తెలంగాణ: అపరిచితుడికి బైకుపై లిఫ్ట్ ఇస్తే ఇంజెక్షన్‌తో హత్య? ఖమ్మం జిల్లా పోలీసులు ఏమంటున్నారు?

సోమవారం, 19 సెప్టెంబరు 2022 (19:59 IST)
తెలంగాణలోని ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. బైక్ పైన వెళుతున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగి, వెనక కూర్చున్న వ్యక్తి ఇంజెక్షన్‌తో పొడిచి చంపేశారంటూ ఫిర్యాదు వచ్చింది. ఘటనా స్థలంలో నీడిల్‌తో పాటుగా అనుమానాస్పద ఇంజెక్షన్ సంబంధిత వస్తువులు కనిపించడంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. మృతుడి బంధువులు ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ముదిగొండ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెం. 264/2022 గా కేసు నమోదయింది. మృతుడికి పోస్ట్ మార్టమ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ముదిగొండ ఎస్ఐ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

 
చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ చేతివృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తారు. ఆయన వయసు 51 ఏళ్ళు. ఆంధ్రప్రదేశ్‌లో జగ్గయ్యపేట సమీపంలోని గండ్రాయిలో బంధువుల ఇంటికి వెళుతుండగా వల్లభి సమీపంలో ఓ వ్యక్తి లిఫ్ట్ అడిగారు. దాంతో తన బైక్ ఆపి జమాల్ ఆయనను ఎక్కించుకున్నాడు. కొంతదూరం వెళ్లేసరికి తనకు ఇంజక్షన్ ఇచ్చినట్టు అనుమానం రావడంతో బైక్ ఆపాడు. ఆ వెంటనే వెనుక ఉన్న అపరిచితుడు బైక్ దిగి పారిపోయాడు.

 
జమాల్ ఈ విషయాన్ని ఫోన్లో తన భార్యకు తెలియజేశాడు. సోమవారం ఉదయం 9.20 నిమిషాల సమయంలో ఇది జరిగింది. ఆ ఫోన్ మాట్లాడిన వెంటనే అదే ప్రదేశంలో జమాల్ స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని గమనించిన కొందరు స్థానికులు 108కి ఫోన్ చేసి అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆయనకు చికిత్స అందిస్తుండగా ఆస్పత్రిలో మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు.

 
"ఆస్పత్రిలో మరణించిన జమాల్ మృతిపై పలు అనుమానాలున్నాయి. మాకు ఫిర్యాదు అందగానే ఘటనా స్థలానికి వెళ్లాము. అక్కడ ఇంజక్షన్ బాటిల్, సూది కూడా పడి ఉన్నాయి. దాంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాము. దర్యాప్తు జరుగుతోంది. పోస్ట్ మార్టమ్ నివేదిక ఆధారంగా వాస్తవాలు కనుక్కుంటాం" అని ఎస్ నాగరాజు బీబీసీకి తెలిపారు.

 
‘ఇంజక్షన్ ఇచ్చి చంపేశారు’
మృతుడి అల్లుడు ముదిగొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంజక్షన్ ఇచ్చి చంపేశారని ఆరోపించారు. విచారణ చేసి అగంతకులను పట్టుకోవాలని కోరారు. "మాకు ఎవరితోనూ విబేధాలు లేవు. ఆయనను హత్య చేశారు. ఏం జరిగిందో తెలియడం లేదు. మా అత్తను తన ఇంటికి తీసుకెళ్లడం కోసం మా ఇంటికి వస్తున్నారు. దారిలో ఇలా జరిగింది. ఫోన్లో కూడా ఆయన పూర్తిగా చెప్పలేకపోయారు. ఏం జరిగిందో అని కంగారుతో బయలుదేరి వచ్చేసరికి ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. ఇదంతా అనుమానంగా ఉంది" అంటూ ఫిర్యాదుదారుడు నజీర్ పేర్కొన్నారు. జమాల్‌ను హత్య చేశారని, నిందితులను శిక్షించాలని కోరారు.

 
ఇలా ఎన్నడూ లేదు...
"ముదిగొండ నుంచి జగ్గయ్యపేట వైపు వెళ్లే రోడ్డులో ఎప్పుడూ వాహనాల రాకపోకలు ఉంటాయి. అందులోనూ ఉదయం పూట కొంత రద్దీ ఉంటుంది. అలాంటి సమయంలో లిఫ్ట్ అడిగి, బైక్ ఎక్కిన వ్యక్తే ఇంజక్షన్‌తో చంపేశారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటిది మా ఏరియాలో ఎప్పుడూ లేదు. గతంలో ఈ రీతిలో హత్యలు కూడా జరిగిన దాఖలాలు లేవు. అసలేం జరిగిందన్నది పోలీసులకు కూడా అంతుపట్టడం లేదు. విచారణ చేస్తున్నారు. పోస్ట్‌మార్టమ్‌లో ఏమయినా ఆధారాలు దొరుకుతాయేమో చూడాలి" అంటూ ముదిగొండకు చెందిన జర్నలిస్ట్ పి లక్ష్మణ్ అన్నారు. సాధారణ జీవితం గడుపుతున్న జమాల్‌‌ను హత్య చేసేటంత పెద్ద వివాదాలు కూడా లేవని బంధవులు తెలిపినట్టు లక్ష్మణ్ బీబీసీతో అన్నారు. ఈ కేసు మాత్రం చర్చనీయాంశంగా మారిందని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు