ఎన్ఆర్ఐల కోసం 64 స్పెషల్ ఫ్లైట్స్... వసూలు చేసే చార్జీలు ఇవే...

మంగళవారం, 5 మే 2020 (21:26 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం వణికిపోతోంది. ఈ వైరస్ బారినుంచి తమతమ దేశాల ప్రజలను కాపాడుకునేందుకు అనేక దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. మరికొన్ని దేశాలు లాక్‌డౌన్ ఆంక్షలను సడలించాయి. అయితే, ఈ లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో దేశ పౌరులతో పాటు.. ప్రవాస భారతీయులు చిక్కుకుని పోయారు. ఇలాంటి వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేకంగా 64 విమానాలను నడుపనుంది. వీరందరనీ దశల వారీగా స్వదేశానికి తీసుకొస్తారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ఇందులోభాగంగా, విదేశాల్లో చిక్కుకున్న, ఉంటున్న దేశ పౌరుల కోసం ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 64 ప్రత్యేక విమానాలు నడపనుంది. 
 
అదేసమయంలో స్వదేశానికి రావాలనుకుంటున్న పౌరులు నుంచి రుసుం వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. లండన్ నుంచి ఢిల్లీ వచ్చే విమానంలో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.50 వేలు, ఢాకా నుంచి ఢిల్లీ వచ్చేందుకు రూ.12 వేలు వసూలు చేయాలని నిర్ణయించారు. 
 
తొలి విడతలో భాగంగా అమెరికా, గల్ఫ్ దేశాలు, మలేసియా, యూకే, సింగపూర్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ దేశాలకు విమానాలు నడపనున్నారు. మొత్తం 14,800 మందిని భారతదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు