టిప్పు సుల్తాన్: బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే..

శుక్రవారం, 20 నవంబరు 2020 (14:12 IST)
‘‘టిప్పు సుల్తాన్‌ తన తండ్రి హైదర్ అలీ కన్నా తక్కువ ఎత్తు ఉండేవారు. ఆయన మేని ఛాయ కూడా నల్లగా ఉండేది. కళ్లు పెద్దవి. చాలా పలచని, తేలికైన సాదాసీదా దుస్తులు ధరించేవారు. తన సహచరులు కూడా అలాగే ఉండాలని కోరుకునేవారు’’ అంటూ టిప్పు సుల్తాన్ గురించి ప్రసిద్ధ చరిత్రకారుడు కల్నల్‌ మార్క్‌ విల్క్‌ రాశారు. గుర్రపు స్వారీ గొప్ప కళ అని టిప్పు భావించేవారని, అందులో ఆయన నేర్పరి అని కూడా మార్క్ వివరించారు.

 
‘‘టిప్పు ఎప్పుడూ గుర్రం మీద స్వారీ చేస్తూ కనిపించేవారు. పల్లకిలో కూర్చొని వెళ్లడానికి ఆయన అస్సలు ఇష్టపడేవారు కాదు’’ అని రాశారు. బ్రిటీష్ లైబ్రరీలో ఉన్న ‘అన్ అకౌంట్‌ ఆఫ్‌ టిప్పు సుల్తాన్ కోర్ట్’ అనే పుస్తకంలోనూ టిప్పు సుల్తాన్‌ వ్యక్తిత్వానికి సంబంధించి అనేక వివరాలు ఉన్నాయి. టిప్పు మరణించిన తర్వాత ఈ పుస్తకాన్ని ఆయన మున్షీ మహ్మద్‌ ఖాసిమ్‌ ఓ ఆంగ్లేయ చరిత్రకారుడికి ఇచ్చారు.

 
"టిప్పుసుల్తాన్ కాస్త పొట్టివాడు. నుదురు వెడల్పుగా ఉంటుంది. కళ్లు బూడిద రంగులో ఉంటాయి. పెద్ద ముక్కు, సన్నని నడుముతో ఉండేవారు. మీసం చిన్నగా ఉండేది. గడ్డం ఉండేది కాదు. లండన్‌లోని విక్టోరియా, ఆల్బర్ట్ మ్యూజియంలలో ఆయన చిత్రం ఉంటుంది. సింహం చారలను పోలిన గీతలతో ఉన్న ఆకుపచ్చ పైజామా ధరించి కనిపిస్తాడు. కెంపు, ముత్యంతో ఉన్న ఆకుపచ్చ తలపాగా పెట్టుకుని ఉంటాడు. ఒంటి మీద ఒక ఎరుపురంగు బెల్టు, దానికి ఒక కత్తి వేలాడుతూ ఉంటుంది" అని ఆ పుస్తకంలో ఉంది.

 
సెరింగపటంపై దాడి
అది 1799, ఫిబ్రవరి 14వ తేదీ. జనరల్ జార్జ్‌ హారిస్‌ నాయకత్వంలో 21 వేల మంది సైనికులు వెల్లూర్‌ నుంచి మైసూర్‌ వైపు కదిలారు. మార్చి 20న, కల్నల్‌ వెల్లెస్లీ నాయకత్వంలో 16 వేల మంది సైనికుల బృందం అంబర్ సమీపంలో ఈ సైన్యంలో చేరింది. వీరికి కన్నూర్‌ సమీపంలోని జనరల్ స్టువర్ట్ ఆధ్వర్యంలో 6,420 మంది సైనికుల బృందం కూడా జత కలిసింది. వీరంతా కలిసి టిప్పుసుల్తాన్‌ కోట ఉన్న సెరింగపటం (శ్రీరంగపట్నం)పై దాడి చేశారు.

 
"అంతకు సరిగ్గా ఆరేళ్ల కిందట టిప్పు సుల్తాన్‌ సగం సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయన కోల్పోయిన భూమి మొత్తంపై ఏటా ఆయనకు కోటి రూపాయలకన్నా ఎక్కువ ఆదాయం ఇచ్చేది. ఆ సమయంలో భారతదేశంలో బ్రిటిష్ వారి మొత్తం ఆదాయం 9 మిలియన్ పౌండ్ల స్టెర్లింగ్‌లు. అంటే దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు. క్రమంగా వారు సెరింగపటం కోటను ముట్టడించారు. 1799 మే 3న ఫిరంగులతో కాల్పులు జరిపి కోటగోడను బద్దలు కొట్టారు" అని ప్రఖ్యాత చరిత్రకారుడు జేమ్స్ మిల్ 'ద హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా' పుస్తకంలో రాశారు.

 
మోసం చేసిన టిప్పు సైనికులు
"కోటగోడకు పడిన రంధ్రం అంత పెద్దది కానప్పటికీ, జార్జ్ హారిస్ తన సైనికులను కోటలోకి పంపాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి ఆయనకు వేరే మార్గం కూడా లేదు. ఆయన దగ్గరున్న సామగ్రి అయిపోయింది. సైన్యం ఆకలితో నకనకలాడుతోంది. ఆఖరికి తన గుడారం దగ్గర కాపలాగా ఉంచిన సెంట్రీ కూడా ఆకలితో కృశించిపోయాడని హారిస్‌ తన కెప్టెన్‌ మాల్కమ్‌ ముందు ఒప్పుకున్నారు. నెట్టేస్తే పడిపోయేలా ఉన్నారని చెప్పారు" అని మరో చరిత్రకారుడు ఎస్.ఆర్.లాషింగ్టన్ 'లైఫ్‌ ఆఫ్‌ హారిస్' అనే పుస్తకంలో వివరించారు.

 
మే 3 రాత్రి టిప్పుసుల్తాన్‌ సైన్యానికి తెలియకుండా సుమారు 3 వేల మంది బ్రిటీష్ సైనికులు సహా 5 వేల మంది సైన్యం కందకాల్లో దాక్కున్నారు. దాడి చేయాల్సిన సమయం వచ్చేసరికి టిప్పు సామ్రాజ్యానికి మీర్ సాదిక్ ద్రోహం చేశారు. జీతాల చెల్లింపుల పేరుతో సైన్యాన్ని వెనక్కి పిలిచారు.

 
మరో చరిత్రకారుడు మీర్ హుస్సేన్ అలీ ఖాన్ కిర్మాణి తన 'హిస్టరీ ఆఫ్ టిప్పు సుల్తాన్' పుస్తకంలో కల్నల్ మార్క్ విల్కేస్‌ పుస్తకాన్ని ఉటంకిస్తూ.. "టిప్పు సుల్తాన్‌ కమాండర్ జీతం సమస్య గురించి మాట్లాడారు. దీంతో టిప్పు సైనికులు ప్రాకారాల దగ్గరే నిలబడ్డారు. బ్రిటిష్ వారు దాడి చేసినప్పుడు వారు ప్రతిఘటించలేకపోయారు'' అని రాశారు.

 
ఏడు నిమిషాల్లో ఎగిరిన బ్రిటిష్ జెండా
ఇంతలో టిప్పు సుల్తాన్‌కు చెందిన కమాండర్‌ సయీద్‌ గఫార్‌ బ్రిటీష్ వారి ఫిరంగి గుళ్లకు బలయ్యారు. గఫార్‌ మరణించిన వెంటనే సైనికులు బ్రిటీష్ వాళ్లకు తెల్లని రుమాళ్లు చూపించడం ప్రారంభించారు. ఏది ఎప్పుడు చేయాలో, బ్రిటీష్ వాళ్లు ఎప్పుడు కోటపై దాడి చేయాలో ముందే నిర్ణయించారు. సంకేతాలు రాగానే బ్రిటీష్ సైన్యం కోటకు 100 మీటర్ల దూరంలో ఉన్న నది ఒడ్డుకు కదలడం ప్రారంభించింది. నది వెడల్పు 280 గజాలు ఉంది. దీనిలో కొన్ని చోట్ల కాలి పాదాలు మునిగేవరకూ, కొన్నిచోట్ల నడుము లోతు వరకూ నీళ్లున్నాయి.

 
‘‘బ్రిటీష్ సైన్యం కోట వైపు కదులుతుంటే వారిపై టిప్పు సైన్యం దాడి చేయవచ్చు. కానీ అలా జరగలేదు. కేవలం ఏడు నిమిషాల్లో సెరింగపటం కోటపై బ్రిటిష్ జెండా ఎగిరింది’’ అని మేజర్ అలెగ్జాండర్ అలెన్ తన 'అన్ అకౌంట్ ఆఫ్ ద క్యాంపెయిన్‌ ఇన్ మైసూర్' పుస్తకంలో రాశారు.

 
స్వయంగా యుద్ధంలోకి దూకిన టిప్పు సుల్తాన్‌
కోటకు రంధ్రం చేసిన తర్వాత బ్రిటీష్ అధికారులు సైన్యాన్ని రెండుగా విభజించారు. కోటకు ఎడమవైపు నుంచి టిప్పు దళాలు బ్రిటీష్ సైన్యాన్ని ప్రతిఘటించాయి. ఎదురుపడిన ఆంగ్లేయ సైన్యంతో టిప్పు సైన్యం ముఖాముఖి తలపడింది. అదే సమయంలో బ్రిటీష్ పటాలం నాయకుడు కల్నల్ డన్‌లప్‌ మణికట్టుకు కత్తిగాయమైంది. దీని తర్వాత టిప్పు సైన్యం కవాతును నిలిపేసింది.

 
తన సైనికుల్లో ధైర్యం పెంచడానికి టిప్పు సుల్తాన్‌ స్వయంగా యుద్ధరంగంలోకి దిగారు. డన్‌లప్‌ స్థానంలో లెఫ్టినెంట్ ఫరక్ఖార్‌ వచ్చారు. కానీ, ఆయనను టిప్పు సైన్యం వెంటనే చంపేసింది. మే 4వ తేదీ ఉదయం టిప్పు సుల్తాన్‌ తన గుర్రంపై స్వారీ చేస్తూ కోట ప్రాకారాలకు పడిన రంధ్రాన్ని పరిశీలించి మరమ్మతులు చేయమని ఆదేశించారు. దీని తర్వాత ఆయన రాజమహల్‌లో స్నానానికి వెళ్లారు. ఆ రోజు టిప్పుకు శుభకరంగా లేదని జ్యోతిష్కులు హెచ్చరించారు. సాయంత్రం వరకు సైనికులతోనే ఉండాలని సూచించారు.

 
స్నానం చేసిన తరువాత, టిప్పు తన ప్యాలెస్ వెలుపల ఉన్న పేదలకు కొంత డబ్బు పంపిణీ చేశారు. చెనపట్న ప్రధాన పూజారికి ఏనుగు, నువ్వుల బస్తాలు, 200 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఒక నల్ల ఎద్దు, ఒక నల్ల మేక, నల్ల బట్టలతో చేసిన దుస్తులు, 90 రూపాయలు, నూనెతో నిండిన ఇనుప కుండను ఇతర బ్రాహ్మణులకు విరాళంగా ఇచ్చారు. అంతకు ముందు, ఇనుప పాత్రలో ఉంచిన నూనెలో తన నీడను చూశారు. ఇలా చేయడం ద్వారా ఆయనకు ప్రమాదాలు, అడ్డంకులు ఎదురుకావని జ్యోతిష్కులు సూచించారు.

 
తర్వాత ఆయన ప్యాలెస్‌కు తిరిగి వచ్చి రాత్రి భోజనానికి కూర్చున్నారు. తన సన్నిహితుడైన సయీద్ గఫర్ మరణ వార్త ఆయనకు తెలిసింది. కోట పశ్చిమ ప్రాంత భద్రతను గఫర్ చూసేవారు. ‘‘ఈ వార్త విన్న వెంటనే టిప్పు భోజనం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. చేతులు కడుక్కొని గుర్రం ఎక్కి దెబ్బ తిన్న కోట ప్రాకారాలవైపు వెళ్లారు. ఆయన అక్కడకు రాక ముందే, బ్రిటిష్ వారు తమ జెండాను ఎగురవేశారు. ఇప్పుడు కోటలో వారి సంఖ్య పెరగడం మొదలైంది’’ అని 'ఎ వ్యూ ఆఫ్ ది ఆరిజిన్ అండ్ కండక్ట్ ఆఫ్ ద వార్ విత్ టిప్పు సుల్తాన్' అనే పుస్తకంలో లెఫ్టినెంట్ కల్నల్ అలెగ్జాండర్ బీట్సన్ రాశారు.

 
టిప్పును తుపాకీతో కాల్చారు, గుర్రాన్ని కూడా చంపారు
"టిప్పు చాలా యుద్ధాల్లో చాలా సాధారణ సైనికుడిలా నేలమీద ఉండే పోరాటం చేశారు. తన సైనికుల్లో మనోధైర్యం తగ్గినప్పుడల్లా ఆయన మళ్లీ గుర్రం ఎక్కి వారిలో ధైర్యాన్ని పెంచడానికి ప్రయత్నించేవారు" అని బీట్సన్‌ రాశారు. టిప్పు కోరుకుంటే యుద్ధభూమి నుంచి పారిపోగలిగేవారని, కానీ ఆయన అలా చేయలేదని మార్క్‌ విల్కేస్‌ రాశారు. ఆ సమయంలో కోట కమాండర్‌ మీర్ నదీమ్ కోట గేటు పైకప్పుపై నిలబడ్డారు. కానీ ఆయన తన సుల్తాన్‌ పరిస్థితిని గమనించలేదు. అప్పటికే టిప్పుకు గాయాలయ్యాయి.

 
టిప్పు కోట లోపలి గేటువైపు వెళ్లినప్పుడు, ఆయన ఛాతీ ఎడమవైపు భాగాన్ని చీల్చుకుంటూ ఒక బుల్లెట్ బయటకు వచ్చింది. ఆయన గుర్రాన్ని కూడా బ్రిటీష్ వాళ్లు చంపేశారు. సహచరులు టిప్పును ఒక డోలీలో కూర్చోబెట్టి యుద్ధ ప్రాంతం నుంచి బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే అక్కడ చాలా శవాలు పడి ఉన్నాయి.

 
"ఆ సమయంలో ఆయన అంగరక్షకుడు రజాఖాన్ బ్రిటిష్ వారితో సంప్రదింపులు జరపాల్సిందిగా సలహా ఇచ్చారు. కానీ టిప్పు ఈ సలహాను తిరస్కరించారు. బ్రిటిష్ వారి చేతిలో బందీగా ఉండటం కన్నా మరణించడమే మంచిదని ఆయన నిర్ణయించుకున్నారు" అని మేజర్‌ అలెగ్జాండర్‌ అలెన్‌ రాశారు.

 
"కొందరు బ్రిటీష్ సైనికులు కోటలోకి ప్రవేశించారు. కొందరు ఆయన కత్తి ఉన్న బెల్టును లాక్కోడానికి ప్రయత్నించారు. అప్పటికే తీవ్రంగా రక్తమోడుతున్న టిప్పు సుల్తాన్‌ దాదాపు స్పృహలేని స్థితిలో ఉన్నారు. అప్పుడు కూడా ఆయన తన కత్తితో సైనికుడిపై దాడి చేశారు. ఓ ఆంగ్ల సైనికుడి తలపై వేటువేసి చంపారు. అయితే, అప్పుడే అక్కడున్న ఇంకో ఇంగ్లిష్‌ సైనికుడు టిప్పుపై దాడి చేశాడు. అతడి లక్ష్యం రత్నాలు పొదిగిన టిప్పు కత్తిని లాక్కోవడం" అని టిప్పుసుల్తాన్‌ చివరి క్షణాలను వివరిస్తూ బీట్సన్‌ రాశారు.

 
మరణించినా శరీరంలో తగ్గని వేడి
టిప్పు సుల్తాన్ చనిపోయారని బ్రిటిష్ వారికి అప్పటికి తెలియదు. వారు ఆయన్ను వెతకడం కోస ప్యాలెస్‌కు వచ్చారు. ఆయన అక్కడలేరని తెలిసింది. టిప్పు సైన్యంలో ఒకరు వారిని టిప్పు పడిపోయిన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఎటు చూసినా శవాలు, క్షతగాత్రులే. మంటల వెలుగులో టిప్పు సుల్తాన్‌ డోలీ కనిపించింది. దాని కింద టిప్పు అంగరక్షకుడు రజాఖాన్‌ పడి ఉన్నారు. ఆ సైనికుడు టిప్పు పడిపోయిన చోటును చూపించాడు.

 
"టిప్పు మృతదేహాన్ని మా ముందుకు తీసుకువచ్చినప్పుడు, ఆయన కళ్లు తెరిచే ఉన్నాయి. శరీరం చాలా వేడిగా ఉంది. నేను, కల్నల్ వెల్లెస్లీ ఆయన చనిపోయి ఉంటారని అనుకున్నాం. ఆయన నాడిని, గుండెను తాకిన తర్వాత చనిపోయారని నిర్ధరించుకుని మేం ఊపిరి పీల్చుకున్నాం. ఆయన శరీరంపై నాలుగు గాయాలు కనిపించాయి. మూడు శరీరం మీద, ఒకటి నుదుటి మీద ఉన్నాయి. ఒక బుల్లెట్ కుడిచెవిలోకి చొచ్చుకుపోయి ఎడమ చెంపలోకి దూసుకువచ్చింది.

 
ఆయన పట్టు వస్త్రంతో నడుము చుట్టూ కుట్టిన చక్కటి తెల్లని నారతో చేసిన పైజమా ధరించారు. తలపై కిరీటం లేదు. యుద్దంలో ఎక్కడో పడిపోయినట్లు అనిపించింది. ఒక కంకణం తప్ప ఒంటిపై ఎలాంటి ఆభరణాలు లేవు" అని మేజర్‌ అలెగ్జాండర్‌ అలెన్‌ రాశారు. టిప్పు మృతదేహాన్ని తన పల్లకిలో ఉంచాల్సిందిగా జనరల్‌ బయర్డ్‌ ఆదేశించారు. టిప్పుసుల్తాన్‌ ఈ లోకాన్ని విడిచి వెళ్లారని ఆయన ఆస్థానానికి సమాచారం పంపారు. మృతదేహాన్ని రాత్రంతా ఆయన ఆస్థానంలో ఉంచారు.

 
తండ్రి హైదర్ అలీ సమాధి పక్కనే ఖననం
టిప్పుసుల్తాన్‌ శవపరీక్ష రాజమహల్‌లోనే జరిగింది. మరుసటి రోజు సాయంత్రం రాజ్‌మహల్ నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఆయన అంత్యక్రియల బాధ్యతలను ఆయన వ్యక్తిగత సహాయకులు తీసుకున్నారు. శవయాత్రలో నాలుగు బ్రిటిష్ కంపెనీల సైన్యం కూడా పాల్గొంది. 'నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్కాట్లాండ్'లో ఉన్న 'జర్నల్ ఆఫ్ ది వార్ విత్ టిప్పు' అనే పత్రికలో టిప్పు అంత్యక్రియలు జరిగిన తీరు గురించి వివరాలు ఉన్నాయి.

 
టిప్పు సహచరుడు షాజాదా అబ్దుల్ ఖాలిక్ టిప్పు అంత్యక్రియల్లో శవం వెనక నడిచారు. ఆ తరువాత ఆస్థాన ప్రధానాధికారి నడిచారు. వారి వెనక భారీ ఎత్తున జనం వచ్చారు. వారు తమ రాజుపట్ల గౌరవం వ్యక్తం చేస్తూ గట్టిగా నినాదాలు చేశారు. చాలా చోట్ల జనం నేలమీద పడుకుని ఆయనకు నివాళలు అర్పించారు. ఆయన మృతదేహాన్ని లాల్‌బాగ్‌లో హైదర్ అలీ సమాధి పక్కనే ఖననం చేశారు. ఆ తరువాత టిప్పుసుల్తాన్‌ అంత్యక్రియల్లో పాల్గొన్నవారికి 5000 రూపాయలు పంపిణీ చేశారు.

 
టిప్పు కత్తిని అందుకున్న వెల్లెస్లీ
టిప్పు మరణం తరువాత, బ్రిటిష్ సైనికులు సెరంగపటంలో భారీ దోపిడీకి దిగారు. టిప్పు సింహాసనం, ఏనుగుపై వెండి బేసిన్, బంగారం, వెండితో చేసిన ప్లేట్లు, ఆభరణాలతో నిండిన తాళాలు, కత్తులు, విలువైన తివాచీలు, అందమైన పట్టువస్త్రాలు, రత్నాలు నింపిన 20 పెట్టెలు మాత్రం భద్రంగా ఉన్నాయి. అద్భుతమైన టిప్పు లైబ్రరీ కూడా చెక్కుచెదరలేదు. చరిత్ర, సైన్స్, మతానికి సంబంధించి అరబిక్, పర్షియన్, ఉర్దూ హిందీ భాషల్లో 2000కు పైగా పుస్తకాలు అందులో ఉన్నాయి.

 
వజ్రాలు పొదిగిన టిప్పు కత్తిని బ్రిటీష్ సైనికులు వెల్లెస్లీకి సమర్పించారు. ''టిప్పు మరొక కత్తిని బైర్డ్‌కు హారిస్ బహుమతిగా ఇచ్చాడు. సుల్తాన్ సింహాసనంలో ఉన్న పులి తల విండ్సర్ క్యాజిల్ ఖజానాకు పంపారు. టిప్పుసుల్తాన్, మొరారిరావు కత్తులు లార్డ్ కారన్‌వాలిస్‌కు జ్జాపికలుగా పంపారు. అప్పటి వరకు, బ్రిటిష్ వారి ముందు నిలబడ్డ ఒకే ఒక్క ప్రత్యర్ధి టిప్పు. ఆయన కన్నా పెద్ద ప్రత్యర్ధి బ్రిటీష్‌ వాళ్లకు లేరు. ఆయన తరువాత యుద్ధవిద్యలో బ్రిటిష్ వారిని సవాలు చేసేవారే లేకపోయారు’’ అని మేజర్ అలెగ్జాండర్ అలెన్ తన 'అన్ అకౌంట్ ఆఫ్ ద క్యాంపెయిన్ ఇన్ మైసూర్' పుస్తకంలో వివరించారు. ‘‘టిప్పు ఓటమి తరువాత, తూర్పు సామ్రాజ్యం మొత్తం మన కాళ్ళ మీద పడింది" అని పీటర్ ఓబెర్ అనే ఆంగ్ల జర్నలిస్ట్ తన పుస్తకం, రైజ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియాలో రాశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు