షాకిచ్చిన చమురు కంపెనీలు.. వాణిజ్య వంట గ్యాస్ ధరలు పెంపు

ఠాగూర్

మంగళవారం, 1 అక్టోబరు 2024 (10:30 IST)
దేశంలోని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు షాకిచ్చాయి. దేశ వ్యాప్తంగా వాణిజ్య వంట గ్యాస్ ధరలను పెంచింది. ప్రతి నెల ఒకటో తేదీన చమురు కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. ఇందులోభాగంగా, మంగళవారం ఒకటో తేదీ కావడం ధరలను సమీక్షించి, కొత్త ధరలను ప్రకటించాయి. ఇందులో గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయని చమురు కంపెనీలు... కమర్షియల్ గ్యాస్ ధరలను మాత్రం పెంచేశాయి. 
 
ప్రస్తుతం దేశంలో పండగ సీజన్ మొదలైంది. ఇందులోభాగంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్‌గానే చెప్పొచ్చు. వరుసగా మూడో నెల అక్టోబర్లో కూడా గ్యాస్ ధర పెరిగింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటును రూ.50 మేర పెంచుతున్నట్టు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు నేటి (అక్టోబర్ 1) నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి. నవరాత్రి, దసరా, దీపావళి వంటి పండుగల వేళ కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఎదురుదెబ్బ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
తాజా పెంపుతో దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ ధర రూ.1691 నుంచి రూ.1740కి పెరిగింది. కోల్‌కతాలో రూ.1802 నుంచి రూ.1850.50కి, ముంబైలో రూ.1644 నుంచి రూ.1692.50కి, చెన్నెలో రూ.1855 నుంచి రూ.1903కి పెరిగాయి. కాగా అంతకుముందు సెప్టెంబరు 1, ఆగస్టు 1న కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు పెంచిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు