డెబిట్‌ కార్డు చార్జీలు తగ్గనున్నాయ్: జైట్లీ

బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (03:59 IST)
డెబిట్ కార్డులను ఉపయోగిస్తున్న దేశంలోని కోట్లాది మంది వినియోగదారులకు శుభవార్త. 2  వేల రూపాయలకు మించి జరిపే డెబిట్ కార్డు లావాదేవీలపై డిస్కౌంట్ చార్జీలను తగ్గించే దిశగా ఆర్బీఐ కృషి చేస్తున్నట్లు సమాచారం. రాజ్యసభలో మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ఈ విషయమై ప్రకటన చేశారు. డిజిటల్‌ లావాదేవీల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో డెబిట్‌ కార్డు చార్జీల్ని తగ్గించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని జైట్లీ తెలిపారు. రూ. 2 వేలకు మించి జరిపే డెబిట్‌ కార్డు లావాదేవీలపై మార్జినల్‌ డిస్కౌంట్‌ చార్జీల్ని తగ్గించే దిశగా ఆర్‌బీఐ కృషిచేస్తుందన్నారు. డిజిటల్‌ లావాదేవీలు పెరిగితే చార్జీలు తగ్గుతాయన్నారు. పేమెంట్స్‌ అండ్‌ సెటిల్‌మెంట్స్‌ యాక్ట్‌ మేరకు రూ. వెయ్యి వరకూ ఎండీఆర్‌ చార్జీల్ని 0.25 శాతంగా ఆర్‌బీఐ నిర్ణయించిందని, రూ. 2 వేల వరకూ 0.5 శాతం వసూలు చేస్తున్నారని జైట్లీ తెలిపారు. ఈ చార్జీలు జనవరి 1, 2017 నుంచి అమల్లోకి వచ్చాయని, మార్చి 31, 2017 వరకూ అమల్లో ఉంటాయన్నారు.
 
హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు విదేశీ శాఖల్లో భారతీయులు దాచిన రూ.8,200 కోట్ల నల్లడబ్బును గత రెండేళ్లలో పన్ను పరిధిలోకి తెచ్చామని జైట్లీ రాజ్యసభలో తెలిపారు. మరో రూ.8,000 కోట్లను రుణంగా తీసుకున్నట్లు గుర్తించామన్నారు. భారతీయులు దాచిన నల్లడబ్బుపై కచ్చితమైన సమాచారం ప్రభుత్వం వద్ద లేదన్నారు. 
 
పెద్దనోట్ల రద్దు తరువాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చేపట్టిన దాడుల్లో ఇప్పటి వరకు రూ.7.3 కోట్ల నగదు, 5.5 కిలోల బంగారాన్ని జప్తుచేశామని కేంద్రం ప్రకటించింది. 18 మంది అరెస్టయ్యారనీ, మనీలాండరింగ్‌ కార్యకలాపాలకు పాల్పడుతున్న మరో 17 మందిని గుర్తించినట్లు అరుణ్‌ జైట్లీ చెప్పారు. అక్రమ పద్ధతులను గుర్తించడం, నిఘా సమాచారం ఆధారంగా ఆదాయపు పన్ను శాఖ 2016 నవంబర్‌ 9 నుంచి 2017 జనవరి 19 మధ్య కాలంలో 1100 కేసుల్లో దాడులు జరిపిందని వివరించారు. అదే కాలంలో బ్యాంకుల్లోకి వచ్చిన అనుమానాస్పద డిపాజిట్లపై వివరణ కోరుతూ 5,100 నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. 
 

వెబ్దునియా పై చదవండి