరిగినా కూడా వాళ్లెందుకు మాట్లాడరు? అని ప్రజలు తరచుగా అడుగుతూ ఉంటారు. కానీ మారిందేమిటో మనం ఆలోచించడం లేదు. మారిందేంటంటే భయం. బాలీవుడ్‌పై దాడి జరుగుతోంది. దాని వెనక ఒక ఎజెండా ఉంది. దాన్ని పక్కాగా ప్లాన్ చేసి, స్పాన్సర్ చేస్తున్నారు. వాళ్లు చెప్పినట్టు వినేలా బాలీవుడ్‌ను తయారు చేయడమే వాళ్ల లక్ష్యం" అని స్వర భాస్కర్ అభిప్రాయపడ్డారు.
కానీ బాలీవుడ్ అంటే కేవలం నటీనటులు మాత్రమే కాదు. అంతకుమించి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ ఇది. బీబీసీ బయటపెట్టిన ఇలాంటి ప్రచారాలు వారిపైనా ప్రభావం చూపిస్తున్నాయి. "కొంతమంది వ్యక్తులు ఇండస్ట్రీ పరువు తీయడం వల్ల కొందరు ప్రొడ్యూసర్లకు తమ ప్రాజెక్టులకు ఫైనాన్స్ తెచ్చుకోవడం కష్టంగా మారింది. కార్మికులు కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఆలస్యం అవుతాయి. మేము ఎలా బతకగలం?" అని ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ -ఐఎంపీపీఏ సెక్రటరీ అనిల్ నగ్రాత్ అన్నారు.
పుకార్లను మొదట్లోనే అడ్డుకోకపోతే భౌతిక దాడికి కూడా దారి తీయొచ్చు. ఇందుకు మాజీ జర్నలిస్ట్ శ్రీమీ వర్మ ఒక ఉదాహరణగా నిలిచారు. "పద్మావతి సినిమా విడుదల సందర్భంగా.. యువరాణిగా నటించిన దీపికా పదుకొన్, దండయాత్ర చేసిన రాజుగా నటించిన రణ్‌వీర్ సింగ్ మధ్య ఒక ముద్దు సీన్ ఉండొచ్చన్న పుకార్లు వచ్చాయి. దాంతో ఆగ్రహించిన కొందరు సినిమా సెట్లను ధ్వంసం చేశారు. డైరెక్టర్‌ను చెంపదెబ్బ కొట్టారు. హీరోయిన్ ముక్కు కోస్తామని కూడా బెదిరించారు" అంటూ నాటి ఘటనలను ఆమె గుర్తు చేసుకున్నారు. చర్యలు తీసుకోకపోడం మరింత భారంగా మారుతోంది.
"పరిస్థితిని ఎత్తిచూపడం నాకిష్టం లేదు కానీ ప్రస్తుతం పరిస్థితి చాలా చాలా భయంకరంగా ఉంది. ఇవాళ షో ఏదైనా విడుదలకు ముందే ఏది అభ్యంతరకరంగా ఉండొచ్చు? దేనిపై వివాదం రాజుకోవచ్చు? ఎక్కడైనా సమస్య వస్తే దాన్నుంచి ఎలా బయటపడాలి? అని ప్రొడక్షన్ హౌజ్‌లు ముందే మల్లగుల్లాలు పడుతున్నాయి. కానీ పరిస్థితి అలా ఉండకూడదు" అని ఆమె అన్నారు.
దీన్నుంచి బయటపడే మార్గం లేదా?
"కొన్ని రకాల చిత్రాలు తీస్తున్నందున, కొందరితో మాట్లాడుతున్నందున తాము సేఫ్‌గా ఉన్నామని కొందరు అనుకుంటున్నారు. కానీ ఐకమత్యంగా ఉంటే తప్ప ఎవరూ సురక్షితం కాదని చరిత్ర వాళ్లకు గుణపాఠం నేర్పాలి. ఐక్యతను బాలీవుడ్ కనిపెట్టాలి. ఏదో ఒకటి చేయాలి. ప్రభుత్వాలతో మాట్లాడాలి. చట్టాలను సవరించాలి. ఇది వాక్ స్వాతంత్ర్యాన్ని హరించివేయడం కాదు. మీరు ఫేక్ న్యూస్‌ను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నారు" అని ఆమె అన్నారు.
'మేము భయపడం'
మా పరిశోధనలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అప్‌లోడ్ చేసిన ఒక వీడియో మా కంటపడింది. 2021 సెప్టెంబర్ 9న 'సోషల్ మీడియా సంవాద్' పేరుతో దీన్ని అప్‌లోడ్ చేశారు. 'తన ప్రభుత్వ అభిప్రాయాన్ని బలంగా వినిపించిన కొందరు ముఖ్యమైన ఇన్‌ఫ్లుయెన్సర్ల'తో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడిన వర్చువల్ సమావేశం అది. "ప్రభుత్వం నేరుగా చెప్పలేని చాలా విషయాలు ఉంటాయి. కానీ మీరు ఆ విషయాలు చెప్పగలరు" అంటూ యోగి వారి సేవలను ప్రశంసించారు.
ఇక్కడ మేము 'ఎల్విష్ యాదవ్' అనే ఒక వ్యక్తిని గుర్తించాం. ఆయనొక యూట్యూబరని అంటున్నారు. సీఎంను ఒక ప్రశ్న అడిగే అవకాశం కూడా ఆయనకు ఇచ్చారు. అదే ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన ఒక వీడియోను మేము పరిశీలించాం. బాలీవుడ్ నటులపై పదే పదే దుర్భాషలాడారు. సెక్సియెస్ట్ కామెంట్స్ చేశారు. ఇలాంటివి యూట్యూబ్ పాలసీకి వ్యతిరేకమైనప్పటికీ.. ఈ వీడియో ఇంకా యూట్యూబ్‌లోనే ఉంది. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ స్పందన కోసం బీబీసీ చాలాసార్లు ఆయనకు మెయిల్ చేసింది. కానీ ఆయన స్పందించలేదు.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా సహా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లోని ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు పాల్గొన్న ఇలాంటి వీడియోలను మేము చూశాము. ఈ వీడియోలు రాజకీయ పరమైనవి. కానీ బీజేపీతో తమకు ఎలాంటి సంబంధం లేదని మాతో చెప్పిన చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆ పార్టీ నాయకులతో కలిసి కనిపించారు.
మహారాష్ట్రకు చెందిన బీజేపీ అధికార ప్రతినిధి శ్వేతా షాలిని.. వర్మకు చెందిన యూట్యూబ్ చానల్లో పలుమార్లు కనిపించారు. బీబీసీ ఆమెను సంప్రదించినప్పుడు.. "ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరో మా పార్టీకి తెలియదు. ఏ విధంగానూ ఆయనకు మా పార్టీతో అనుబంధం లేదు. ఆ వీడియోలో కనిపించడం అనేది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. యూత్ లీడర్‌గా ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను" అని ఆమె అన్నారు.
చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ.. పూనావాలా స్పందించలేదు. చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్లను మేము సంప్రదించాం. కానీ కొందరు మాత్రమే స్పందించారు. చాలా వారాల పాటు మాట్లాడిన తర్వాత దిల్లీలో మమ్మల్ని కలిసేందుకు వర్మ అంగీకరించారు. "నా జాగ్రత్తలు నేను చూసుకోవాలి. నాలాంటి వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక హోటల్‌లో రూం అద్దెకు తీసుకుంటే ఎలా ఉంటుంది" అని ఆయన వాట్సాప్‌లో రిప్లై ఇచ్చారు.
డబ్బు కోసమే సంచలనాత్మక, నిరాధార వీడియోలు చేస్తున్నారా అని మేము వర్మను అడిగాము. దానిని ఖండించిన ఆయన "బాలీవుడ్ అంటే నాకు ద్వేషం లేదు. కానీ నేను దాన్ని ప్రక్షాళన చేయాలని అనుకుంటున్నాను" అని ఆయన సమాధానం ఇచ్చారు. ఇక మరో ఇన్‌ఫ్లుయెన్సర్ సందీప్ ఫొగట్ వెరిఫైడ్ యూట్యూబ్ చానల్ నడుపుతున్నారు. తాను 'సగటు ప్రజల గొంతుక' అని తనను తాను అభివర్ణించుకున్నారు.
బాలీవుడ్‌పై మీకు వ్యక్తిగతంగా ఉన్న అభిప్రాయాలు వీడియోలు చేసేటప్పుడు ప్రభావం చూపుతున్నాయా అని మేము ఆయన్ను అడిగాము. "మా ఆఫీసులో దీపావళి సమయంలో కచ్చితంగా బాలీవుడ్ పాటలు పెడతారు. వరుసగా రెండు సంవత్సరాలు నేను అందులో పాల్గొనలేదు. అందులో పాల్గొనే వారితో నేను మాట్లాడాను. ఇప్పుడు వాళ్లు కూడా అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు" అని వీడియో కాల్‌లో ఆయన చెప్పారు.
ఆయన వీడియోలో చేసిన కొన్నినిరాధార ఆరోపణల గురించి అడిగినప్పుడు.. "మీరు రెండు గంటల నిడివి ఉన్న వీడియోలు చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని కొన్ని మిస్ కావొచ్చు" అని ఆయన అన్నారు. యూట్యూబ్ మీపై చర్యలు తీసుకుంటుందని మీరు భయపడుతున్నారా అని అడిగినప్పుడు.. అలాంటి భయమేదీ లేదని ఈ ఇద్దరు ఇన్‌ఫ్లుయెన్సర్లు చెప్పారు. "ఒకవేళ ఈ చానల్ మూతపడితే ఇలాంటివి మరో పది చానళ్లు ప్రారంభిస్తాను. ఇలాంటి విషయాలనే మళ్లీ మళ్లీ మాట్లాడుతాను" అని ఫొగట్ అన్నారు.
కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు కో ప్యానలిస్టులుగా ఒకరి యూట్యూబ్ చానల్‌లో మరొకరు పరస్పరం కనిపిస్తూ ఉంటారు. నిపుణులుగా వీళ్లు చెప్పే కొందరు వ్యక్తులు ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ యూట్యూబ్ చానల్ నుంచి మరొక చానల్‌కు వెళ్తూ ఉంటారు. వీళ్ల మధ్య మంచి సమన్వయం ఉంటుంది.
యూట్యూబ్ పాత్ర
ఇండియాలో దాదాపు 45 కోట్ల యూజర్లతో (ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లు) ఇలాంటి అతిపెద్ద కంపెనీల్లో యూట్యూబ్ ఒకటిగా ఉంది. కంటెంట్‌కు, అది కోరుకున్న రీచ్‌ను అందిస్తోంది. యూట్యూబ్ అతిపెద్ద మార్కెట్లలో ఇండియా ఒకటి. కంటెంట్ రీచ్‌తో డబ్బులు ఆర్జించడానికి యూట్యూబ్ అవకాశం కల్పిస్తోంది.
ప్రకటనల ఆదాయంలో వారికి వాటా ఇవ్వడం, ఈ చానళ్లకు పెయిడ్ మెంబర్‌షిప్ సౌకర్యం కల్పించడం, చాట్ ఫీచర్, డైరెక్ట్ అపీల్ ద్వారా డబ్బు సంపాదించడానికి యూట్యూబ్ ఇలాంటి చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్లకు అవకాశం కల్పించిందని మేము గుర్తించాం. నిజానికి హానికరమైన తప్పుడు సమాచారంతో నిండి ఉన్న తన చానల్‌లో ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ తన సొంత వస్తువులను కూడా విక్రయిస్తున్నారు.
ఇలాంటి చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్లకు యూట్యూబ్ వెరిఫైడ్ బ్యాడ్జీ కూడా ఇచ్చింది. ఇలాంటి బ్యాడ్జీల వల్ల ప్రేక్షకుల్లో వారిపై కొద్దిగా నమ్మకం ఏర్పడుతుంది. సంచనాత్మక హెడ్‌లైన్లు, తప్పుదోవ పట్టించే థంబ్‌నెయిల్స్, బాలీవుడ్ గురించి తప్పుడు సమాచారం, ప్రముఖ నటీనటులకు సంబంధించిన పుకార్ల వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. మరింత ఎక్కువ ఎంగేజ్‌మెంట్ రావడానికి యూట్యూబ్‌కు సాయం చేస్తున్నాయి. మేము గుర్తించిన విషయాలను యూట్యూబ్‌కు పంపించాము.
"యూట్యూబ్ కమ్యూనిటీని కాపాడటానికి కావాల్సిన విధానాలు, వనరులు, ప్రొడక్టులపై మేము భారీగా నిధులు వెచ్చించాం. మరింత అధీకృత కంటెంట్ మాత్రమే యూజర్లకు చేరేలా మేము మా సెర్చ్, డిస్కవరి అల్గారిథంలను మార్చాము. యూట్యూబ్‌లో ఎలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి జరగకుండా చూసేందుకు మా టీములు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాయి" అని యూట్యూబ్ ప్రతినిధి ఒకరు చెప్పారు.
తమ చానళ్ల ఖాతాలను వెరిఫై చేసుకోవడానికి, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ డబ్బు సంపాదించడానికి ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్లు ఎందుకు ప్రయత్నిస్తున్నారని మేము యూట్యూబ్‌ను అడిగాము. తమ సొంత కంటెంట్ పాలసీలకు వ్యతిరేకంగా ఉన్న వీడియోలను కూడా యూట్యూబ్ ఎలా రెకమెండ్ చేస్తోందో మొజిల్లా ఫౌండేషన్‌కు చెందిన రిగ్రెట్స్ రిపోర్టర్ అనే ప్రాజెక్టు బయటపెట్టింది. అలాంటి కంటెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు హానీ తలపెడుతోందని పేర్కొంది. అతిపెద్ద క్రౌడ్‌సోర్సుడ్ ఇన్వెస్టిగేషన్ ఇదేనని ఆ ప్రాజెక్టు చెబుతోంది.
భారత్‌లాంటి ఆంగ్లేతర భాషల మార్కెట్‌లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని మొజిల్లా నివేదికను రాసిన సహా రచయిత బ్రాండీ గేర్‌కింగ్ అన్నారు. "ఇంగ్లిష్ ప్రాథమిక భాషగా ఉన్న దేశాల కంటే ఇంగ్లిష్ ప్రాథమిక భాషగా లేని దేశాల్లో రిగ్రెట్ రేటు 60శాతం ఎక్కువగా ఉందని మా అధ్యయనంలో తేలింది" అని బ్రాండీ అన్నారు.
యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఒకరు తనను తాను రక్షించుకోవడం ఎలా?
యూట్యూబ్‌లో, గూగుల్‌లో మీ డేటా సెట్టింగ్‌లు చూడండి. అక్కడ మీకొక అవకాశం ఉంటుంది. ఉదాహరణకు.. మీ వాచ్ హిస్టరీ, యూట్యూబ్‌లో సెర్చ్ హిస్టరీ చూడండి. సిఫార్సుల వల్ల మీపై ప్రభావం పడకుండా ఉండేలా చూసుకోండి. అక్కడ కొన్ని కంట్రోల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 'ఈ చానల్‌ను రెకమండ్ చేయొద్దు'.. 'ఈ వీడియోలో నాకు ఆసక్తి లేదు' అని సూచించొచ్చు. ప్రైవేట్ బ్రౌజింగ్ విండోలు మీరు తప్పనిసరిగా లాగిన్ కాలేదని నిర్ధారించుకోవడానికి నిజంగా గొప్ప మార్గం. దీంతో మీరు ఏదైనా చూస్తున్నట్లయితే అది మీ ప్రొఫైల్‌కు జతకాదు. మీరు యూట్యూబ్‌లో చేయబోయే పనులన్నింటిపై ఇది ప్రభావం చూపుతుంది" ఆమె చెప్పింది.
తర్వాత ఏంటి?
యూట్యూబ్ సహా ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారంపై కేంద్ర ప్రభుత్వం పదే పదే చర్యలు తీసుకుంటున్న సమయంలోనే బీబీసీ పరిశోధనలో పలు కీలక విషయాలు బయటికి వచ్చాయి. 'ఆరోగ్యకర సమాచార వాతావరణాన్ని' కల్పించడానికి, 'భారత వ్యతిరేక ప్రచారాన్ని' తిప్పికొట్టడానికి గత రెండు నెలలుగా భారత మినిస్ట్రీ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ - ఎంఐబీ దాదాపు 55 యూట్యూబ్ చానళ్లను, ఇతర ప్లాట్‌ఫారమ్‌లపై వాటి అకౌంట్లను బ్లాక్ చేసింది.
విషం చల్లుతున్న చానళ్ల గురించి తమకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని జనవరి 21న ఎంఐబీ సెక్రటరీ అపూర్వ చంద్ర ప్రజలకు, మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటివి విషపూరితమైనవని, ఫేక్ న్యూస్ అని యూట్యూబ్‌లాంటి వాళ్లు కూడా గుర్తించాలి. వాళ్ల సిస్టంలోపల కూడా వీటిని గుర్తించాలి. ఎలాంటి పాత్రికేయ విలువలకు ఇవి సరిపోవని గుర్తించాలి అని ఆయన అన్నారు. బీబీసీ ఈ పరిశోధన గురించి, ఎంఐబీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలకు సమాచారం అందించింది. వారి స్పందన తెలపాలని కోరింది. అయితే, పలుమార్లు గుర్తు చేసినప్పటికీ.. అధికార యంత్రాంగం స్పందించలేదు.