కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం దేశ వ్యాప్త లాక్‌డౌన్ అమల్లోకి తెచ్చింది. ఇది వచ్చే నెల మూడో తేదీతో ముగియనుంది. కానీ, కరోనా వ్యాప్తి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌ను పొడగించాలంటూ పలు రాష్ట్రాలు కోరుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు కంపెనీల అధిపతి ఆనంద్ మహీంద్రా లాక్‌డౌన్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 49 రోజుల లాక్‌డౌన్ సరిపోతుందని పరిశోధనలు సూచిస్తున్నాయని, అదే నిజమైతే కనుక, ఇండియాలోనూ దాన్ని పూర్తిగా ఎత్తి వేయవచ్చని చెప్పుకొచ్చారు.
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ఇందులో "49 రోజుల వ్యవధి తర్వాత, లాక్‌డౌన్ ఎత్తివేత అనేది సమగ్రంగా వుండాలని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రతి విభాగమూ, మరో విభాగానికి అనుసంధానమై ఉంటుందని గుర్తు చేసిన ఆనంద్ మహీంద్రా, లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేయడం అంత శ్రేయస్కరం కాదన్నారు.
ఈ ఆలోచనతో పారిశ్రామిక రంగంలో రికవరీ చాలా నిదానంగా సాగుతుందని అంచనా వేసిన ఆయన, తయారీ రంగంలోని ఒక్క ఫీడర్ ఫ్యాక్టరీ తెరచుకోకున్నా, దాని ప్రభావం ప్రొడక్ట్ అసెంబ్లింగ్ యూనిట్‌పై పడుతుందని హెచ్చరించారు. కేవలం హాట్‌స్పాట్‌లలో మాత్రమే నిబంధనల అమలు కొనసాగిస్తే సరిపోతుందని" ఆయన సూచించారు.