తెలంగాణలో 700 మంది బడిపిల్లలకు కరోనావైరస్, 10వ తరగతిలోపు బడులన్నీ మూసేస్తే మంచిది

మంగళవారం, 23 మార్చి 2021 (12:33 IST)
కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే పదో తరగతి లోపు స్కూళ్లు, గురుకులాలు, వసతి గృహాలను వెంటనే ముూసివేస్తేనే మేలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. దీనిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాక, ఒకట్రెండు రోజుల్లో ప్రకటన చేయవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ అంశంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కథనాలు రాశాయి. ఆ కథనాల ప్రకారం

 
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యాసంస్థలు నడిస్తే, కరోనా మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని వైద్యశాఖ హెచ్చరించింది. ఆరు నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థులకు బడులు నిర్వహించకపోవడమే ఉత్తమమని సూచించింది. రాష్ట్రంలోని పలు పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల్లో పదుల సంఖ్యలో విద్యార్థులకు కరోనా సోకిన ఘటనలు ఇటీవల వరుసగా వెలుగుచూశాయి. దీంతో ఎక్కడికక్కడ పెద్దఎత్తున ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు చేసి, ఇన్ఫెక్షన్‌ నిర్ధరణ అయినవారికి చికిత్స అందిస్తున్నారు. మిగతా వారిని హోం క్వారంటైన్‌కు పంపారు.

 
దీనిపై విద్య, వైద్యశాఖలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 6 నుంచి 9 తరగతుల వరకు ప్రత్యక్షంగా క్లాసులు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య పెరగడంతో కోవిడ్‌ నిబంధనల అమలు సాధ్యపడటం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థుల నుంచి వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులకు కరోనా సోకే ప్రమాదం ఉందని వైద్యశాఖ అంచనాకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో విద్యా సంస్థలు నడిపితే కరోనా విజృంభించవచ్చని, 6 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు తరగతులు నిర్వహించకపోవడమే ఉత్తమమని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

 
కరోనా కట్టడికి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, ఆర్టీపీసీఆర్‌ టెస్టుల సంఖ్యను మరింత పెంచాలని సర్కారు నిర్ణయించింది. వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా నియంత్రణలోనే ఉందని ఆయన వెల్లడించారు. ఒకవేళ కేసులు పెరిగితే వైద్యసేవలు అందించేందుకు అన్ని ఆస్పత్రులను సిద్ధంగా ఉంచుతామన్నారు.

 
అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం కొవిడ్‌ అదుపులోనే ఉందని, కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు పెట్టే తీవ్రమైన పరిస్థితి లేదని వైద్యవర్గాలు వెల్లడించాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు