ఇంతకు ముందెప్పుడూ కనీవినీ ఎరుగన బడ్జెట్, కరోనా తర్వాత వస్తున్న బడ్జెట్ కావడంతో మధ్య తరగతి ఊరట కలిగించే ఎన్నో వరాలు ప్రకటిస్తారని ఆశించినా అదేమీ జరగలేదు. ఆదాయ పన్నుశ్లాబుల్లో ఎలాంటి మార్పులూ లేవు. కేవలం 75 ఏళ్లు పైబడిన పెన్షనర్లకు మాత్రం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని మాత్రం నిర్మల ప్రకటించారు.
అదేవిధంగా బడ్జెట్‌లో ఊరట కోసం చూస్తున్న సామాన్యుల నడ్డి విరిచింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై సెస్ పేరుతో మరింత భారం వేసింది. అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ పేరుతో పెట్రోల్‌పై రూ.2.5, డీజిల్‌పై రూ.4 సెస్ విధించారు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నాయి.
అదేసమయంలో బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకుంటామని పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉంది.
నైలాన్ చిప్స్, నైలాన్ ఫైబర్‌పై కూడా బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో నైలాన్ దుస్తుల ధరలు తగ్గే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్ల ధరలు, కార్ల విడిభాగాల ధరలు కూడా పెరగనున్నాయి. సోలార్ ఇన్వర్టర్లపై పన్ను పెంపు, ఇంపోర్టెడ్ దుస్తులు మరింత ప్రియం కానున్నాయి.