రూ.147 రీఛార్జ్‌తో బీఎస్ఎన్ఎల్ నెల రోజుల ప్లాన్

ఠాగూర్

సోమవారం, 25 ఆగస్టు 2025 (12:57 IST)
జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలు తమ టారిఫ్‌లను పెంచుతూ కనీస రీచార్జ్ ప్లాన్‌ల ధరలను సవరిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు ఒక శుభవార్త తెలిపింది. సామాన్యులను దృష్టిలో ఉంచుకుని అత్యంత చౌకైన రీచార్జ్ ప్లాన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. కేవలం రూ.147కే నెల రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. 
 
ఈ ప్లాన్‌ వివరాల్లోకి వెళ్తే రూ.147తో రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ నెల రోజుల పాటు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా వాయిస్ కాల్స్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. దీంతో పాటు 10 జీబీ హై స్పీడ్ డేటాను కూడా అందిస్తున్నారు. రోజుకు సుమారు ఐదు రూపాయల ఖర్చుతో వినియోగదారులు ఈ ప్రయోజనాలను పొందవచ్చు. 
 
అయితే, ఈ ప్లాన్‌తో ఒక పరిమితి ఉంది. కేటాయించిన 10 జీబీ డేటా వినియోగం పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40 కేబీపీఎస్‌కు తగ్గిపోనుంది. అయితే, అధికంగా ఇంటర్నెట్ వాడే వారికి ఈ ప్లాన్ అంతగా సరిపోకపోవచ్చు. కానీ ప్రధానంగా వాయిస్ కాల్స్ మాట్లాడుతూ, పరిమితంగా డేటా వాడే వారికి ఇది ఒక అద్భుతమైన అప్షన్‌గా నిలుస్తుంది. పెరుగుతున్న రీచార్జ్ ధరల నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ ప్లాన్ బడ్జెట్ వినియోగదారులను ఎంతో సౌకర్యంగా ఉండనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు