ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్-6 గ్రేడ్ పెట్రోల్

బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (16:46 IST)
దేశ వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్ -6 గ్రేడ్ రకం పెట్రోల్ అందుబాటులోకిరానుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత శుద్ధి అయిన పెట్రోల్, డీజిల్ దిశగా భారత్ అడుగులు వేయనుంది. ప్రస్తుతం మనం యూరో-4 గ్రేడ్ ఇంధనాన్ని వాడుతున్న విషయం తెల్సిందే. కేవలం మూడేళ్ల కాలంలోనే భారత్ ఈ మేరకు పురోగతిని సాధించడం గమనార్హం.
 
నిజానికి ఇంత అతి తక్కువకాలంలో ఈ తరహా ఫీట్‌ను సాధించిన దేశం ఏ ఒక్కటీ లేకపోవడం గమనార్హం. యూరో-4 నుంచి యూరో-5కి అప్‌గ్రేడ్ కాకుండానే దేశంలో యూరో-6 రకం అంటే బీఎస్-6 గ్రేడ్ రకం పెట్రోల్ అందుబాటులోకి రానుండటం గమనార్హం. యూరో-6 పెట్రోల్, డీజిల్ తో వాతావరణ కాలుష్యం చాలా మేరకు తగ్గిపోతుంది.
 
ఇదే అంశంపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఛైర్మన్ సంజీవ్ సింగ్ మాట్లాడుతూ, దేశంలోని అన్ని రిఫైనరీలు 2019 చివరి నాటికే యూరో-6 పెట్రోల్, డీజిల్ ఉత్పత్తని ప్రారంభించాయని... ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి చుక్కను యూరో-6 గ్రేడ్‌తో మార్చబోతున్నాయని చెప్పారు. 
 
ఇప్పటికే అన్ని రిఫైనరీలు బీఎస్-6 ఇంధనాన్ని సప్లై చేయడాన్ని ప్రారంభించాయని... దేశ వ్యాప్తంగా ఉన్న స్టోరేజ్ డిపోలకు ఈ ఇంధనం చేరుతోందని తెలిపారు. దీంతోపాటు... పెట్రోల్ ధరలు కూడా కాస్త పెరుగుతాయని నిపుణులు ఇప్పటికే హెచ్చరించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు