మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలమ్మ

ఠాగూర్

గురువారం, 1 ఫిబ్రవరి 2024 (11:16 IST)
మరో రెండు నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం 2024-25 సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పేదల ఆశలు, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపార వర్గాల భారీ అంచనాల నడుమ ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. గురువారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్ర పద్దును ప్రవేశపెట్టారు. అంతకుముందు బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
 
గతేడాది మాదిరిగా ఈసారీ పేపర్‌లెస్‌ బడ్జెట్‌నే ప్రవేశపెట్టారు. మేక్‌ ఇన్‌ ఇండియా స్ఫూర్తితో తయారుచేసిన ట్యాబ్‌ ద్వారా మంత్రి బడ్జెట్‌ను చదివి వినిపిస్తున్నారు. నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి. దీంతో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ రికార్డును ఆమె సమం చేశారు. దేశంలో తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా ఘనత సాధించిన ఆమె.. 2019 జులై నుంచి ఇప్పటివరకు ఐదు పూర్తి స్థాయి బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. తాజాగా లోక్‌సభ ఎన్నికల ముందు తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు