చుండ్రును తొలగించుకోవాలంటే.. కొబ్బరినూనె, వేపనూనెను ఉపయోగించండి అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. కొబ్బరినూనె, వేప నూనెలను మిక్స్ చేసి.. ఆ నూనెను స్నానానికి ముందు తలకు పట్టించి పది లేదా 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చుండ్రును దూరం చేసుకోవచ్చు. దీంతో చుండ్రు పోవడమే కాదు, జుట్టుకు పోషణ అందుతుంది. తద్వారా శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి కూడా.
కొబ్బరినూనె, ఆముదంలను కొద్దిగా సమపాళ్లలో తీసుకుని సన్నని మంటపై వేడి చేయాలి. అనంతరం చల్లారాక ఆ నూనెను వెంట్రుకలకు రాయాలి. ఇలా వారంలో 3, 4 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది చుండ్రు తొలగిపోతుంది. ఇంకా వేపాకులను నీటిలో వేసి బాగా మరిగించి చల్లారాక ఆ నీటిని తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు నుంచి ఉపశమనం కలుగుతుంది.
తులసి ఆకులు, ఉసిరి కాయలను కలిపి పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌ను జుట్టుకి పట్టించి మృదువుగా మర్దనా చేయాలి. ఒక గంటసేపు అలానే వదిలేసి ఆ తర్వాత కడిగేయాలి. దీంతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా కలబంద గుజ్జుతో జుట్టుకు మర్దనా చేసి 15 నిమిషాల పాటు అలానే వుంచి గోరువెచ్చని నీటిలో స్నానం చేస్తే మంచి ఫలితం వుంటుంది.