రిలయెన్స్ జియో ఉచిత సేవల ప్రకంపనలు ఇంకా టెలికామ్ సంస్థలను వెంటాడుతూనే ఉన్నాయి. జియో పుణ్యమా అని దేశంలోని వివిధ టెలికామ్ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకోవడంలో, ఉన్నవారిని నిలుపుకోవడంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇంతవరకు దేశంలోపలి ఖాతాదారులకు ఉచిత సేవలను అందించడంలో పోటీ పడిన టెలికామ్ సంస్థలు ఇప్పుడు విదేశాల్లో ఉన్న భారతీయులకు సేవలందించడంలోనూ పోటీ పడుతున్నాయి. రియో దెబ్బకు విలవిల్లాడుతున్న బీఎస్ఎన్ఎల్ తాజాగా అంతర్జాతీయంగా ఉచిత వైఫై అంటూ రంగంమీదికి వచ్చేసింది.
హై క్వాలిటీ, వేగవంతమైన డాటా అందించేలా టాటా కమ్యూనికేషన్స్ తో వై ఫై, వైఫై క్లౌడ్ కమ్యూనికేషన్స్ కో్సం ఒక భాగస్వామ్యాన్ని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.
దాదాపు 100కు పైగా దేశాల్లో 4.4 కోట్ల (44మిలియన్ల) వై ఫై హాట్ స్పాట్లను ఏర్పాటు చేయనుంది. అంతర్జాతీయ విమానాలు, రైల్వేలతో సహా ఈ సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్టు టాటా కమ్యూనికేషన్స్ బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. టాటా కామ్ బిఎస్ఎన్ఎల్ చందాదారులు భారతదేశం వెలుపల ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రపంచంలో వైఫై నెట్వర్కుకు అనుమతి ఉంటుందని తెలిపింది. అంతేకాదు వివిధ పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడంలో గజిబిజి లేకుండానే....వై ఫై హాట్ స్పాట్ కు ఒక్కసారి నమోదు అయితే చాలని చెప్పింది. దీంతో వారు వేరు వేరు నగరం, దేశం లేదా ఖండం ఎక్కడున్నా సమీపంలోని వైఫైకి ఆటోమేటిగ్గా కనెక్ట్ అవుతారని టాటా కామ్ వెల్లడించింది.