తెలంగాణ: ఖమ్మంలో లక్షమందితో షర్మిల బహిరంగ సభ - ప్రెస్ రివ్యూ

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (12:51 IST)
రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టే ఏర్పాట్లలో ఉన్న వైఎస్‌ షర్మిల.. ఏప్రిల్‌ 9న జనం ముందుకు రానున్నట్లు తెలుస్తోందని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ఇచ్చింది. ఖమ్మంలో లక్ష మందితో భారీ సభ ఏర్పాటు చేసి.. అదే వేదికపై పార్టీ ప్రకటన తేదీని వెల్లడించే ఆలోచనలో ఉన్నట్లు ఆ కథనం పేర్కొంది.

 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2003 ఏప్రిల్‌ 9న చేవెళ్ల నుంచి వై.ఎస్‌.ఆర్‌. తన పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పార్టీ పెట్టబోతున్నట్లుగా ప్రకటించడానికి అదే రోజును షర్మిల ఎంచుకున్నట్లు తెలిసిందని ఈ కథనం వెల్లడించింది. ఖమ్మం నుంచి వచ్చిన పలువురు వైఎస్‌ఆర్‌ అభిమానులు గురువారం లోటస్‌పాండ్‌లో షర్మిలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏప్రిల్‌ 9న ఖమ్మంలో సభ నిర్వహణపై చర్చించినట్లు సమాచారం.

 
ఉమ్మడి జిల్లాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న షర్మిల చివరి సమావేశం ఖమ్మంలో చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ నుంచి భారీ కాన్వాయ్‌తో మార్గమధ్యంలో అభిమానులను పలకరిస్తూ వెళ్లాలని, అక్కడ ఆత్మీయ సమావేశంలో పాల్గొని గతంలో నిర్ణయించారు. బుధవారం విద్యార్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించినట్లుగానే మేలో మహిళలతోనూ సమావేశం నిర్వహించాలని షర్మిల బృందం భావిస్తున్నట్లు ఆంధ్రజ్యోతి కథనం వెల్లడించింది. .

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు