రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు.. ప్రయాణికులు చేదువార్త

గురువారం, 21 సెప్టెంబరు 2017 (07:29 IST)
రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపికబురు అందించింది. అదేసమయంలో ప్రయాణికులకు చేదువార్త చెప్పింది. దసరా పండుగ సందర్భంగా రైల్వే ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్‌ బోనస్‌(పీఎల్‌బీ)ని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికింద నాన్‌ గెజిటెడ్‌ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వనున్నారు. పీఎల్‌బీ కింద నెలకు రూ.7 వేలు నిర్ణయించారు. అంటే ఆయా ఉద్యోగులకు సుమారు రూ.17 వేలు అదనంగా అందనున్నాయి. దీని ద్వారా దాదాపు 12.30లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. 
 
దసరా పండుగకు ముందే ఈ బోనస్‌ రైల్వే ఉద్యోగులకు అందుతుంది. దీని వల్ల కేంద్రంపై రూ.2,245.45కోట్ల మేర భారం పడనుంది. గతంలో 72 రోజుల పీఎల్‌బీను మాత్రమే ఇచ్చేవారు. కానీ ఆరు సంవత్సరాల క్రితం నుంచి 78 రోజుల బోనస్‌ను ఇస్తున్నట్లు ఆర్థిక శాఖఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.
 
ఇదిలావుండగా, నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం టికెట్‌ ధరను భారీగా పెంచుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రస్తుతం రూ.10గా ఉన్న ధరను 20కి పెంచుతున్నట్టు తెలిపింది. ఈ టిక్కెట్‌ ధరల పెంపు గురువారం నుంచి అక్టోబర్‌ 13 వరకు అమలులో ఉంటుందని అధికారులు స్పష్టంచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు