పెట్రో భారంపై గగ్గోలు.. రోజువారి సమీక్షకు మంగళం?

మంగళవారం, 2 మార్చి 2021 (12:34 IST)
గత కొన్ని రోజులుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ధరల పెరుగుదలపై ప్రతి ఒక్కరూ గగ్గోలుపెట్టసాగారు. ముఖ్యంగా, కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. ఎన్నికల సమయం కావడంతో కేంద్రం కూడా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. 
 
చమురుపై ఉన్న పన్నులు తగ్గించి సామాన్యులపై పడుతున్న భారాన్ని తప్పించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తులు చేస్తున్నట్టు ముగ్గురు ప్రభుత్వ అధికారులు చెప్పుకొచ్చారు.
 
10 నెలలుగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయని, ఈ కాలంలో ముడి చమురు ధరలు రెట్టింపయ్యాయని ఆ అధికారులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వానికీ ఆదాయం లేకపోవడం, కరోనా ప్యాకేజీలకు భారీగా వెచ్చించడం వంటి కారణాలతో ఖజానాకు భారీగానే గండిపడిందని, అందుకే గత్యంతరం లేని పరిస్థితుల్లో పన్నులు పెంచాల్సి వచ్చిందని అంటున్నారు. 
 
ప్రస్తుతం చమురు రిటైల్ ధరలో పన్నుల వాటానే దాదాపు 60 శాతం దాకా ఉంది. దీంతో చమురుపై ఉన్న పన్నులను తగ్గించేందుకు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, చమురు సంస్థలు, పెట్రోలియం శాఖతో ఆర్థిక శాఖ సంప్రదింపులు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. 
 
వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు ఏ రూపంలో పన్నుల్లో కోత విధించాలన్న దానిపై చర్చిస్తున్నారని అంటున్నారు. ఈ నెల రెండో పక్షం నాటికి ధరలను తగ్గించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. అయితే, పన్నులను తగ్గించే ముందు ధరలను స్థిరీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
 
ముడి చమురు ధరలు పెరిగినా.. రోజువారీగా ధరలను సమీక్షించే పద్ధతిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు. ముడి చమురు ఉత్పత్తిలో కోతలు విధించొద్దని, దాని వల్ల ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతోందని ఒపెక్ దేశాల సమాఖ్యను కోరినట్టు చెబుతున్నారు. ఒపెక్ నుంచి ఎలాంటి నిర్ణయం వచ్చినా ధరలను స్థిరీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు