వడ్లూరు: ఉషా చిలుకూరి పూర్వీకుల స్వగ్రామం ఇదే.. ‘బీబీసీ తెలుగు’ అక్కడ పర్యటించినప్పుడు ఏం తెలిసిందంటే?

బిబిసి

శుక్రవారం, 19 జులై 2024 (13:48 IST)
చెన్నై-కోల్‌కతాను కలిపే పాత జాతీయ రహదారిలో విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్తూంటే తణుకు పట్టణం రావడానికి 3 కిలోమీటర్ల ముందు (లేదా తాడేపల్లి గూడెం దాటాక 15 కి.మీ. తరువాత) ఎడమ వైపు ఉన్న రోడ్డులో 3 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తే వడ్లూరు గ్రామం వస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి పూర్వీకుల గ్రామం గోదావరి కాలువను ఆనుకుని ఉండే ఈ ఆకుపచ్చటి వడ్లూరే. గ్రామం మధ్యలో నుంచి వెళ్లే తారు రోడ్డు, రోడ్డుకు రెండువైపులా ఉన్న పాత – కొత్త ఇళ్లు, కాస్త ఇరుకుగా ఉండే సందులో పెద్ద పెద్ద ప్రాంగాణల్లో కట్టుకున్న ఇళ్లతో సందడిగా కనిపిస్తుంది ఈ ఊరు.
 
వాస్తవానికి గ్రామంలో ఎవరికీ ఉషా చిలుకూరి గురించి, అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి పెద్దగా తెలియదు. దానికి తోడు చిలుకూరి ఇంటి పేరుతో ఇప్పుడు ఆ గ్రామంలో ఎవరూ లేకపోవడంతో, వారి బంధువుల గురించి కూడా తెలియదు. బీబీసీ ప్రతినిధులు స్వయంగా కొందరు గ్రామస్తులతో ఈ విషయం చెప్పినప్పుడు, వారికి చిలుకూరి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించారు.
 
ఆలయ నిర్మాణానికి భూదానం
ఆ గ్రామానికి చెందిన ఆడిటర్ పెన్మెత్స చలపతి రాజుకు, ఉషా చిన్న తాత.. అంటే ఉషా తాత తమ్ముడు సుబ్రమణ్య శాస్త్రితో స్నేహం ఉండేది. విశాఖకు చెందిన ప్రొఫెసర్ శాంతమ్మ భర్తే సుబ్రమణ్య శాస్త్రి. ‘గ్రామంలోని చిలుకూరి కుటుంబానికి చెందిన కొంత భూమిని సాయిబాబా గుడికి దానం ఇచ్చారు సుబ్రమణ్య శాస్త్రి. ఆ స్థలంలో మా తాత గారు పెన్మెత్స చలపతిరాజు సాయిబాబా గుడి కట్టించారు. ఆ భూమి చిలుకూరి వారు ఇచ్చారు అన్నంత వరకూ నాకు తెలుసు. ప్రొఫెసర్ శాంతమ్మ గారితో కూడా మాకు పరిచయం ఉంది’ అని బీబీసీతో చెప్పారు గ్రామ మాజీ ప్రెసిడెంట్ శ్రీనుబాబు. అయితే ఆయనకు చిలుకూరి రామశాస్త్రి కుటుంబం గురించి, ఉషా చిలుకూరి గురించి తెలియదు.
 
గ్రామానికి చెందిన ఒక బ్రాహ్మణ కుటుంబానికి, ఉషా చిలుకూరి తాత రామశాస్త్రి కుటుంబానికి బంధుత్వం ఉన్నట్టు ఆ కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే వాళ్లకు కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యవహారం తెలియదు. ఉషా చిలుకూరి గురించి కానీ, అసలు రామ శాస్త్రి పిల్లలు, మనువళ్ల గురించి కానీ ఏమీ తెలియదు. అయితే చిలుకూరి రామ శాస్త్రి వారికి బంధువు అన్నది మాత్రం వారు స్పష్టంగా చెప్పగలిగారు. రామ శాస్త్రి, సుబ్రమణ్య శాస్త్రి ఇతర సోదరుల కుటుంబాలు కొన్ని హైదరాబాద్, బెంగళూరులో ఉన్నట్టు వారు చెప్పారు.
 
ఇంట్లో అందరికీ ఇష్టమైన అమ్మాయి
ఆ సాయిబాబా గుడి ఉన్న వీధికి ఒకప్పుడు చిలుకూరివారి వీధి అనే పేరు ఉండేదనీ, కాలక్రమంలో ఆ బోర్డు కనుమరుగు అయిందని మహిళ ఒకరు చెప్పారు. చిలుకూరి వర్ధనమ్మ అనే మహిళ వడ్లూరు గ్రామంలోని సోమేశ్వరాలయంలో పార్వతీదేవి ప్రతిష్ఠ చేయించినట్టుగా సోమేశ్వరాలయ అర్చక కుటుంబ సభ్యులు తెలిపారు. అంతకుమించి ఆ కుటుంబ వివరాలు వారికీ తెలియదు. ‘‘ఉషా ఇంట్లో అందరికీ ఇష్టమైన అమ్మాయి.’’ అని బీబీసీతో చెప్పారు ఆమె మేనత్త శారద. ట్రంప్ తన పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి పేరు ప్రకటించినప్పటి నుంచీ ఉషా కుటుంబం గురించి అందరూ ఆరా తీస్తున్నారు.
 
ఉషా తల్లితండ్రులు అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. ఆవిడ అక్కడే పుట్టింది. ఆమె తాతది ఆంధ్ర రాష్ట్రంలోని తణుకు దగ్గర వడ్లూరు కాగా, ఆయన చెన్నై వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఉషా మేనత్త చెన్నైలో నివసిస్తున్నారు. ఆమె చిన్న తాత కుటుంబ సభ్యులు విశాఖపట్నంలో నివసిస్తున్నారు. చెన్నైలో వైద్యురాలిగా ఉన్న ఉషా మేనత్త శారద, బీబీసీతో మాట్లాడారు. శారదకు ఉషాతో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ‘‘ఉషా అందరికి ఇష్టమైన అమ్మాయి. తెలివైనది. ఏ విషయాన్నైనా చక్కపెట్టగల సమర్థురాలు’’ అంటూ తన మేనకోడలి గురించి చెప్పారు శారద.
 
‘‘మా ఉషా తన భర్త వాన్స్ వైపు ఉంది కాబట్టి, ఆయనకు గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి’’ అన్నారామె. ‘‘మా మధ్య మరీ అంత దగ్గరి సంబంధాలు లేవు. ఎప్పుడైనా చాట్ చేసుకుంటాం. ఈ వార్త వచ్చాక మాత్రం ఉషాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పాను’’ అన్నారు శారద.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు