జన్‌ధన్‌ ఖాతాదారులందరికీ శుభవార్త.. ఉచితంగా బీమా!

ఆదివారం, 8 జులై 2018 (10:57 IST)
జన్‌ధన్ ఖాతాదారులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు శుభవార్త చెప్పనుంది. ప్రతి పౌరుడికి సామాజిక భద్రత లక్ష్యంగా ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించనుంది. ఈ పథకాన్ని ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించనుంది. ఈ పథకం కింద 50 కోట్ల మందిని (10 కోట్ల కుటుంబాలు) ఉచిత ప్రమాద బీమా పరిధిలోకి తీసుకువచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. అయితే, ఇప్పటివరకు ఈ బీమాకు సంబంధించిన విధివిధానాలను కేంద్ర వెల్లడించకపోయినా.. జన్‌ధన్‌ ఖాతాలతో ఈ పథకానికి లంకె ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు సూత్రప్రాయంగా చెబుతున్నారు.
 
ప్రస్తుతం 'దేశంలో 32 కోట్ల మందికి జన్‌ధన్‌ ఖాతాలున్నాయి. వీరిలో రూపే కార్డు వాడుతున్న 24 కోట్ల మంది ఇప్పటికే రూ.లక్ష బీమా పరిధిలో ఉన్నారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కూడా ఇప్పటకే అమల్లో ఉంది. యేడాదికి రూ.12 చెల్లించడం ద్వారా రూ.2 లక్షల కవరేజీతో బీమా పాలసీని తీసుకోవచ్చు. ఇదే తరహాలో ప్రభుత్వమే ఆ రూ.12 చెల్లించి జన్‌ధన్‌ యోజన ఖాతాదారులందరికీ ఉచిత ప్రమాద బీమాను అందించనుంది. అయితే.. జన్‌ధన్‌ ఖాతాదారులు మూడు నెలల్లో కనీసం ఒక్కసారైనా రూపే కార్డును వినియోగించి ఉండాలి' అనే నిబంధనను అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు