టోక్యో ఒలింపిక్స్: కోవిడ్ సూపర్ స్ప్రెడర్ ఈవెంట్‌గా మారకుండా జపాన్ అడ్డుకోగలదా?
శుక్రవారం, 23 జులై 2021 (13:26 IST)
టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం అవుతుంటే కరోనా పాజిటివ్‌గా తేలుతోన్న అథ్లెట్లు, సహాయక సిబ్బంది సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ పెరుగుతున్న కేసులతో ఒలింపిక్స్ ఈవెంట్లు ప్రభావితం అవుతాయేమోననే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు విశ్వక్రీడా వేదిక కరోనా సూపర్ స్ప్రెడర్ ఈవెంట్‌గా మారిపోతుందేమో అని అనుమానాలు పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రాణాంతక మహమ్మారి సమయంలో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ తారా కిర్క్ సెల్ మాత్రమే. ఎలైట్ స్విమ్మర్‌గా ఆమె 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో అమెరికా జట్టు తరఫున రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాత జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీలో సీనియర్ స్కాలర్‌గా కెరీర్ కొనసాగిస్తున్నారు.
ఒలింపిక్ అథ్లెట్‌గా, అంటువ్యాధుల నిపుణురాలిగా అనుభవమున్న ఆమె ఒలింపిక్స్ నిర్వహిస్తోన్న జపాన్ అధికారులు... ప్రజలను, అథ్లెట్లను ఏ విధంగా సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారో బీబీసీకి వెల్లడించారు.
ఒలింపిక్స్‌కు ప్రయాణం
"ఒలింపిక్స్ వరకు ప్రయాణం ఒక అద్భుత అనుభవం. జట్టులో స్థానం సంపాదించిన తర్వాత మన ప్రయాణం ట్రైనింగ్ క్యాంపుతో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత క్రీడా గ్రామానికి చేరుకుంటాం. ఇదంతా చాలా తొందరగా జరిగిపోతుంది" అని సెల్ వివరించారు. "ఎప్పుడైనా నా గతాన్ని గుర్తు చేసుకుంటే అదంతా ఒక కలలా అనిపిస్తుంటుంది. ఎందుకంటే అది చాలా త్వరగా ముగిసిపోయింది. అప్పుడు చాలా జరిగిపోయాయి. అది నా సాధారణ జీవితానికి చాలా భిన్నంగా ఉంటుంది" అని ఆమె గుర్తు చేసుకున్నారు.
చాలా మంది అథ్లెట్లకు ఇలాంటి అనుభవాలే ఉంటాయి. గత ఒలింపిక్స్‌లో 205 దేశాలకు 11,384 మంది అథ్లెట్లు రియో నగరానికి తరలి వచ్చారు. ఇలా ప్రపంచం నలుమూలల నుంచి అథ్లెట్లు కలిసి రావడం వల్ల ప్రమాదకర కోవిడ్ వేరియంట్స్ వేగంగా వ్యాప్తి చెందుతాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "అథ్లెట్లు జపాన్‌కు చేరుకోగానే వారు కరోనా నిర్ధారణ పరీక్షలకు హాజరు అవుతారు. జపాన్ విమానం ఎక్కే ముందు కూడా పోటీదారులు కరోనా పరీక్షలకు హాజరవుతారు. వీటికి అదనంగా ఇక్కడికి వచ్చాక కూడా పరీక్షలు నిర్వహిస్తాం" అని సెల్ తెలిపారు.
జపాన్‌కు చేరుకోగానే లేదా చేరుకున్న కాసేపటికి నిర్వహించిన నిర్దారణ పరీక్షల్లో అనేక మంది అథ్లెట్లకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. 'జపాన్‌కు ఎక్కువ మంది అథ్లెట్లు చేరుకునేకొద్దీ, ఈ పాజిటివ్ కేసులు కచ్చితంగా పెరుగుతుందని' ఆమె అన్నారు. ఒక్కసారి ఒలింపిక్స్ గ్రామం చేరాక అథ్లెట్లు తాము బస చేసిన చోటు నుంచి వేర్వేరు ఒలింపిక్ వేదికల దగ్గరకు ప్రయాణించాల్సి ఉంటుంది. గతంలో ఈ ప్రక్రియ రద్దీగా, చాలా గందరగోళంగా ఉండేది.
ఏథెన్స్ క్రీడల్లో స్విమ్మింగ్ పోటీలు జరుగుతోన్న వేదిక దగ్గరకు సరైన సమయానికి చేరుకునేందుకు తాను రద్దీగా ఉన్న ఒక బస్‌లో కింద కూర్చొని వెళ్లానని డాక్టర్ సెల్ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం అథ్లెట్లు ఇక్కడికి వచ్చిన తర్వాత టోక్యో అంతా ప్రయాణించడం కూడా సాధారణ ఒలింపిక్స్ కు భిన్నంగా ఉండనుంది. అందరూ తిరగడానికి భారీ బస్‌లకు బదులు, ఈసారీ ఎక్కువగా ప్రైవేట్ వ్యాన్లు ఉపయోగించనున్నట్లు ఆమె వెల్లడించారు.
ఒలింపిక్ గ్రామంలో అథ్లెట్ల జీవనం
సాధారణ ఒలింపిక్స్‌తో పోలిస్తే, టోక్యో క్రీడా గ్రామంలో అథ్లెట్ల జీవన విధానం భిన్నంగా ఉండనుంది. "క్రీడా గ్రామంలో ఉండటం ఒక అద్భుతమైన అనుభూతి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే వారిని చూడొచ్చు. మనకు భిన్నంగా ఉండే వారి గురించి తెలుసుకోవడానికి ఇదో మంచి అవకాశం" అని సెల్ చెప్పారు. "కలిసి ఒకే గ్రామంలో ఉండడం, వారితో కలిసి తిరగడం, పక్క పక్క క్వార్టర్స్‌లోనే ఉండటం వల్ల ఇతర అథ్లెట్ల గురించి తెలుసుకోవచ్చు.'
కానీ, కరోనా వల్ల ఇప్పుడు ఉన్న పరిస్థితులు దానికి చాలా విరుద్ధంగా ఉంటాయి. 'ఇతర అథ్లెట్లను కలవడం, వారి సంస్కృతులు తెలుసుకునే అవకాశం ఇప్పుడు ఉండదు. చాలా మంది అథ్లెట్లు వారికి కేటాయించిన వసతి ప్రదేశాల్లోనే తినాల్సి ఉంటుంది' అని సెల్ వెల్లడించారు. డైనింగ్ హాల్ దగ్గర కుర్చీల మధ్యలో ప్లాస్టిక్ తెరలతోపాటూ టేబుళ్లను శుభ్రం చేసేందుకు ఆల్కహాల్ వైప్స్ అందుబాటులో ఉంచుతారు.
తాగడానికి మద్యం ఉండదు. సామాజిక దూరం ఆంక్షల కారణంగా అథ్లెట్ల మధ్య ఎలాంటి రొమాన్స్‌కు తావుండదు. "కేవలం తమ దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు మాత్రమే ఈసారి అథ్లెట్లు క్రీడా గ్రామానికి వస్తారు." "ఒక అథ్లెట్‌గా నావరకు, ఒలింపిక్స్ వేదిక వరకు రావడానికి కచ్చితమైన కారణం, దేశానికి ప్రాతినిధ్యం వహించడమే. పార్టీ చేసుకోడానికి కాదు.. పోటీపడటానికే మాత్రమే ఇక్కడికి రావాలి. నాలుగేళ్ల శ్రమకు ఫలితం పొందడానికి ఒలింపిక్స్‌లో పోటీపడాలి".
"ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తోన్న నగర వైభవాన్ని ప్రదర్శించడం కూడా క్రీడల్లో భాగమే. అందరూ వాటిని చూసి మనమెంత గొప్ప అతిథి అని అర్థం చేసుకుంటారు. కానీ టోక్యో క్రీడలు ఈసారి అథ్లెట్లకు ఆ అనుభూతిని పంచలేవు" అని సెల్ అన్నారు.
పోటీ గురించి...
"అభిమానుల హర్షధ్వానాల మధ్య ఒలింపిక్స్ వేదిక దగ్గరకు పోటీ పడటానికి వచ్చే క్షణం చాలా మధురమైనది. అక్కడికి వచ్చిన ప్రతీ అథ్లెట్‌కు జీవితంలో పెద్ద మధురానుభూతి అదే. ప్రపంచ వేదికపై మన దేశం తరపున పోటీపడడం మనకు దక్కే అతిపెద్ద గౌరవం. ఆ క్షణాలను నేనెప్పుడూ మరచిపోను. జీవితాంతం గుర్తుంచుకునే అనుభవాలవి" అని సెల్ వివరించారు. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే నగరాన్ని సాధారణంగా లక్షలాది పర్యటకులు సందర్శిస్తారు.
"కానీ ఈ ఒలింపిక్స్ లో అలా జరగడం లేదు. ఎందుకంటే క్రీడల్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి అభిమానుల్ని అనుమతించడం లేదు. అథ్లెట్లు, సహాయక సిబ్బంది, కొంతమంది విలేకరులు మాత్రమే ఆతిథ్య నగరంలో పర్యటిస్తారు" అని ఆమె అన్నారు. కోవిడ్ వ్యాప్తిని నిరోధించడానికి తొలుత అధికారులు, విదేశీ ప్రేక్షకులను మాత్రమే నిషేధించారు. కానీ ఆ తర్వాత స్థానిక అభిమానులకు కూడా ఒలింపిక్స్ ప్రత్యక్షంగా వీక్షించే అదృష్టం దూరమైంది. క్రీడలకు ఆతిథ్యమిస్తోన్న నగరంలో కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా అత్యవసర పరిస్థితిని విధించారు. "తమ జట్టులో సహచరులను అథ్లెట్లే ప్రోత్సహించుకోవాలి. ఇప్పటికే ప్రేక్షకులు లేకుండా పోటీల్లో తలపడిన ఆటగాళ్లకు ఇది అలవాటై ఉంటుంది. కానీ అభిమానుల సమక్షంలో ఆడిన అథ్లెట్లకు ఈ అనుభవం కొత్తగా ఉండబోతుంది" అని సెల్ అన్నారు.
సూపర్ స్ప్రెడర్ ఈవెంట్ గా మారనుందా?
అనేక ప్రమాదాల మధ్య ఒలింపిక్స్ లాంటి విశ్వ క్రీడా సంరంభానికి ఆతిథ్యమిస్తోన్న జపాన్ దీనిని సూపర్ స్ప్రెడర్ ఈవెంట్ గా మార్చబోదని సెల్ ఆశాభావం వ్యక్తం చేశారు. "ఈవెంట్‌ను విజయవంతం చేయడానికి క్షేత్ర స్థాయిలో ఎలాంటి చర్యలు అమలు చేస్తారో చూడాలి. ప్రతిరోజూ ప్రతీ అథ్లెట్‌ను పరీక్షించి అనుమానంగా ఉన్న వారిని వెంటనే క్వారంటైన్ కు తరలించాలి. ఆడడానికి వచ్చే అథ్లెట్లందరూ వ్యాక్సిన్ తీసుకునేలా చూడటం వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు. ఇప్పటికే పలువురు అథ్లెట్లు పాజిటివ్ గా తేలినంత మాత్రాన, ఇక్కడి వ్యవస్థ సరిగా పనిచేయట్లేదని కాదు" అని డాక్టర్ సెల్ పేర్కొన్నారు.
"పాజిటివ్ కేసుల్ని గుర్తించడానికి అనుకూలంగా ఇక్కడ వ్యవస్థను డిజైన్ చేశారు. ఇప్పుడు ఆ వ్యవస్థ అదే పనిలో ఉంది. ఇది మంచి విషయమే. కానీ ఒక్కో కేసు పెరిగిన కొద్దీ వైరస్ వ్యాప్తి అధికమయ్యే అవకాశముంది. పరిస్థితులు తారుమారయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ పాజిటివ్ కేసులన్నింటినీ నియంత్రణలోకి తీసుకురాగలమా అనే దానిపై క్రీడల విజయం దాగి ఉంది. నిర్వాహకులు ఆ మేరకు తగిన ప్రణాళికతో ఉన్నారని ఆశిస్తున్నా. ఆ ప్రణాళికలను ఆచరణలో పెట్టడం సాధ్యమవుతుందా లేదా అనేది చూడాలి' అని సెల్ వివరించారు.