చుట్టూ ఆకుపచ్చని గడ్డి మైదానాలు, అగాధాల్లాంటి లోయలు, నీలాకాశం, ఎత్తయిన కొండలు, వాటిపై చిక్కగా అల్లుకున్న వనాలు, వాటినిండా పూలు, పండ్ల వృక్షాలు, చల్లటి గాలి.... ఇలాంటి వాతావరణం మనసుల్ని దోచుకోవాలంటే అట్టే సమయం పట్టదు. ఇంతటి ఆహ్లాదకరమైన ప్రాంతానికి అలా ఎగురుకుంటూ వెళ్లిపోవాలని అనిపిస్తోంది కదూ...! అయితే మైసూరుకు దగ్గర్లో ఉండే "బి.ఆర్. హిల్ స్టేషన్"కు వెళ్దాం పదండి..!
ఈ బి.ఆర్. కొండల మాటున ఉండే అభయారణ్యం ఒకప్పుడు అడవిదొంగ వీరప్పన్ రహస్య స్థావరంగా ఉండేది కాబట్టి, పర్యాటకులు అటువైపు వెళ్లాలంటేనే భయపడేవారు. వీరప్పన్ మరణం తరువాత ఇప్పుడిప్పుడే వన్యప్రాణి అభిమానులు, ప్రకృతి ప్రేమికులు ఈ అరుదైన సహజ ఉద్యానవనాలను సందర్శిస్తున్నారు.
పక్షుల కిలకిలలు... వన్యప్రాణుల విహారాలు...!!
లోతైన లోయలు, ఎత్తైన కొండల అంచుల మీదుగా, దట్టమైన అడవి గుండా సాగే యాత్ర, ప్రకృతి ప్రేమికులకు ఒక అద్వితీయ అనుభూతిని ఇస్తుంది. ఎప్పుడు ఏ పొదల నుండి ఏ వన్యజీవి, మృగం వస్తుందో తెలియని ఉద్విగ్న పరిస్థితిలో ప్రయాణం సాగుతుంది...
దక్షిణ భారత దేశంలో అటు పశ్చమ కనుమలకు, ఇటు తూర్పు కనుమలకు మధ్యనుండే కర్ణాటక ప్రాంతంలో విస్తరించినవే బి.ఆర్. కొండలు. ఆకురాల్చే సతత హరిత, గడ్డి మైదాన అడవులకు ఈ కొండలు ప్రసిద్ధిగాంచాయి. ఏ కొండల గుండె రాగమైనా ఒక అపురూప అనుభవమే అన్నట్లుగా... ఇక్కడి స్వచ్ఛమైన ప్రకృతి కల్మషం లేని హృదయంలాగా అందరికీ ఆహ్వానం పలుకుతుంటుంది.
మైసూరుకు 90 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్న ఈ బి.ఆర్. కొండలు దేశంలోని ప్రముఖ అభయారణ్యాలలో ఒకటిగా పేరుగాంచాయి. సముద్ర మట్టానికి 5,091 అడుగుల ఎత్తులో, సుమారు 500 చదరపు మీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ వనాలలో దాదాపు 270 రకాల వృక్ష జాతులున్నాయి. ఈ అరణ్యంలో సుసంపన్నమైన పుష్ప, ఫల, వృక్ష సంపదకయితే కొదవేలేదు.
ఏనుగుల నివాసానికి ఇదో ఆదర్శ ప్రాంతమని చెబుతుంటారు కూడా.. ఆసియా ఏనుగులు, పులులు చిరుతలకు బి.ఆర్. కొండలు ప్రసిద్ది. ఎక్కడ చూసినా పక్షుల కిలకిలారావాలు, వన్యజీవుల విహారాలు పర్యాటకులకు కనువిందు చేస్తుంటాయి. రాష్ట్ర అటవీశాఖ సందర్శకులకోసం ప్రత్యేక కాటేజీలను అడవి మధ్యలో ఏర్పాటు చేసింది. అక్కడి దాకా జీవులలో వెళ్ళవచ్చు.
కాకపోతే దారి ఎగుడు దిగుడుగా అస్తవ్యస్తంగా ఉంటుంది. లోతైన లోయలు, ఎత్తైన కొండల అంచుల మీదుగా, దట్టమైన అడవి గుండా సాగే యాత్ర, ప్రకృతి ప్రేమికులకు ఒక అద్వితీయ అనుభూతిని ఇస్తుంది. ఎప్పుడు ఏ పొదల నుండి ఏ వన్యజీవి, మృగం వస్తుందో తెలియని ఉద్విగ్న పరిస్థితిలో ప్రయాణం సాగుతుంది. కావేరి నది బి.ఆర్.కొండలకు ఆగ్నేయం వైపున గల కొల్లేగల్ వద్ద ఒక క్లిష్టమైన మలుపు తిరిగి ఉత్తరం వైపునకు ప్రవహిస్తుంటుంది
బి.ఆర్.హిల్స్ వన్యప్రాణి అభయారణ్యం అనేక అడవి జంతువులకు నిలయంగా ఉంది. విభిన్న రకాల వృక్షజాతులు, జంతుజలాలు ఇక్కడ నివాసమేర్పరచుకున్నాయి. లేళ్ళు, దుప్పులు, పాములు, ఎలుగుబంట్లు, చిరుత పులులు, ఏనుగులు, పులులు, రకరకాల పక్షులు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నాయి. తేనె తుట్టెలతో కూడిన చెట్లు ఇక్కడ అనేకం కనిపిస్తాయి. చీకటి పడిందంటే చాలు, రాత్రి సంచార జీవుల సందడి మొదలవుతుంది. రాత్రి పూట ఒక అడవి ఎలా నిద్రపోతుందో స్పష్టంగా తెలుస్తుంది.
ఇక్కడి అభయారణ్యంలో టేకు,దేవదారు తదితర్ వృక్షాలు ఆకాశానికి ఎగబాకినట్లు ఉంటాయి.సుమారు 2000 సంవత్సరాల కిందటిదిగా భావిస్తున్న చెంపక్ చెట్లు ఈ అడవిలో ఉన్నట్లు చెబుతారు."సోలిగస్"గా పిలిచే గిరిజన తెగ ప్రజలు ఈ అడవి వృక్షాన్ని పవిత్రంగా భావించి పూజిస్తారు.
బి.ఆర్.కొండలు అభయారణ్యాన్ని సందర్శించిన వారు అక్కడి "రంగనాథస్వామి ఆలయాన్ని" విధిగా దర్శిస్తారు. ఎత్తైన ఈ పరిసరాల నుండి కనిపించే కొండశ్రేణుల దృశ్యం అత్యద్భుతంగా ఉంటుంది. జీవ వైవిధ్యంతో కూడిన బి.ఆర్.కొండలు ప్రశాంతమైన ప్రకృతి గొప్పదనాన్ని పర్యాటకులకు బోధిస్తాయి.
ముఖ్యంగా బి.ఆర్. కొండలను పిల్లలతో కలిసి పర్యటించడం మంచిది. ఎందుకంటే... ఇక్కడి పక్షులు, రకకాల జంతువులు, అరణ్యంలోని సుందర దృశ్యాలు పిల్లల్ని అలరిస్తాయి, ఆనందాన్నిస్తాయి. వివిధ రకాల జంతుజాలాన్ని దగ్గరగా చూడడం వల్ల ప్రకృతి గమనం వారికి బోధపడుతుంది. పచ్చటి పర్యావరణాన్ని తిలకిస్తూ కొత్త అనుభూతులను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇలాంటి యాత్రలు అహ్లాదాన్నిస్తాయి.
వసతి సౌకర్యాల విషయానికి వస్తే... బి.ఆర్. కొండల అభయారణ్యంలో పర్యాటకులకు కొన్ని వసతి సౌకర్యాలు లేకపోలేదు. అడవిలోని అందమైన ప్రదేశాలలో అటవీ శాఖవారు నిర్మించిన కాటేజీల నుండి వన్యప్రాణులు, అపురూప వన దృశ్యాలను చూడవచ్చు. వీటికి తోడు జంగిల్ లాడ్జిలు, రిసార్ట్స్‌లలోనూ వసతి సౌకర్యాలు ఉంటాయి. ఈ యాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలకు కర్ణాటక అటవీశాఖ అధికారులను సంప్రదిస్తే సరిపోతుంది.