తన తండ్రిని కుట్ర చేసి చంపేశారంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌ను కుట్ర చేసి చంపారని ఆరోపించారు. తనను కూడా అలాగే చంపాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరుగుతున్న తన ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ఆమె మాట్లాడుతూ, తెరాస ప్రభుత్వం ఏ క్షణమైనా తన పాదయాత్రను అడ్డుకుని తనను అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. అయితే, తాను బేడీలకు భయపడే మనిషిని కాదన్నారు.
మంత్రి నిరంజన్ రెడ్డిపై విమర్శలు చేసినందుకు తనపై కేసు పెట్టారని షర్మిల చెప్పారు. కానీ, తనపై ఆయన చేసిన విమర్శల మీద పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదన్నారు. తాను పులిబిడ్డను అని, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.
సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే తనను అరెస్టు చేయాలని ఆమె బహిరంగ సవాల్ విసిరారు. పైగా, తన ఊపిరి ఉన్నంతవరకు ప్రజల నుంచి తనను దూరం చేయలేరని, తెరాస పాలకులకు పోలీసులు అండగా ఉంటే తన వెంట ప్రజలు ఉన్నారని, అందువల్ల తనను ఏమీ చేయలేరన్నారు.