తన ఉత్పత్తులకు డిమాండ్ లేకపోవడంతో కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేయనున్నట్లు అశోక్ లేల్యాండ్ సోమవారం ప్రకటించింది. అలాగే, సెప్టెంబరు నెలలో ప్రొడక్షన్ హాలీడేను ప్రకటిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. స్టాక్ మార్కెట్లకు కూడా ఈ విషయాన్ని చేరవేసింది.
తమిళనాడు రాష్ట్రంలోని ఎన్నూరు ప్లాంట్‌లో 16 రోజులు, హోసూర్ ప్లాంట్‌లో అయిదు రోజుల పాటు ఉత్పత్తి ఉండదని తెలిపింది. ఇదే నెలలో పంత్‌నగర్ ప్లాంట్‌లో 18 రోజులు, అల్వార్, బందారా ప్లాంట్లలో పదేసి రోజులు ఉత్పత్తి ఉండదని సంస్థ వివరించింది.
కాగా, ఆర్థిక మాంద్యం దెబ్బకు ఇప్పటికే మారుతి సుజికీ సంస్థ కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో పెద్ద కంపెనీ అశోక్ లేల్యాండ్ కూడా ఇదే నిర్ణయాన్ని వెల్లడించడంతో ఆటోమొబైల్ రంగం తీవ్రమైన ఆర్థిక మాంద్యంలో కూరుకున్నట్టు తెలుస్తోంది.