వార్షిక బడ్జెట్ ఎఫెక్ట్ : పెరగనున్న మొబైల్ టారిఫ్ ధరలు.. యూజర్లపై మరోమారు బాదుడు?

వరుణ్

మంగళవారం, 23 జులై 2024 (21:56 IST)
లోక్‌సభలో మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తొమ్మిది అంశాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఈ బడ్జెట్‌‍ను రూపకల్పన చేశామని విత్తమంత్రి వెల్లడించారు. అయితే, తన ప్రసంగంలో ఆమె చేసిన ఓ ప్రకటన మొబైల్ వినియోగదారుల్లో గుబులు పుట్టిస్తుంది. ఆమె ప్రకటన అమలైతే దేశ వ్యాప్తంగా మరోమారు మొబైల్ టారిఫ్ ధరలు పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదెలాగంటే.. 
 
దేశంలోని టెలికాం కంపెనీలకు అవసరమైన 'ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీస్ (పీసీబీఏ) అనే టెలికాం పరికరం దిగుమతులపై సుంకాన్ని పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ భారాన్ని టెలికాం కంపెనీలు మొబైల్ వినియోగదారులపై మోపే అవకాశం మెరుగ్గా ఉంది. ఇదే జరిగితే మొబైల్ టారీఫ్‌లు మరింత ప్రియం కానున్నాయి. పీసీబీఏల కొనుగోలుకు అయ్యే ఖర్చును టెలికాం కంపెనీలు మొబైల్ యూజర్ల నుంచి వసూలు చేసే అవకాశం ఉంది. అదీ కూడా మొబైల్ టారీఫ్‌ల రూపంలో. 
 
కాగా, ఈ నెల ఆరంభం నుంచి జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఇండియా కంపెనీలు తమ రీచార్జ్ ప్లాన్లను భారీగా పెంచిన విషయం తెల్సిందే. తాజాగా పీసీబీఏపై దిగుమతి సుంకాలు పెరగడంతో ఈ కంపెనీలు తమ రీఛార్జ్ ధరలను మరింత పెంచవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా పీసీబీఏ ధరల పెరుగుదల టెలికం కంపెనీల 5జీ నెట్వర్క్ ప్రణాళికకు ఆటంకం కలిగించవచ్చునని, అందుకు కంపెనీలు టారీఫ్ రేట్ల పెంపు దిశగా అడుగులు వేయవచ్చుననే చర్చ మొదలైంది. రీఛార్జ్ ప్లాన్ల ధరల పెంపునకు దారితీయడం ఖాయమనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు