కైట్ ఫెస్టివల్ కాస్త ఆందోళనకరంగా మారింది. గాలిపటం కాస్తా ఓ యువకుడిని ఆకాశంలోకి ఎగరేసుకెళ్లింది. అంతే... అతడి గుండె ఆగినంతపనైంది. అతడు ఆకాశంలో అలా ఎగిరెళ్లిపోతుంటే కిందనున్న అతడి స్నేహితులు కేకలు, పెడబొబ్బలు పెట్టారు. అదృష్టవశాత్తూ గాలిపటం దయతలిచి కాస్త కిందకు రావడంతో 15 అడుగుల ఎత్తు నుంచి గాలిపటం తాడు వదిలి బతుకు జీవుడా అంటూ దుమికేశాడు.
ఈ ఘటన డిసెంబరు 20న సోమవారం నాడు శ్రీలంకలోని జాఫ్నాలోని పాయింట్ పెడ్రోలో జరిగింది. అక్కడ గాలిపటాల ఎగురవేత పోటీలో చాలామంది పాల్గొన్నారు. వారిలో ఒకరికి ఆ పోటీ భయంకరంగా మారింది. పెద్ద గాలిపటాన్ని ఎగురవేస్తుండగా అతని బృందంలోని మిగిలినవారు తాడును విడిచిపెట్టడంతో గాలిపటం ఆ యువకుడిని ఆకాశంలోకి ఎగరేసుకుని వెళ్లింది.