చెన్నపురి విహంగాల విడిది "అడయార్ పార్క్"

వేసవి సెలవులు వచ్చాయంటే చాలు చల్లగా ఉండే ప్రదేశాలు ఎక్కడెక్కడో ఉన్నాయో వెతుక్కుని మరీ, మనం అక్కడ వాలిపోతుంటాం. మన సంగతి సరే.. మరి పక్షులు...? పక్షులకు కూడా వేసవి సెలవులు ఉంటాయా.. ఏంటి? అని అనుకుంటున్నారా..? సెలవులు ఉంటాయో, లేవోనన్న సంగతిని కాసేపలా పక్కన పెట్టేస్తే... పక్షులు ప్రతిఏటా సంతానోత్పత్తి కోసం ప్రపంచం నలుమూలల నుంచి మన దేశంలోని నీటి వనరులను వెతుక్కుని మరీ వచ్చేస్తుంటాయి.

అలా వచ్చిన విహంగాలు ఓ ఆరేడు నెలలపాటు హాయిగా సేదతీరి, తమ సంతానంతో కలిసి స్వదేశాలకు తరలివెళ్తుంటాయి. ఇలా అక్టోబర్ మొదటివారంలో ఏకంగా 20 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ పక్షులు తమిళనాడు రాష్ట్రంలోని వేడన్ తాంగల్, కొడైకెనాల్, నీలగిరి, కన్యాకుమారి తదితర ప్రాంతాలకు చేరుకుంటాయి.

అలా పక్షులు తమకు ఎలాంటి హానికరం లేని వాతావరణం కలిగిన ప్రాంతాన్ని ఎంచుకుని, అక్కడ స్వేచ్ఛగా విహరిస్తూ గుడ్లు పెడతాయి. పిల్లలను పొదుగుతాయి. వాటికి ఆహారం వెతుక్కోవడం నేర్పుతాయి. ఈలోగా సమయం పూర్తయితే తల్లీపిల్లలు ఎంచక్కా వచ్చిన దారినే తుర్రుమంటాయి.

ఇదిలా ఉంటే.. సహజ సిద్ధంగానే నీటి వనరులు, అడవులతో ఉండే దక్షిణ చెన్నయ్ ప్రాంతం నేడు ముళ్ల పొదల మాటుకి చేరిపోయింది. దీంతో దానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకుగానూ... పక్షుల విడిది కేంద్రంగా అభివృద్ధి చేసి, వెలుగులోకి తెచ్చేందుకు అటు తమిళనాడు ప్రభుత్వం, ఇటు ప్రజలు సంయుక్తంగా నడుం బిగించి, ఆ కార్యక్రమాల్లో మునిగిపోయారు.

ఇందులో భాగంగా వంద కోట్ల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకుంటున్నదే "అడయార్ పార్క్". ఈ పథకంలో భాగంగా మొదటి విడతగా 58 ఎకరాల విస్తీర్ణంలో 19 కోట్ల రూపాయల వ్యయంతో అడయారు పక్షుల శరణాలయం శరవేగంగా తయారవుతోంది. వచ్చే సంవత్సరానికల్లా ఈ పార్క్ ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

అలాగే ఈ పార్కులోనే మురికినీటిని రీసైక్లింగ్ చేసే ప్రక్రియతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా బయో ఎరువు తయారీ ప్లాంట్ కూడా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటిదాకా అడయారు పార్కులో 60 వేల మొక్కలను నాటినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక్కడికి ప్రస్తుతం దాదాపు 160 రకాల పక్షులు వలస వచ్చివెళ్తున్నాయని వారంటున్నారు.

పార్కు ఆర్గనైజర్ రెక్స్ మాట్లాడుతూ... అడయారు పార్కులోని మూడు ప్రాంతాలలో పక్షులకు ఆహారంగా చేపపిల్లలను వదిలినట్లు చెప్పారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో 3 కిలోమీటర్ల మేరకు ఫుట్‌పాత్‌లు నిర్మాణమవుతున్నాయని, సందర్శకుల వల్ల పక్షులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు రెక్స్ వివరించారు. సో... అన్ని రకాల పనులనూ పూర్తి చేసుకున్నట్లయితే, అడయార్ పక్షుల విడిది కేంద్రం వచ్చే సంవత్సరానికల్లా మనందరినీ అలరిస్తుందన్నమాట...!!

వెబ్దునియా పై చదవండి