ఆవును చంపిన పులి... ఆ ఆవు యజమాని ఎలా పగ తీర్చుకున్నాడంటే
మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (19:21 IST)
తమిళనాడులో వరుసగా పులులు చనిపోతున్నాయి. గత నెల రోజుల్లో ఆరు పులులు మరణించాయి. వీటిలో రెండు పులులు విషం కలిపిన ఆహారం తినడం వల్ల చనిపోయినట్లు అధికారులు తెలిపారు. తన ఆవును చంపినందుకు ప్రతీకారంగా ఒక రైతు విషం పెట్టి పులులను చంపారని నీలగిరి అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
ఏం జరిగింది?
పశ్చిమ కనుమల్లో ఉండే ముదుమలై టైగర్ రిజర్వ్ నీలగిరి జిల్లా కిందకు వస్తుంది. తమిళనాడులో ఉండే పులుల్లో అత్యధికం ఈ రిజర్వుడు ప్రాంతంలోనే ఉంటాయి. సెప్టెంబరు 9న అంటే శనివారం రెండు మగ పులులు చనిపోయి కనిపించాయి. వాటిలో ఒక దాని వయసు 3ఏళ్లు, మరొక దాని వయసు 8ఏళ్లు. కాఫీ తోటలు ఎక్కువగా ఉండే ఎమరాల్డ్ ప్రాంతంలో ఉన్న అవలాంచీ డ్యామ్ వద్ద ఆ రెండు పులులు అనుమానాస్పద రీతిలో చనిపోయి ఉన్నాయని నీలగిరి అటవీశాఖ అధికారులు తెలిపారు. పులుల కళేబరాలకు కాస్త సమీపంలో ఒక ఆవు చనిపోయి ఉంది. దీంతో అనుమానం వచ్చిన అధికారులు 20 మంది సిబ్బందితో విచారణం కోసం టీమ్‌ను ఏర్పాటు చేశారు. స్నిఫర్ డాగ్స్‌ను రంగంలోకి దించారు.
ఆవును చంపాయనే కోపంతో
ఒక రైతు పులులకు విషం పెట్టడం వల్ల అవి చనిపోయాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. పులుల కళేబరాలకు 30 మీటర్ల దూరంలో ఆవు చనిపోయి ఉంది. ఆ ఆవు మాంసం తినడం వల్ల పులులు చనిపోయి ఉండొచ్చని అనుమానించాం. అందువల్ల పులులు, ఆవు కళేబరాల శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపాం. అదే సమయంలో అవలాంచీ డ్యామ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరిదైనా ఆవు కనిపించకుండా పోయిందా అనే విషయాన్ని విచారించాం. ఎమరాల్డ్ ప్రాంతంలో 10 రోజుల కిందట శేఖర్ అనే రైతు ఆవు కనిపించకుండా పోయినట్లు మా విచారణలో తేలింది.
శేఖర్‌ను విచారించగా పులులను తానే చంపినట్లు ఒప్పుకున్నారు. గుర్తు తెలియని జంతువు చేసిన దాడిలో తన ఆవు చనిపోయిందని, అందుకు ప్రతీకారంగా ఆ ఆవు కళేబరంలో విషం కలిపినట్లు శేఖర్ తెలిపారు. పురుగు మందులను ఆవు కళేబరంలో ఆయన కలిపారు. అలా పురుగు మందులు కలిపిన ఆవు కళేబరాన్ని తినడంతో ఆ రెండు పులులు చనిపోయాయి అని బీబీసీ తమిళ్‌తో ముదుమలై ఫీల్డ్ డైరెక్టర్ వెంకేటశన్ తెలిపారు.
30 రోజుల్లో ఆరు పులులు
గత 30 రోజుల్లో తమిళనాడులో 6 పులులు చనిపోయాయి. ఇది చాలా ఆందోళనకరమని పర్యావరణ వేత్తలు అంటున్నారు. ఇది పెద్ద వివాదంగా కూడా మారింది. ఆగస్టు 17న నీలగిరిలోని ఒక ప్రైవేటు ఎస్టేట్‌లో 7 ఏళ్ల పులి అనుమానాస్పద రీతిలో చనిపోయి కనిపించింది. ఆ తరువాత తల్లిలేని రెండు పులి పిల్లలు చనిపోయాయి. వాటి వయసు 14 రోజులు. మరొక ఘటనలో సరిహద్దు కోసం పులుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక ఆడపులి మరణించింది. అవలాంచీ డ్యామ్ వద్ద విషపూరిత ఆహారం తిని చనిపోయిన రెండు పులులను కూడా కలిపితే సుమారు 30 రోజుల వ్యవధిలో ఆరు పులులు చనిపోయినట్లు అయింది.
అటవీశాఖ నిఘా సరిగ్గా లేకపోవడం వల్లే
పులుల మరణం మీద పర్యావరణవేత్తలు, జంతుప్రియులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. ఇందులో అటవీశాఖ వైఫల్యం కూడా ఉందని విమర్శిస్తున్నారు.
వేటగాళ్లు అడవిలోకి చొరబడి పులులను చంపిన తరువాత మాత్రమే అటవీశాఖ అధికారులు గుర్తిస్తున్నారు. నీలగిరి ప్రాంతంలో పులులను వేటాడి, దట్టమైన అడవుల గుండా వేటగాళ్లు తప్పించుకొని పోతున్నారు. అటవీశాఖ నిఘా వ్యవస్థ సరిగ్గా లేకపోవడమే ఇందుకు కారణం.
అడవుల్లో పశువులను మేపేందుకు అటవీశాఖ అనుమతిస్తోంది. కానీ రైతులు మాత్రం రిజర్వుడు ఫారెస్టులోకి పశువులను తోలుకొని పోతున్నారు. అందువల్ల పులులు వంటివి ఆవుల మీద దాడి చేస్తున్నాయి. కాబట్టి పశువులను అడవుల్లోకి తోలుకొని పోయేవారి మీద నిఘా పెట్టడంతో పాటు కొన్ని రకాల ఆంక్షలు విధించాలి అని పులుల మీద పరిశోధనలు చేస్తున్న డా.కుమార గురు, బీబీసీ తమిళ్‌కు చెప్పారు. అయితే ముదుమలై టైగర్ రిజర్వ్‌లో నిఘాను బాగా పెంచినట్లు ఫీల్డ్ డైరెక్టర్ వెంకటేశన్ అన్నారు. వేటగాళ్లను అడ్డుకునే గార్డుల సంఖ్యను పెంచాం. నిఘా కూడా బాగా పెరిగింది. అందువల్లే చనిపోయిన పులులను మేం వెంటనే గుర్తించగలుగుతున్నాం అని ఆయన చెప్పారు.
పులులు ఎందుకు అవసరం?
పర్యావరణ పరిరక్షణలో పులులు చాలా కీలకం. ప్రకృతిలో సమతుల్యం ఉండాలంటే అవి ఎంతో ముఖ్యం. అందువల్ల పులులను రక్షించకుంటే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని డా.కుమార గురు అన్నారు. పులులు లేకపోతే జింకలు, కుందేళ్లు వంటి వన్యప్రాణుల సంఖ్య విపరీతంగా పెరిగి పోతుంది. ఇలా పెరిగి పోయిన జంతువులు గడ్డి, ఇతర మొక్కలను ఖాళీ చేస్తాయి. అది ఎంతో ప్రమాదకరం. ఎందుకంటే నీటిని పట్టి ఉంచడంలో గడ్డి చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అడవుల్లో చోటు దొరక్కపోతే ఆ జంతువులు జనవాసాల్లోకి కూడా వస్తాయి. ఇది మనుషులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణకు దారి తీస్తుంది. అందువల్ల ఆహారపు గొలుసులో పులులది చాలా కీలకపాత్ర. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పులుల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అని డా.కుమార గురు అన్నారు.
మొత్తం పులులు ఎన్ని?
భారతదేశంలో 2022 నాటికి పులుల సంఖ్య 3,682గా నమోదైనట్లు నేషనల్ టైగర్ రిజర్వ్ గణాంకాలు తెలిపాయి. 2006లో ఈ సంఖ్య 1,411గా ఉంది. తమిళనాడులో 2006లో 76 పులులు ఉండగా 2022 నాటికి ఆ సంఖ్య 306కు పెరిగాయి. ఒక్క నీలగిరి ప్రాంతంలోనే 114 పులులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.