ఫైనాన్స్ బిల్లు-2017కు త్వరలో సవరణలు.. ఆ పరిమితి దాటితే వాయింపుడేనట...

మంగళవారం, 21 మార్చి 2017 (18:27 IST)
దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇందులోభాగంగా, ఫైనాన్స్ బిల్లు 2017కు సవరణలు చేయనుంది. ఈ సవరణల ద్వారా రూ.2 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిపితే భారీగా అపరాధ రుసుం వసూలు చేయాలని భావిస్తోంది. అంటే నగదు లావాదేవీలను కేవలం రూ.2 లక్షలకే పరిమితం చేయనుందన్నమాట. 
 
వాస్తవానికి నగదు లావాదేవీలను రూ.3 లక్షలకు పరిమితం చేస్తున్నట్లు బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. మార్చి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రాగా.. ఇప్పుడు దాన్ని రూ.2 లక్షలకు పరిమితం చేసేందుకు సమాయత్తం కానుండటం గమనార్హం. ప్రస్తుతం ఈ బిల్లు విషయమై లోక్‌సభలో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈ నిబంధనను ఉల్లంఘిస్తే.. లావాదేవీకి సమానంగా జరిమానా విధించనున్నట్లు రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అదియా ట్వీట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి